ఐదు శాఖలకు Mekapati Goutham ఒక్కరే.. విలక్షణం.. విభిన్నం!

ABN , First Publish Date - 2022-02-22T16:27:15+05:30 IST

పేషీకి వచ్చేవారిలో సగం మంది రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారుంటే.. సగం మంది..

ఐదు శాఖలకు Mekapati Goutham ఒక్కరే.. విలక్షణం.. విభిన్నం!

అమరావతి/హైదరాబాద్ సిటీ : రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, చేనేత జౌళి శాఖలు.. ఈ ఐదు శాఖలకూ మేకపాటి గౌతమ్‌రెడ్డి మంత్రి. జగన్‌ కేబినెట్‌లో ఇన్ని శాఖలను నిర్వహించింది ఈయనే. మంత్రిగా పనితీరు విభిన్నం. సమర్థ నిర్వహణ ఆయన లక్షణం. పేషీకి వచ్చేవారిలో సగం మంది రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారుంటే.. సగం మంది ఆయన సొంత నియోజకవర్గం ఆత్మకూరువారే. ఎవరొచ్చినా ఆప్యాయంగా మాట్లాడేవారు. అందరితో మాట్లాడాకే పంపించేవారు. అంతేకాదు.. ఏ సమయంలో ఫోన్‌చేసినా స్పందించేవారు. ఒకవేళ ఎక్కడైనా సమావేశాల్లో ఉంటే మళ్లీ చేస్తానని చెప్పి.. చేసేవారు కూడా. ఆగర్భ శ్రీమంతుడైనా ఆ అహం గానీ, ఆ భావన గానీ కించిత్తు కూడా కనిపించేవి కాదు.


ఎదుటివారిని ఆయన స్వాగతించే తీరు, వారితో ప్రవర్తించే తీరు, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితోను ఆత్మీయంగా వ్యవహరించిన తీరు.. ఆయన్ను విలక్షణమైన నాయకుడిగా నిలబెట్టాయి. ఇలా ఉండడం ఎలా సాధ్యమని చాలామంది ఆయన వ్యవహారశైలి చూసి ఆశ్చర్యపోతుండేవారు. శాఖాపరమైన అంశాలకు సంబంధించి ఆయన ప్రయత్నం అసామాన్యం. రెండేళ్లు కొవిడ్‌ ఉన్నా.. పరిశ్రమలు, పెట్టుబడులకు గడ్డుకాలమే అయినా.. తన శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహించేవారు.


రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణకు దిశానిర్దేశం చేసేవారు. పెట్టుబడులు తెచ్చేందుకు సీఎంవో సహకారం కూడా కీలకమని భావించేవారు. అది ఎంతవరకు వచ్చినా.. తన పని తాను చేసుకుపోయేవారు. ఒకరిపై అసంతృప్తి గానీ, అవిశ్వాసం గానీ కనబరిచేవారు కాదు. వీలైనన్ని పెట్టుబడులు తేవాలని మనస్ఫూర్తిగా తపించేవారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా అన్నా, తన సొంత నియోజకవర్గమన్నా ఆయనకు అమితమైన ప్రేమ. అక్కడ పెట్టుబడులు పెట్టాలని పలువురిని ప్రోత్సహించేవారు. 




ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2022-02-22T16:27:15+05:30 IST