Abn logo
Feb 22 2021 @ 00:57AM

అభినయ శశిరేఖ

గడుసు పిల్లగా అల్లరి చేసిన ఓ అమ్మాయి..! ఆ తరువాత భర్తకు భార్యగా... పిల్లలకు తల్లిగా... విభిన్న హోదాలు! ఓర్పు, నేర్పుతో సంసార సాగరాన్ని ఈదుతున్న ఆ అమ్మాయి ఎవరో కాదు... మంగ! ప్రతి తెలుగింటికీ పరిచయమై... మహిళా లోకానికి దగ్గరైన మంగలో పరకాయ ప్రవేశం చేశారు మేఘనా లోకేష్‌. ‘కల్యాణ వైభోగం’ సీరియల్‌లో మంగ పాత్రలో అంతగా అభినయాన్ని పండించి... భావోద్వేగాలతో బంధించిన మేఘన మనసులోని మాట ‘నవ్య’కు ప్రత్యేకం... 


ఎనిమిదేళ్ల వయసు. లోకమంటే ఏమిటో తెలియదు. బడికి సెలవులు. నన్ను తీసుకువెళ్లి వేసవి శిక్షణ శిబిరంలో పడేసింది అమ్మ. ఆ శిక్షణ సంస్థ పేరు ‘నటన’. మా ఊళ్లోనే... మైసూరులో ఉంది. సంగీతం, నాట్యంతో పాటు అభినయంలోనూ అక్కడ తర్ఫీదునిస్తారు. అనేకమంది పోటీ పడితే చివరకు ఓ ముప్ఫై మందిని వారు ఎంపిక చేశారు. అందులో నేనూ ఉన్నాను. ఆ శిబిరంలో ప్రముఖ కన్నడ సినీ, రంగస్థల నటుడు మండ్యా రమేశ్‌ పిల్లలందరికీ ఎంతో ఓపికగా అన్నీ నేర్పించేవారు. అక్కడకు వెళ్లాక కళలపై నాకూ ఆసక్తి పెరిగింది. అయితే నాట్యం, సంగీతం కంటే నటనే నన్ను బాగా ఆకట్టుకుంది. 


మహానగరాల్లో ప్రదర్శనలు... 

వేసవి శిబిరం ముగిసింది. నటనలో ఓనమాలు నేర్చుకున్నాను. నటనపై నాకున్న ఆసక్తిని మా గురువు గమనించారు. ‘మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంద’ని మా అమ్మకు చెప్పారు. నిదానంగా చిన్న చిన్న నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభమైంది. కొన్నాళ్లకు మంచి పేరు వచ్చింది. దాంతో మైసూరులోనే కాకుండా ముంబయి, ఢిల్లీ తదితర మహానగరాల్లో ప్రదర్శించిన నాటకాల్లో కూడా నేను నటించాను. నేను ఎక్కడికి వెళ్లినా అమ్మ నాతో వచ్చేది. హైస్కూల్లో ఉన్నప్పుడే సీరియల్స్‌, సినిమాల్లో చేయమని అడిగారు. చదువు పూర్తయ్యే వరకు ఇవేవీ వద్దని ఇంట్లో వాళ్లు చెప్పారు.  


డిగ్రీలో మొదలు... 

ఇంటర్‌ అయింది. బీఎస్సీ డిగ్రీలో చేరాను. స్కూల్లో ఉన్నప్పుడు ఇంట్లోవాళ్లు నటన వైపు వెళ్లద్దన్నారు కానీ నాలో ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. అదే విషయం మా వాళ్లకు చెప్పాను. ఈసారి వాళ్లు నా అభిరుచిని కాదనలేదు. అదే సమయంలో కన్నడ సీరియల్‌ ‘దేవి’ కోసం నన్ను సంప్రతించారు. ఓకే చెప్పాను. అదే నా మొదటి సీరియల్‌. 2011లో వచ్చింది. దానిలో ప్రధాన పాత్ర కాదు... ప్రాధాన్యమున్న పాత్ర. ఆ తరువాత మరో రెండు కన్నడ సీరియల్స్‌ ‘పవిత్ర బంధన, పురుషోత్తమ’ల్లో నటించాను. దీంతో చదువుకు బ్రేక్‌ పడింది. బీఎస్సీ మధ్యలో ఆపేశాను. దూర విద్య ద్వారా బీఏ చేస్తున్నాను. 


భిన్నమైన పాత్రలు...  

