Abn logo
Feb 25 2020 @ 14:17PM

నన్ను కించపరిచినందుకే ఈ వివరణ: మెహ్రీన్

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్, హీరో నాగశౌర్య నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌కు మధ్య హోటల్ బిల్లుకు సంబంధించి కొంత వివాదం నెలకొంది. హైదరాబాద్‌లో ఈ భామ బస చేసిన హోటల్ బిల్లు కట్టలేదంటూ ప్రచారం జరిగింది. ఆమె హోటల్ బిల్లు గురించి, లాండ్రీ బిల్లు గురించి, తిండి ఖర్చుల గురించి పలు వెబ్‌సైట్‌లలో వార్తలు వచ్చాయి. అవి మెహ్రీన్ దృష్టికి వెళ్లడంతో ఆమె వివరణ ఇస్తూ తాజాగా ఓ లేఖను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 


`ఐరా క్రియేషన్స్ సంస్థ నిర్మించిన `అశ్వథ్థామ` సినిమా షూటింగ్ సమయంలో నేను బస చేసిన హోటల్ బిల్లుల గురించి వచ్చిన వార్తలు నన్ను బాధపెట్టాయి. ఈ వివాదం నెలకొన్న సమయంలో నేను సైలెంట్‌గా ఉండి హుందాగా వ్యవహరించాను. కానీ, కొన్ని వార్తలు నా గురించి చెడు అభిప్రాయం కలిగించేవిగా ఉన్నాయి. అందుకే నా తరఫున ఈ వివరణ..

సంక్రాంతి సినిమా ప్రమోషన్స్ పూర్తయ్యాక నా కుటుంబాన్ని కలిసేందుకు పంజాబ్‌ వెళ్లాను. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చి మళ్లీ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాను. మా తాతయ్యకు హార్ట్‌ఎటాక్ వచ్చి హాస్పిటల్‌లో ఉన్నప్పటికీ నేను ప్రమోషన్స్ కోసం వచ్చాను. చాలా ఇంటర్వ్యూల్లో నాగశౌర్య కూడా ఈ విషయాన్ని చెప్పారు. `అశ్వథ్థామ` సినిమాకు సంబంధించి అన్ని ప్రమోషన్స్‌లో పాల్గొన్నాను కానీ ఒక్క ఇంటర్వ్యూకు మాత్రం హాజరుకాలేకపోయాను. అలెర్జీతో బాధపడడం వల్ల ఆ ఇంటర్వ్యూకు మాత్రం రాలేకపోయాను. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను నిర్మాతలకు పంపించి ఇంటర్వ్యూకు రాలేకపోతున్నందుకు క్షమాపణలు చెప్పాను. అయితే నిర్మాతలకు నేను రాకపోవడం నచ్చలేదో ఏమో నేను బస చేసిన హోటల్ బిల్స్ కట్టలేమని చెప్పారు. నా మేనేజర్ చేత నిర్మాతలకు ఫోన్ చేయించినా వాళ్లు స్పందించలేదు. దాంతో నా మేనేజర్ చేత నేనే హోటల్ బిల్స్ అన్నీ కట్టించాను. అయితే ఆ తర్వాత వచ్చిన వార్తలు నా కెరీర్‌పై చెడు ప్రభావం చూపే విధంగా ఉన్నాయి.

తెలుగు చిత్ర పరిశ్రమలో నేను 14 సినిమాల్లో నటించాను. కొన్ని సందర్భాల్లో నాకు ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ ఎలాంటి వంకలూ పెట్టకుండా షూటింగ్‌లకు హాజరయ్యాను. నాకు ఏ నిర్మాణ సంస్థతోనూ ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఒక టాబ్లాయిడ్ స్టోరీలో నా తిండి ఖర్చులు, లాండ్రీ బిల్ గురించి ప్రస్తావించడం చాలా బాధనిపించింది. ఏదేమైనా ఈ బాధాకర విషయాన్ని పక్కనపెట్టి నా భవిష్యత్తు ప్రాజెక్టులపై దృష్టి సారిస్తాను. ఇక, ఈ విషయం గురించి నేను స్పందించన`ని మెహ్రీన్ పేర్కొంది. 

`

Advertisement
Advertisement
Advertisement