Chitrajyothy Logo
Advertisement

మా ఇద్దరిలో... ఎవరు గెలిచినా ఆనందమే

twitter-iconwatsapp-iconfb-icon
మా ఇద్దరిలో... ఎవరు గెలిచినా ఆనందమే

దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ‘సైరా’ చిత్రం తర్వాత మరో సినిమా జోలికి పోకుండా ‘ఆచార్య’ మీదే దృష్టి పెట్టారు చిరంజీవి. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని చేసే ఆయన ప్రయత్నాల్లో ‘ఆచార్య’ ఒకటి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న  ఈ సినిమా గురించి, ఇతర విషయాల గురించి ‘నవ్య’ తో చిరంజీవి  చెప్పుకొచ్చారు ఇలా..


ఆచార్య కథ వినగానే అందులో మిమ్మల్ని ఇన్‌స్పైర్‌ చేసిన అంశాలు ఏమిటి? 

మా నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏం కోరుకుంటారో అవి కథలో ఉన్నాయి. అలాగే ఇంతవరకూ అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ. ఆయన సినిమా అనగానే కొన్ని అంచనాలు ఉంటాయి. అవి దృష్టిలో పెట్టుకుని ఈ కథ తయారు చేశారు. ఏ కథ అయినా నేను వినేముందు అందులో మనసును తాకే సన్నివేశాలు ఉన్నాయా లేవా అని చూస్తాను. వాటితో పాటు ఎమోషనల్‌ సీన్లు కూడా ఉంటే సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని గతంలో నేను చేసిన సినిమాలు రుజువు చేశాయి. ఆ కోవకు చెందిన సినిమా ‘ఆచార్య’. ఇందులో కొరటాల శివ మార్క్‌, మా మార్క్‌ కూడా ఉంటుంది. 


మీరు, రామ్‌చరణ్‌ కలసి నటించాలనే  సురేఖగారి కోరిక ఎలా నెరవేరింది?

ఈ కథ ఓకే చేసిన తర్వాత ఇందులో సిద్ధ పాత్రను చరణ్‌ పోషిస్తే బాగుంటుందని కొరటాల శివ సూచించారు. అయితే అప్పటికే చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో ఉన్నాడు. అది ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. అయినా సరే చరణ్‌ కోసం వెయిట్‌ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే నాకు, చరణ్‌కు ఇది టైలర్‌ మేడ్‌ సబ్జెక్ట్‌. ‘మీరిద్దరు కలసి నటిస్తే చూడాలనిఉంది’ అని సురేఖ ఎప్పటినుంచో అడుగుతోంది. ఆమె కోరికను ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాం. ఇంతకంటే గొప్ప అవకాశం మళ్లీ రాదు. ఇందులో మేం తండ్రీ కొడుకులం కాదు, అన్నదమ్ములం కాదు, గురుశిష్యులం కాదు.. వాటికి మించి ఉండే పాత్రలవి. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో చరణ్‌లో బిజీగా ఉండడంతో  మధ్యలో  ఒకసారి రాజమౌళిగారిని చరణ్‌ డేట్స్‌ కోసం అడగడం జరిగింది. సాధారణంగా ఆయన తన షూటింగ్‌ మధ్యలో ఉన్నప్పుడు హీరోని బయటకు వదలరు.  అయితే సురేఖ కోరికను ఆయనకు వివరించి, మీరు పర్మిషన్‌ ఇస్తే మీ షూటింగ్‌ గ్యాప్స్‌లో మా షూటింగ్‌ పెట్టాకుంటాం అని అడిగితే ఆయన అర్థం చేసుకుని పెద్ద మనసుతో చరణ్‌ను మాకు ఇవ్వడం వల్లే ఈ సినిమా చేయగలిగాం. మధ్యలో కుదరదేమో అని అనుకున్న సమయంలో ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు అనుకున్నాం. ఎవరైనా ఈ పాత్రకు న్యాయం చేయగలరు. కానీ కథకు న్యాయం జరగదు. పాత్రలకు న్యాయం జరగదు. ఈ మాట ఎందుకు అంటున్నానో సినిమా  చూశాక మీకే అర్థమవుతుంది. 


భారతీయ సినీ చరిత్రలోనే తండ్రీకొడుకులైన ఇద్దరు టాప్‌ స్టార్స్‌ కలసి నటించిన సందర్భాలు లేవు. మీకెలా అనిపిస్తోంది.

