‘పౌర’మంటల్లో మేఘాలయ

ABN , First Publish Date - 2020-03-05T08:56:18+05:30 IST

ఒకవైపు బంగ్లాదేశ్‌, మరోవైపు అసోం సరిహద్దులుగా ఉన్న ఈశాన్య రాష్ట్రం మేఘాలయ ఆగ్రహంతో రగిలిపోతున్నది. సీఏఏకు వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్న ఉద్యమాలు ఇటీవల తీవ్ర విధ్వంసానికి దారితీశాయి...

‘పౌర’మంటల్లో మేఘాలయ

ఒకవైపు బంగ్లాదేశ్‌, మరోవైపు అసోం సరిహద్దులుగా ఉన్న ఈశాన్య రాష్ట్రం మేఘాలయ ఆగ్రహంతో రగిలిపోతున్నది. సీఏఏకు వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్న ఉద్యమాలు ఇటీవల తీవ్ర విధ్వంసానికి దారితీశాయి. మరణాల సంఖ్య తక్కువే అయినప్పటికీ, కత్తిపోట్లకు గురైనవారు అధికం. ఆదివాసీయేతరులపై సాగిన విధ్వంసకాండలో అనేక దుకాణాలు, ఇళ్ళు అగ్నికి ఆహుతైనాయి. అనేక జిల్లాల్లో ఇంటర్నెట్‌ నిలిచిపోయి, రాత్రివేళ కర్ఫ్యూ అమలవుతోంది. మిగతా భారతదేశం మాదిరిగానే పౌరసత్వ సవరణ చట్టమే ఈ ఆగ్రహాన్ని రగల్చినప్పటికీ, ఈ రాష్ట్రంలో మాత్రం కారణాలు భిన్నమైనవి.


ఆదివాసీలు, అందునా క్రైస్తవులు అత్యధికంగా ఉన్న మేఘాలయ తనకు పౌర చట్టంతో పెను ప్రమాదం ఉన్నదని నమ్ముతోంది. సవరణ చట్టం ద్వారా బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాలనుంచి వలస వచ్చిన ముస్లిమేతర మతాల వారికి అతి సునాయాసంగా పౌరసత్వం లభిస్తుందన్న విషయం తెలిసిందే. మేఘాలయకు ఉన్న భయం ఈశాన్య రాష్ట్రాలన్నింటికీ ఉన్నప్పటికీ, అసోం, బంగ్లాదేశ్‌లు సరిహద్దులుగా ఉన్నందున ఈ రాష్ట్రానికి అక్రమ వలసదారుల సమస్య అధికం. ముస్లింలను మాత్రమే మినహాయించిన ఈ చట్టం దేశవ్యాప్త ఎన్నార్సీతో కలసి ముస్లింల వేటకు ఉపకరిస్తుందని మిగతాదేశంలో ఉద్యమాలు జరుగుతుంటే, మేఘాలయలో మాత్రం అక్రమవలసదారుల స్థిరీకరణకు ఉపకరిస్తుందన్న భయంతో ఆందోళనలు జరుగుతున్నాయి. అసోం మాదిరిగానే మేఘాలయకు కూడా అక్రమవలసదారులు ఏ మతానికి చెందినవారైనా వారిని పంపించివేయడమే కావాలి. కానీ, కొత్తచట్టంతో వారంతా సక్రమమైనప్పుడు అది సాధ్యపడదని వారి వాదన. అత్యంత శక్తివంతమైన ఆరోషెడ్యూల్‌ అండగా ఉండగా మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం మేఘాలయ వాసులను సముదాయిస్తున్నది. ఆరోషెడ్యూల్‌ ప్రాంతాలకు పౌరసత్వ సవరణ చట్టం నుంచి పూర్తి మినహాయింపు ఇస్తూ కేంద్రప్రభుత్వం అనంతరకాలంలో తీసుకున్న దిద్దుబాటు చర్యలు వారి భయాలను పోగొట్టలేకపోయాయి. ఆరో షెడ్యూల్‌ ప్రాంతాలకు ప్రత్యేక రక్షణలతో పాటు, ఇతరుల ప్రవేశానికి అధికారిక అనుమతి అవసరమన్నది తెలిసిందే. కానీ, పౌరసత్వ చట్ట సవరణతో అన్ని లెక్కలూ మారిపోయిన తరువాత ఆరోషెడ్యూల్‌ తమకు రక్షణనివ్వదని స్థానిక ఆదివాసీల వాదన. అసోంలోని అధికప్రాంతాలు ఆరోషెడ్యూల్‌కు ఆవల ఉన్నందున అక్కడ మరింత అగ్గిరేగిన విషయం తెలిసిందే. దానితో పోల్చితే దాదాపు మొత్తం మేఘాలయ ఈ షెడ్యూల్‌ పరిధిలోకే వస్తుంది. కానీ, బయటివారి ప్రవేశాన్ని మరింత బలంగా కట్టడిచేయగలిగే ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పి) తమ రాష్ట్రానికీ ఇవ్వనంతవరకూ భయాలు తీరవనీ, శాంతించేది లేదని మేఘాలయ అంటున్నది.


పౌరచట్టంతో అక్రమవలసదారులందరినీ పౌరులుగా మార్చేశాక, ఈ ఇన్నర్‌లైన్‌ పర్మి‌ట్‌తో కూడా పెద్ద ప్రయోజనం ఉండదన్న వాదనలు అటుంచితే, అది ఇప్పటికే ఈశాన్యంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరంలో ఉన్నది. సీఏఏ అనంతర ఆందోళనలకు జడిసి మణిపూర్‌లోనూ కేంద్రం ఇటీవల దానిని అనుమతించింది. పౌరచట్టం ఆమోదించగానే అసోం మాదిరిగానే మేఘాలయ కూడా తీవ్రంగా మండిపడింది. తమకూ ఐఎల్‌పి ఇవ్వవలసిందిగా మేఘాలయ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. కానీ, కేంద్రం ఇప్పటివరకూ సానుకూలంగా స్పందించకపోవడమే ఈ ఉద్రిక్తతలకు కారణం. దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి, పొరుగుదేశం నుంచి మేఘాలయకు ఆదివాసీయేతరులు వచ్చిపడుతూండటంతో స్థానికులకూ వారికీ మధ్య వైరం హెచ్చుతున్నది. గత నాలుగైదు దశాబ్దాల్లో కనీసం నాలుగుసార్లు ఆదివాసులకూ, స్థానికేతరులకూ మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు రేగాయి. వందలాదిమంది ఆదివాసీయేతరులను రాష్ట్రం నుంచి తరిమికొట్టిన ఘటనల్లో తీవ్ర రక్తపాతం జరిగింది. సీఏఏపై తగ్గేది లేదని పాలకులు కఠినంగా చెబుతున్నప్పుడల్లా మేఘాలయ రెచ్చిపోతున్నది. ఇప్పుడు సీఏఏ, ఐఎల్‌పిలపై స్థానికులకు, ఆదివాసీయేతరులకూ మధ్య జరిగిన ఒక సమావేశం అనంతరం ఖాసీ విద్యార్థి సంఘం ఈ నిప్పు రగల్చిందని అంటున్నారు. సుదీర్ఘకాలం తరువాత కాస్తంత శాంతిబాట పట్టిన మేఘాలయలో పౌరచట్టం మీద ప్రజలకున్న భయాలు మిలిటెంట్‌ సంస్థలకు ఊపిరినిస్తున్నాయి. ఆదివాసీయేతరులు నెలరోజుల్లోగా రాష్ట్రాన్ని విడిచిపోకపోతే మారణహోమం తప్పదని ఒక ఆదివాసీ మిలిటెంట్‌ సంస్థ అల్టిమేటమ్‌ జారీ చేసింది. ప్రజల్లో భయాలు, వైషమ్యాలు పెంచే ఇటువంటి ప్రకటనలు ప్రచురించవద్దని బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అక్కడి ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు పెడుతున్నది కానీ, ఆ పనిచేస్తున్నది కొత్త పౌరచట్టమే. ఒక చట్టం అమలువల్ల కలిగే సామాజిక, మానవ నష్టాలను గుర్తించడానికి పాలకులు నిరాకరిస్తున్న దుస్థితి ఇది.

Updated Date - 2020-03-05T08:56:18+05:30 IST