సొంత భాషలో బిజీగా ఉన్న నాకు తెలుగు పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. అది కూడా ‘అన్నపూర్ణా స్టూడియోస్‌’ నుంచి! ‘శశిరేఖా పరిణయం’ సీరియల్‌(2013)లో కథానాయికగా చేయమని అడిగారు. చాలా సంతోషించాను. క్షణం ఆలోచించకుండా సరేనన్నాను. శశిరేఖగా తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయమయ్యాను. ఇక్కడ అన్ని వర్గాలవారూ నన్ను బాగా ఆదరించారు. అది అవ్వగానే ‘కల్యాణ వైభోగం’ మొదలైంది. ఇందులో మొదటిసారి నేను మంగ, నిత్యగా ద్విపాత్రాభినయం చేస్తున్నా. నెగటివ్‌, పాజిటివ్‌ షేడ్స్‌ ఉన్న పొంతనలేని పాత్రలివి. నాలుగేళ్లుగా ఈ సీరియల్‌ విజయవంతంగా నడుస్తోంది. ‘రెండు పాత్రల్లో తేడా కనిపించేంతగా నటించగలనా’ అని మొదట అనుకున్నా. అయితే అందరి సహకారంతో ద్విపాత్రల్లో మెప్పించగలుగుతున్నాను. ఇప్పటికి 1,000 ఎపిసోడ్స్‌ పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. ఇది ఆరంభమైన ఏడాదికే ‘రక్తసంబంధం’ సీరియల్‌లో అవకాశం వచ్చింది. దీనిలో తులసిగా నటిస్తున్నా. మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేశాను. అవి పెద్దగా ఆడలేదు. మరోవైపు సీరియల్స్‌తో క్షణం తీరిక లేకపోవడంతో మళ్లీ అటువైపు చూడలేదు. 


దేని కష్టం దానిదే... 

సినిమాలు... సీరియల్స్‌... రెండింటిలో ఏది కష్టమని అడిగితే దేని కష్టం దానిదేనంటాను. సినిమా అంటే ఎన్నో సవాళ్లు! ఇక చిన్న బడ్జెట్‌ చిత్రాలు విడుదల కావడం కూడా పెద్ద విషయమే. నావరకైతే సీరియల్స్‌లో చేయడమే సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే నా ప్రయాణం మొదలైంది బుల్లితెరతోనే కాబట్టి! మనుషులు, కెమెరాలు, పరిసరాలు... అన్నీ పరిచయం ఉన్నవే కావడం వల్ల సుదీర్ఘ షెడ్యూల్స్‌లో చేసినా ఇబ్బంది అనిపించదు. అన్నింటికీ మించి ఇక్కడి పనితీరు నాకు బాగా నచ్చింది. నిజానికి ఏ నటుడికైనా వెండితెరపై అదరగొట్టాలనే కోరిక కచ్చితంగా ఉంటుంది. కనుక మంచి అవకాశం వస్తే సినిమాలు కూడా చేస్తాను. 


విరామం లేని పరిశ్రమ... 

సీరియల్స్‌ చేయడమంటే చూసేవారికి సులువనిపిస్తుంది. కానీ రోజుకు 14 నుంచి 16 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. నేనే కాదు... ఒకే సమయంలో రెండు మూడు సీరియల్స్‌ చేసే ఏ నటులకైనా ఇదే పరిస్థితి. నేనైతే ఆదివారాలు కూడా విరామం లేకుండా ఇరవై ముప్ఫై రోజులు సుదీర్ఘ షెడ్యూల్స్‌ చేస్తుంటాను. మధ్యమధ్యలో మైసూరులో, చెన్నై వెళుతుంటాను. మైసూరులో అమ్మావాళ్లు ఉంటారు. చెన్నైలో మావారు స్వరూప్‌ భరద్వాజ్‌ పనిచేస్తున్నారు. అందుకే హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులూ వరుస షూటింగ్స్‌లో పాల్గొంటాను. ఏది ఏమైనా నటనంటే తెలియని వయసులో నటించడం మొదలుపెట్టాను. చదువకోవాల్సిన సమయంలో సీరియల్స్‌తో బిజీ అయ్యాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. కానీ... నా అభిరుచికి పట్టం కట్టి అందులోనే కొనసాగుతున్నందుకు అంతకుమించిన ఆనందంగా ఉంది. 

- హనుమా 

ప్రత్యేకం మరిన్ని...