తండ్రి సూపర్‌స్టార్‌, ఆయన తర్వాత ఆయన కొడుకు సూపర్‌స్టార్‌గా ఎదిగిన సంఘటనలు మనకు ఎన్నో ఉన్నాయి. కానీ తండ్రి పొజిషన్‌ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే  కొడుకు కూడా స్టార్‌గా ఎదిగి, తండ్రితో కలసి నటించడం అరుదు. ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప వరం ఇది. ఒక తండ్రిగా నేను గర్వించే సందర్భం ఇది.


సినిమా చూసి సురేఖగారు ఏమన్నారు?

అమ్మ చూడలేదు కానీ సురేఖ నాతో పాటు సినిమా చూసింది.  అందరినీ ఆకట్టుకొనే అంశాలతో , క్లాస్‌ టచ్‌తో ఉన్న మాస్‌ సినిమా ఇది. ముఖ్యంగా మహిళలను బాగా ఆకట్టుకొనే సినిమా అవుతుంది. సురేఖ రియాక్షన్‌ గ్రహించిన తర్వాత  నేను చెబుతున్న మాట ఇది. 


 ఆట, పాట, నటన.. మీ తండ్రీకొడుకుల పోటిలో ఎవరు గెలిచారు? 

(నవ్వు)ఆ విషయంలో న్యాయనిర్ణేతలు ప్రేక్షకులే. నేను గెలిస్తే తండ్రిగా నాకు గర్వకారణం. చరణ్‌ గెలిచాడనుకోండి.. దానికి మించిన గర్వకారణం మరేమి ఉంటుంది! రెండూ నేను ఆనందించే అంశలే. అయినా  నా కొడుకే గెలవాలని  తండ్రిగా కోరుకుంటున్నా. 


సినిమాలోని బంజారా సాంగ్‌ చేస్తున్నప్పుడు షూటింగ్‌కు చాలా మంది వచ్చారట! 

అభిమానుల్ని అలరించడం కోసం మేమిద్దరం కలసి ఓ సాంగ్‌ చేయాలనుకున్నాం. కానీ ఆ పాటకు మా ఇంటి నుంచే ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. మళ్లీ ఈ కాంబినేషన్‌లో పాట ఎప్పుడు చూస్తామో అంటూ సురేఖ, మా అమ్మ స్పాట్‌కు చ్చారు. ‘మా అత్తగారు కూడా ఈ పాట చూడాలనుకుంటున్నారు సార్‌’ అని వాళ్లను కొరటాల శివ తీసుకువచ్చారు. ఇక యంగ్‌ డైరెక్టర్స్‌ కొందరు కూడా వచ్చారు. ఈ పాటకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో సెట్‌లో వారి స్పందన చూసి  నేను ముందే ఊహించగలిగాను. ఈ పాటలో నేను, చరణ్‌ పోటీ పడ్డామో లేదో కానీ చిత్రీకరణ చూసి ‘మా అబ్బాయే బాగా చేశాడు.. కాదు నా కొడుకే బాగా నటించాడు’ అని సురేఖ, మా అమ్మ వాదనకు దిగారు. అది చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. 


 చరణ్‌తో షూటింగ్‌ ను  మీరెలా ఎంజాయ్‌ చేశారు?

కొన్ని కొన్ని సంఘటనలు ఆ టైమ్‌కు పెద్దగా అనిపించకపోవచ్చు. మాములే  కదా అని అనిపించవచ్చు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ పాత రోజుల్ని తలుచుకుని ఆ సంఘటనలను గుర్తు చేసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. పని ఒత్తిడిలో పడి  ఆ రోజుల్ని మనం అంతగా ఆస్వాదించలేకపోయాం అనిపిస్తుంది. ఆ రోజులు తిరిగి రావు కదా.  ఇది నేను ముందే గ్రహించి, చిన్నతనంలో మా పిల్లల ఫొటోలను, ముఖ్యమైన సంఘటనలను వీడియో రూపంలో తీసి భద్రపరిచాను. అవన్నీ ఇప్పుడు ప్లే చేస్తుంటే నా పిల్లలు, వాళ్ల పిల్లలు ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు. అందుకే ఈ షూటింగ్‌లో పాల్గొనే ముందు చరణ్‌కు చెప్పాను.. మనిద్దరం కలసి మళ్లీ ఎప్పడు సినిమా చేస్తామో చెప్పలేం. 

