కాంగ్రెస్‌, డీఎంకే సీట్ల సర్దుబాటులో కనిమొళి కీలక పాత్ర

ABN , First Publish Date - 2021-03-09T14:47:10+05:30 IST

డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ పార్టీకి సీట్ల కేటాయింపులపై నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించడంలో ఆ పార్టీ లోక్‌సభ సభ్యురాలు కనిమొళి కీలకపాత్రను పోషించారు. అటు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇటు డీఎంకే...

కాంగ్రెస్‌, డీఎంకే సీట్ల సర్దుబాటులో కనిమొళి కీలక పాత్ర

నేడు స్థానాల ఎంపికపై చర్చ

చెన్నై(ఆంధ్రజ్యోతి): డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ పార్టీకి సీట్ల కేటాయింపులపై నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించడంలో ఆ పార్టీ లోక్‌సభ సభ్యురాలు కనిమొళి కీలకపాత్రను పోషించారు. అటు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇటు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మధ్య చర్చలు సాఫీగా సాగేందుకు కనిమొళి తీవ్ర ప్రయత్నాలు సాగించినట్టు తెలుస్తోంది. కనిమొళి ఓ రాత్రంతా నెరపిన దౌత్యం రెండు పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభనను తొలగించింది. మూడు విడతలుగా జరిపిన చర్చలు ఫలించకపోవడం, 30 సీట్లడిగిన తమకు 18 సీట్లు మాత్రమే ఇస్తామని డీఎంకే అధిష్ఠానం పట్టుబిగించడంతో టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి, ఆ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దినేష్‌గుండూరావు ఖంగుతిన్నారు. రెండు రోజులపాటు సత్యమూర్తి భవన్‌లోనే తిష్టవేసి పార్టీ నిర్వాహకులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ చర్చలలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కొందరు కమల్‌హాసన్‌ నాయకత్వంలోని ‘మక్కల్‌ నీదిమయ్యం’తో పొత్తుపెట్టుకుందామని సలహా ఇచ్చారు. ఈ విషయం ఎలాగో పసిగట్టిన కమల్‌హాసన్‌ తమ కూటమిలో చేరడంటూ కాంగ్రెస్‌ పార్టీకి పిలుపునిచ్చారు. దీనితో డీఎంకే, కాంగ్రెస్‌ సంబంధాలు తెగిపోతాయని అందరూ భావిస్తున్న తరుణంలో డీఎంకే ఎంపీ కనిమొళి తెరపైకి వచ్చారు. శనివారం సాయంత్రం స్టాలిన్‌ ఆమెను కబురు చేసి పిలిపించారు. వెంటనే ఢిల్లీలో ఉన్న సోనియాగాంధీతో సీట్ల సర్దుబాట్లపై కొనసాగుతున్న జాప్యం గురించి, స్థానిక నేతల వైఖరి గురించి వివరించాలని ఆదేశించారు.


ఆ మేరకు కనిమొళి సోనియాగాంధీతో ఫోన్‌లో సంభాషణలు జరిపారు. డీఎంకే ఈసారి 180 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నదని, ఆ కారణంగానే కాంగ్రెస్‌ అడిగినంత సీట్లను కేటాయించలేకపోతున్నామని కనిమొళి ఆమెకు వివరించారు. అంతా ఓపికగా విన్న సోనియాగాంధీ మునుపటిలా తమ పార్టీకి 41 సీట్లు కేటాయించకపోయినా ఫర్వాలేదు, కూటమిలోని మిత్రపక్షాల కంటే అధికంగా కనీసం 30 సీట్లయినా ఇచ్చేందుకు అవకాశం ఉందేమో పరిశీలించమని సోనియాగాంధీ తెలిపారు. ఈ వివరాలను తన సోదరుడైన స్టాలిన్‌కు కనిమొళి వివరించారు. కాంగ్రెస్‌ కూటమి నుంచి వైదొలగకుండా ఉండాలంటే ఇరవైకి పైగా సీట్లిస్తే సమంజసంగా ఉంటుందని స్టాలిన్‌కు వివరించారు. అంతటితో ఆగకుండా సోనియాగాంధీకి మరోమారు ఫోన్‌ చేసి స్టాలిన్‌ను మాట్లాడమని తెలిపారు. ఆ తర్వాత సోనియాతో స్టాలిన్‌ మాట్లాడారు. పావుగంటకు పైగా ఇరువురి మధ్య సంభాషణలు జరిగాయి. సోనియా మాటలు, కనిమొళి హితవచనాలు స్టాలిన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ తర్వాత కాంగ్రెస్‌కు 25 సీట్లు, కన్నియాకుమారి లోక్‌సభ సీటును ఇచ్చేందుకు స్టాలిన్‌ అంగీకరించారు. కనిమొళి అరగంటపాటు జరిపిన రాయబారం ఎట్టకేలకు ఫలించింది. ఈ విషయం టీఎన్‌సీసీ నేతల ద్వారా తెలుసుకున్న ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా హర్షం ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను కాపాడారంటూ కనిమొళి, స్టాలిన్‌ను అభినందించారు. ఆలోపున సోనియాగాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు ఫోన్‌ చేసి వివరాలను తెలిపి వెంటనే స్టాలిన్‌ను కలుసుకోమంటూ ఆదేశించారు. ఆ మేరకే కాంగ్రెస్‌ ప్రతినిధులు శనివారం అర్థరాత్రి తర్వాత కలుసుకోవడం సీట్లు ఖరారుకావటం చకచకా జరిగాయి. ఆదివారం ఉదయం రెండు పార్టీల సుహృద్భావ వాతావరణంలో సీట్ల సర్దుబాట్లపై సవ్యంగా ఒప్పందం కుదిరింది. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించిన కనిమొళికి కాంగ్రెస్‌ నుంచి కూడా అభినందనలు వెళ్లడం విశేషం.

Updated Date - 2021-03-09T14:47:10+05:30 IST