288 రోజుల నిరాహార దీక్ష.. ప్రాణాలు విడిచిన పాపులర్ సింగర్..

ABN , First Publish Date - 2020-04-04T19:33:02+05:30 IST

టర్కీ ప్రభుత్వం నిషేధించిన ప్రముఖ జానపద సంగీత కళా బృందంలో సభ్యురాలు, పాపులర్ సింగర్ హెలిన్ బొలెక్...

288 రోజుల నిరాహార దీక్ష.. ప్రాణాలు విడిచిన పాపులర్ సింగర్..

అంకారా: టర్కీ ప్రభుత్వం నిషేధించిన ప్రముఖ జానపద సంగీత కళా బృందంలో సభ్యురాలు, పాపులర్ సింగర్ హెలిన్ బొలెక్ కన్నుమూశారు. తమ సంగీత బృందంపై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలంటూ 288 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆమె.. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఇస్తాంబుల్‌లో దీక్ష చేస్తున్న ఓ ఇంట్లోనే ఆమె మృతి చెందినట్టు గ్రుప్ యోరుమ్ సంగీత కళా బృందం ట్విటర్లో వెల్లడించింది.టర్కీలో గ్రుప్ యోరుమ్ బృందం ఉద్యమ గీతాలకు మారుపేరు. అయితే నిషేధిత రెవెల్యూషనరీ పీపుల్స్ లిబరేషన్ పార్టీ- ఫ్రంట్‌ (డీహెచ్‌కేపీసీ)తో సంబంధాలున్నాయంటూ.. ప్రభుత్వం గ్రుప్ యోరుమ్‌ను నిషేధించింది. 2016 నుంచి ఈ బ్యాండ్ ప్రదర్శలను నిలిపివేసి.. కొందరు బ్యాండ్ సభ్యులను జైల్లో పెట్టించింది.


గ్రుప్ యోరుమ్‌పై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలనీ.. తమ సభ్యులను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 28 ఏళ్ల హెలిన్, మరో సభ్యుడు ఇబ్రహీం గోక్సెక్ జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గతేడాది నవంబర్‌లో ఈ ఇద్దరినీ జైలు నుంచి విడుదల చేశారు. గొక్సెక్ భార్యతో పాటు మరో ఇద్దరు సభ్యులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. కాగా గత నెల 11న తీవ్ర అస్వస్థతకు గురైన హెలిన్, గోక్సెక్‌లను బలవంతంగా ఆస్పత్రికి తరలించినప్పటికీ.. చికిత్స తీసుకునేందుకు వారు నిరాకరించారు. దీంతో వారిని డిశ్చార్జ్ చేసినట్టు స్థానిక హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ (ఐహెచ్‌డీ) పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించి, దీక్షను విరమింపజేయాలంటూ తాము గత నెలలోనే ప్రభుత్వాన్ని సంప్రదించామనీ.. అయితే దీక్ష విరమిస్తేనే డిమాండ్లను పరిశీలిస్తామంటూ ప్రభుత్వం తిరస్కరించిందని ఐహెచ్‌డీ పేర్కొంది. 

Updated Date - 2020-04-04T19:33:02+05:30 IST