నటులుగా మనిద్దరం చేస్తున్న ఈ సందర్భాన్ని ఎంజాయ్‌ చేద్దాం. ఓ తీపి జ్ఞాపకంగా భద్ర పరుద్దాం... అని. ఔట్‌డోర్‌లో ఇద్దరం ఒకే రూమ్‌లో ఉన్నాం. అక్కడ జిమ్‌ ఏర్పాటు చేశాడు చరణ్‌. ఇద్దరం కలసి జిమ్‌కు వెళ్లేవాళ్లం. ఒకే కారులో షూటింగ్‌కు వెళ్లేవాళ్లం.  ఇది నిజంగా మరిచిపోలేని అనుభూతి. 


గతంలో సౌత్‌ హీరోలు అంటే చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు హీరోలకు, కథలకు  బాలీవుడ్‌ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.  ఈ మార్పు గురించి మీరెమంటారు? 

తెలుగు సినిమా హద్దులు సరిహద్దులు చెరిపేసిన ఘనత కచ్చితంగా దర్శకుడు రాజమౌళిదే. దానికంటే ముందు ఒక వ్యక్తి పేరు  చెప్పాలి. ఆయన కళాతపస్వి విశ్వనాథ్‌గారు. ఆయన దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ చిత్రం చూసి ‘తెలుగు సినిమా అంట, ఎంత బాగా తీశారు!’ అనే అభినందనలు దేశవ్యాప్తంగా వచ్చాయి. 1988లో నేను నిర్మించిన ‘రుద్రవీణ’ చిత్రానికి జాతీయ సమైక్యతా అవార్డ్‌ తీసుకోవడానికి వెళ్లాను. అవార్డు తీసుకోవడానికి కొన్ని గంటల ముందు ఏర్పాటు చేసిన హై టీ కార్యక్రమంలో పాల్గొన్నాను. భారతీయ చిత్రపరిశ్రమలోని ప్రముఖ వ్యక్తుల ఫొటోలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. పృధ్వీరాజ్‌ కపూర్‌ నుంచి అమితాబ్‌ వరకూ అందరి ఫొటోలు అక్కడ ఉన్నాయి. ఎంజీఆర్‌, జయలలిత, ప్రేమనజీర్‌ ఫొటోలు కూడా ఉన్నాయి. కానీ తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవాలు రామారావు, నాగేశ్వరరావుగార్ల ఫొటోలు కానీ, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ ఫొటో కానీ, శివాజీ గణేశన్‌ ఫొటో కానీ అక్కడ లేవు. అది చూసి నా మనసుకు చాలా బాధ కలిగింది. మద్రాసు తిరిగి వచ్చిన తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టి ఈ అన్యాయాన్ని నిలదీసి అప్పట్లో జాతీయ స్థాయికి ఈ విషయాన్ని తీసుకెళ్లగలిగాను.


అప్పటినుంచి తెలుగువారి గొప్పతనాన్ని చాటాలనే పట్టుదల మొదలైంది. తెలుగులో నేను అత్యధిక పారితోషికం తీసుకుంటున్నా హిందీలో కూడా సత్తా చాటా లనే  తక్కువ పారితోషికానికి మూడు హిందీ సినిమాలు చేశాను. అయితే కమల్‌హాసన్‌కు కానీ, నాకు కానీ, రజనీకాంత్‌కు కానీ సరైన ఆదరణ లభించలేదు. మద్రాసీ హీరోలుగా మా మీద ముద్ర వేశారు. ఆ బాధ అనుభవించిన నాకు ఈ రోజున తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో దక్కుతున్న ఆదరణ చూసి ఎంతో ఆనందంగా ఉంది. పాన్‌ ఇండియా లెవల్‌లో సౌత్‌ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా పతాకం ఎగురడం గర్వంగా ఉంది. ఆ గౌరవం మనకు దక్కేలా చేసింది రాజమౌళి. అలాగే ప్రశాంత్‌ నీల్‌ కేజీఎ్‌ఫతో, సుకుమార్‌ ‘పుష్ప’ సినిమాలతో దూసుకుపోతున్నారు. వాళ్లు వేసిన బాటలో వెళ్లడానికి మిగిలిన దర్శకులు సిద్ధమవుతున్నారు. హిందీ సినిమా తన అస్థిత్వం గురించి ఆలోచించుకునేలా ఇప్పుడు తెలుగు సినిమా చేయగలిగింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో ఏది  ఎక్కువ, ఏది తక్కువ అనే విషయాన్ని వదిలేస్తే.. ఏ బాషలో తీసినా అది ఇండియన్‌ సినిమా గా ఇప్పుడు పేరు పొందడం ఆనందదాయకమే కదా. 


