Abn logo
Aug 7 2020 @ 17:02PM

ప్లాస్మా దాతలను సన్మానించిన మెగాస్టార్ చిరంజీవి

కరోనా‌ను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన వారిని మెగాస్టార్ చిరంజీవి, సీపీ సజ్జనార్ సైబరాబాద్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది ప్లాస్మా డోనర్లను సన్మానించారు. ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలందిస్తున్న పోలీసులకు ధన్యవాదాలు అని తెలిపిన చిరంజీవి.. ప్లాస్మా డొనేషన్ అనేది ఒక యుద్ధం అని అన్నారు. ప్లాస్మా గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ప్లాస్మా చికిత్సతో కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకుంటున్నారని తెలుపుతూ.. ప్లాస్మా ఇచ్చేందుకు కరోనా‌ను జయించిన వారందరూ ముందుకు రావాలని చిరంజీవి పిలుపునిచ్చారు. 


ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘కరోనా కాలంలో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్లాస్మా డొనేషన్ కార్యక్రమాన్ని యజ్ఞంలా కొనసాగిస్తున్న సీపీ సజ్జనార్‌గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్లకు పోలీసులకు పారా మెడికల్  సిబ్బందికి.. పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు. బ్లడ్ దొరక్క ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి సీసీటీ తరపున బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డ్ వచ్చింది.. డిసెంబర్ 1న అవార్డు తీసుకోబోతున్నాను. ప్లాస్మా.. కరోనా సోకిన వారికి సంజీవినిలా పనిచేస్తోంది. కరోనాను జయించిన వారిలో మూడు నెలల పాటు యాంటీ బాడీస్ ఉంటాయి. ప్లాస్మాలోని యాంటీ బాడీస్ 24 గంటల నుంచి 48 గంటల్లోపు తిరిగి వస్తాయి. కరోనా జయించిన ఒక్కో వ్యక్తి 30 సార్లు ప్లాస్మా డొనేట్ చేయవచ్చు. కరోనా వచ్చిందని మనస్తాపంతో చనిపోతున్న వారిని చూస్తే బాధేస్తుంది. అలాంటి వారిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధైర్యంగా ప్లాస్మాను డొనేట్ చేయండి. నా ఇంట్లో పనిచేస్తున్న నలుగురైదుగురికి కరోనా వచ్చింది. వాళ్లంతా ఇప్పుడు కోలుకుని తిరిగి పనిలో జాయిన్ అయ్యారు. వాళ్లంతా ప్లాస్మా డొనేట్ చేస్తారు. మా బంధువు ఒకరికి కరోనా సోకింది. స్వామి నాయుడు అనే వ్యక్తి ప్లాస్మా డొనేట్ చేయడం ద్వారా కరోనా నయమైంది. ప్లాస్మా దాతలంతా హీరోస్.. వాళ్లందరికీ అభినందనలు..’’ అని తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement