ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో దర్శకుడు కోటి సాలూరి కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడీ చిత్రానికి మెగా సపోర్ట్ లభించింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల కాబోతోంది.
నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు గ్రాండ్గా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ని చిత్రయూనిట్ విడుదల చేసింది. కాగా, ఈ చిత్రానికి సంగీత దిగ్గజం మణిశర్మ అందిస్తున్న సంగీతం మేజర్ అసెట్ కానుందని అంటున్నారు దర్శకనిర్మాతలు. తమ సంస్థ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని, చిత్రంలో రాజీవ్ సాలూరి నటన హైలైట్ కానుందని నిర్మాత గాజుల వీరేష్ తెలిపారు.