స్టూడియో కట్టమని అక్కడి ప్రభుత్వం నుంచి మాకు ఆఫర్‌ ఉంది. కానీ దాని గురించి నాకు  ఇంతవరకూ ఎటువంటి ఆలోచనా  లేదు. అయితే  పరిశ్రమ ఆంధ్రాలో  కూడా అభివృద్ది చెందాలని కోరుకునే వాళ్లను నేనూ ఒకడిని, 


నా వింటేజ్‌ ఇమేజ్‌ను కొత్తగా ఆవిష్కరించుకోవాలంటే అది సమకాలిన దర్శకులతోనే సాధ్యపడుతుంది. నేను పాత, దర్శకులు కూడా పాత అయితే లేటెస్ట్‌  జనరేషన్‌ ను ఆకట్టుకునే అంశాలు ఉంటాయో,  లేవో. అందుకే కొత్తదనాన్ని, లేటేస్ట్‌ టెక్నాలజిని చూపించాలనే యువ దర్శకుల అవగాహన, నా ఇమేజ్‌ కలిస్తే  చక్కని కాంబినేషన్‌ అవుతుందని అనుకుంటున్నాను. అది ఆచార్యతో మొదలైంది. 


గాడ్‌ఫాదర్‌ చిత్రనిర్మాతలు చాలా పెద్ద మొత్తాన్ని పారితోషికంగా సల్మాన్‌ఖాన్‌కు ఇవ్వాలనుకున్నారు. అయితే ‘చిరంజీవిగారి మీద నాకు ఉన్న అభిమానాన్ని, చరణ్‌ మీద ఉన్న సోదర ప్రేమను  డబ్బుతో కొలవవద్దు’  అని సల్మాన్‌ ఆ పారితోషికాన్ని తిరస్కరించారట. స్నేహానికి ఎంతో విలువ ఇచ్చే  వ్యక్తి సల్మాన్‌. ఈ సంఘటనతో నా దృష్టిలో ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగాడు. 


మీ దృష్టిలో పాన్‌ ఇండియా ఫిల్మ్‌ అంటే? 

యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ అవ్వాలి, లేదా ఆలిండియా సబ్జెక్ట్‌ అవ్వాలి. ఒక ప్రాంతానికి పరిమితం అయిన కథ కాకుండా ఉంటే ఏ సినిమా అయినా  జాతీయ స్థాయిలో రాణిస్తుంది, ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటుంది. అలాంటి సినిమాలను తీయగలిగితే అవన్నీ పాన్‌ ఇండియా సినిమాలుగా మంచి గుర్తింపు పొందుతాయి. ఆదరణ లభిస్తోంది కదాని ప్రతి సినిమాను పాన్‌ ఇండియాగా పేర్కొనడం కరెక్ట్‌ కాదు. 

మెగాస్టార్‌ స్పీడ్‌ పెంచి వరుస సినిమాలు చేస్తున్నారని అందరూ అంటున్నారు 

(నవ్వు) కొత్తగా  నేనేమీ స్పీడ్‌  పెంచలేదు. 1980ల చివర్లో, 1990 మొదట్లో ఉన్న స్పీడ్‌నే ఇప్పుడూ కంటిన్యూ చేస్తున్నాను. అంతే! 


మీ దృష్టిలో పాన్‌ ఇండియా ఫిల్మ్‌ అంటే? 

యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ అవ్వాలి, లేదా ఆలిండియా సబ్జెక్ట్‌ అవ్వాలి. ఒక ప్రాంతానికి పరిమితం అయిన కథ కాకుండా ఉంటే ఏ సినిమా అయినా  జాతీయ స్థాయిలో రాణిస్తుంది, ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటుంది. అలాంటి సినిమాలను తీయగలిగితే అవన్నీ పాన్‌ ఇండియా సినిమాలుగా మంచి గుర్తింపు పొందుతాయి. ఆదరణ లభిస్తోంది కదాని ప్రతి సినిమాను పాన్‌ ఇండియాగా పేర్కొనడం కరెక్ట్‌ కాదు. 


మెగాస్టార్‌ స్పీడ్‌ పెంచి వరుస సినిమాలు చేస్తున్నారని అందరూ అంటున్నారు 

(నవ్వు) కొత్తగా  నేనేమీ స్పీడ్‌  పెంచలేదు. 1980ల చివర్లో, 1990 మొదట్లో ఉన్న స్పీడ్‌నే ఇప్పుడూ కంటిన్యూ చేస్తున్నాను. అంతే! 

వినాయకరావు

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement