మేహాద్రి నీరు కలుషితం!

ABN , First Publish Date - 2020-06-03T10:10:27+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి గత నెల ఏడో తేదీన వెలువడిన విష వాయువుల వల్ల సమీపంలోని మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌ ..

మేహాద్రి నీరు కలుషితం!

పాలిమర్స్‌ సమీపంలోని జలాశయం నీటిని శుద్ధి చేయాల్సిందేనని స్పష్టంచేసిన ఎన్‌జీటీ

స్టైరిన్‌ నిల్వలో అనుభవం లేకే ప్రమాదం

 గ్రామాలపైకి 800 టన్నుల స్టైరిన్‌ ఆవిరి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి గత నెల ఏడో తేదీన వెలువడిన విష వాయువుల వల్ల సమీపంలోని మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌ నీరు కలుషితమైందని, దానిని శుద్ధి చేశాకే వినియోగించాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌  (ఎన్‌జీటీ) పేర్కొంది. పాలిమర్స్‌ ప్రమాదం అనంతరం ఎన్‌జీటీ అనేక అంశాలపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంది. వాటిని నివేదికలో పొందుపరిచింది. మేహాద్రిగెడ్డ నీటిని పరిశ్రమలతో పాటు నగరంలో పలు వార్డులకు తాగునీటి కోసం సరఫరా చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత రిజర్వాయర్‌ నీరు రంగుమారిపోయింది. ఈ నేపథ్యంలో మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు ఆ నీటిని ఆ రోజు నుంచి ఉపయోగించడం మానేశారు.ఈ నీటిపై నీరి కమిటీ అధ్యయనం చేసింది.


రిజర్వాయర్‌ నీటిని సేకరించి, వాటిని భాగాలుగా విభజించి వాటిలో చేపలను వేసి పరిశీలించింది. మొత్తం 96 గంటలు అధ్యయనం చేయగా, 72 గంటలు తరువాత ఐదు చేపల్లో రెండు చనిపోయాయి. సాంకేతికంగా దానిని విశ్లేషించి ఆ నీటిలో ఆర్గానిక్స్‌ వున్నాయని, అవి పోవాలంటే...రిజర్వాయర్‌ నీటికి ‘కంబైన్డ్‌ ఓజోన్‌ యాక్టివేట్‌ కార్బన్‌’ ట్రీట్‌మెంట్‌ చేయాలని సూచించింది. ఆ విధంగా చేస్తే..ఆ నీరు శుద్ధి అవుతుందని, అప్పుడు వినియోగించుకోవచ్చునని వివరించింది. రిజర్వాయరులో 60 శాతం నీరు కలుషితమైందని పేర్కొంది.


నిల్వ చేయడం తెలియకే ప్రమాదం

ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ నిత్యం పనిచేసేది. స్టైరిన్‌ని ఒకే ట్యాంకులో నెలల తరబడి నిల్వ వుంచాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. అయితే లాక్‌డౌన్‌ వల్ల దానిని ఉపయోగించకుండా రెండు నెలలు ఉంచేశారు. ఆ నిర్వహణ తెలియకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని ఎన్‌జీటీ పేర్కొంది.  


800 టన్నుల స్టైరిన్‌ ఆవిరి

పాలిమర్స్‌లో మొత్తం 1833 టన్నుల స్టైరిన్‌ నిల్వ ఉంది. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్‌ పాలిమరైజేషన్‌ జరిగి సుమారు 800 టన్నుల స్టైరిన్‌ ఆవిరి రూపంలో పరిసర గ్రామాల్లోకి వెళ్లిందని నిపుణుల కమిటీ అంచనా వేసింది. ప్రమాదం జరిగినప్పుడు ఉష్ణోగ్రతలు 154 డిగ్రీల వరకు వెళ్లాయని ఉటంకించింది. ఆ రోజున  స్టైరిన్‌ పీపీఎం ఎంత అనేది సంస్థ ప్రతినిధులు రికార్డ్‌ చేయలేదని, అది చాలా ప్రమాదకర స్థాయిలో వుండి వుంటుందని కమిటీ అభిప్రాయపడింది.

Updated Date - 2020-06-03T10:10:27+05:30 IST