ఆందోళన కన్నా జాగ్రత్త ముఖ్యం

ABN , First Publish Date - 2020-03-22T05:38:30+05:30 IST

కంటికి కనిపించని సూక్ష్మజీవి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఇంతవరకూ ఎన్నో విపత్కర వైరస్‌లను ఎదుర్కొన్న మానవాళి ఇప్పుడు ఆ సూక్ష్మజీవితో పోరాడుతోంది.

ఆందోళన కన్నా జాగ్రత్త ముఖ్యం

కంటికి కనిపించని సూక్ష్మజీవి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఇంతవరకూ ఎన్నో విపత్కర వైరస్‌లను ఎదుర్కొన్న మానవాళి  ఇప్పుడు ఆ సూక్ష్మజీవితో  పోరాడుతోంది. చైనాలో మొదలై కోరలు చాస్తూ ప్రపంచాన్నంతా ముట్టడిస్తున్న ఆ సూక్ష్మజీవి పేరు కరోనా. వైద్య పరిభాషలో కోవిడ్‌  - 19. జాతి, కులం, మతం, రాష్ట్రం, దేశం... సరిహద్దుల్ని చెరిపేసి.. అందరూ ఒక్కటై ఆ వైరస్‌పై పోరాటం చెయ్యాలంటున్న దర్శకుడు కొరటాల శివ మనోగతం ‘నవ్య’ పాఠకుల కోసం... 


కరోనా... ప్రభావం ఎలా ఉందంటారు?

ఇంతకంటే గొప్ప విపత్తుల్ని చూశాం. నో డౌట్‌! మానవాళిని కబళిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌. అయితే ప్రభుత్వానికి అందరూ సహకరిస్తే తప్పకుండా దాని ప్రభావానికి అడ్డుకట్ట వేయవచ్చు. గతంలో కలరా, ప్లేగు వంటి వ్యాధులు వచ్చినప్పుడు చాలా కాలం తర్వాత కానీ అవి వచ్చినట్లు తెలిసేది కాదు. కానీ మీడియా విస్తృత స్థాయిలో ఉండడం వల్ల ఇప్పుడు ఏం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతోంది. కరోనా గురించి, దాని ప్రభావం గురించి, అది మన జోలికి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ... ఇలాంటి విషయాలన్నీ మీడియాలో రావడం వల్ల ప్రజల్లో ఓ అవగాహన ఏర్పడుతోంది. ఇది ఒకరకంగా అదృష్టమేనని చెప్పాలి. ఇంత తెలిసిన తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అది మన కర్మ! మనతో పాటు పక్క వాళ్లనీ, మన దగ్గర పనిచేసే వాళ్లనీ ఎడ్యుకేట్‌ చెయ్యాలి. కూర్చుని ఆందోళన చెందడం కంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మన జోలికి రాదు. ‘వచ్చాక ఏదో చేద్దాం’ అనే ఉదాసీనత వద్దు. అసలు రాకుండానే తగిన జాగ్రత్తలు తీసుకొందాం. 


మీ షూటింగ్‌ మీద కరోనా ప్రభావం పడింది కదూ!

 మనిషి ప్రాణం కంటే ఏదీ గొప్పది కాదు. ఒక షెడ్యూల్‌ ప్లాన్‌ చేసుకొని అవుట్‌డోర్‌కు వెళతాం. అయితే అక్కడ హఠాత్తుగా భారీ వర్షం వచ్చి ఆ షెడ్యూల్‌ జరగకపోవచ్చు. ప్రాణనష్టం జరగకుండా షూటింగ్‌ వాయిదా వేయడం మంచి నిర్ణయమే. అంతా సద్దుమణిగిన తర్వాత అవసరమైతే డే అండ్‌ నైట్‌ పని చేసి షూటింగ్‌ పూర్తి చేసుకోవచ్చు. 


షూటింగ్స్‌ ఆపాలనే నిర్ణయం మీ హీరోదేనా? 

ఎక్కువ జనసముహం ఒక చోట ఉండకూడదని అంటూ థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ మూసేయాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సినిమా షూటింగ్స్‌ గురించి ప్రభుత్వం ప్రస్తావించకపోయినా సామాజిక బాధ్యతగా భావించి, చిరంజీవిగారు ఈ నిర్ణయం తీసుకొన్నారు. పెద్ద సినిమా షూటింగ్‌ అనగానే కనీసం 200 మంది జనం యూనిట్‌లో ఉంటారు. జ్వరం వచ్చినా షూటింగ్స్‌ ఆగవిక్కడ. ఎంత ఎండ ఉన్నా, భారీ వర్షం వచ్చినా వెనకాడకుండా పనిచేసేది సినిమా వాళ్లు మాత్రమే. ప్రతిరోజూ పని ఉండాలని సినీ కార్మికులు కోరుకొంటుంటారు. అటువంటి కార్మికుల భద్రత, ఆరోగ్యం గురించి దర్శక-నిర్మాతలు ఆలోచించాలి. అందుకే చిరంజీవిగారు ‘షూటింగ్‌ ఆపేద్దాం’ అని చెప్పగానే సరేనన్నాను. మిగిలిన భాషల వారికి ప్రేరణగా నిలవాలని ఈ నిర్ణయం తీసుకొన్నాం. 


ఇదే  పరిస్థితి ఎక్కువ రోజులు సాగితే పరిశ్రమకు ఇబ్బంది కదా?

కరోనా సమస్య ముందు సినిమా పరిశ్రమ చాలా చిన్నది. దేశ ఆర్ధిక వ్యవస్తే కుప్పకూలిపోతోంది. అయితే మనిషి మనోబలం చాలా గొప్పది. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎన్ని వచ్చినా ఎదుర్కొని, పోరాడి మళ్లీ నిలబడే సత్తా మనకు ఉంది. ఇవాళ ఉన్న సాంకేతికత, మేధస్సుతో అచిర కాలంలోనే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. సమస్య మరింత క్లిష్టతరం కాకుండా చూడడం మన అందరి బాధ్యత. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొన్నా తప్పనిసరిగా పాటించాలి. ఆ వైరస్‌ను కట్టడి చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మరో విషయమేమిటంటే.. అన్నీ మూసేశారంటే సెలవులు ఇచ్చినట్లు కాదు. ‘సరదాగా రోడ్ల మీద తిరుగుదాం.. హోటల్‌కు వెళదాం’ అనుకోవద్దు. అందరం ఇళ్లలో ఉంటే వైరస్‌ వ్యాప్తి చెందదు. జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ భయపడే కంటే దాన్ని అరికట్టడానికి ఎలా కృషి చేయాలో ఆలోచిద్దాం. జాతి, కులం, మతం, రాష్ట్రం, దేశం.. ఇలా సరిహద్దులన్నీ చెరిపేసి పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఏ రెండు దేశాల మధ్యో జరుగుతున్న యుద్ధం కాదిది. ఒక ఏలియన్‌తో పోరాటం చేస్తున్నాం.


విడుదల షెడ్యూల్స్‌ కూడా దెబ్బతింటాయేమో...

తప్పదండీ. పరిస్థితులు మెరుగైన తర్వాత పరిశ్రమ పెద్దలందరూ కూర్చుంటారు. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. షూటింగ్స్‌, డేట్స్‌ .. ఇవన్నీ కరోనా ప్రభావం ముందు చీమల్లా కనబడుతున్నాయి. పదిమందికి  చెప్పేముందు నేను నా బాధ్యత నిర్వర్తించాలి కదా.. అందుకే మా అసిస్టెంట్స్‌కు సెలవులు ఇచ్చేశాను.




 ‘ఆచార్య’ విషయానికి వద్దాం. చిరంజీవిని ఎలా చూపించబోతున్నారు? 

చిరంజీవిగారు ‘బిగ్గర్‌ దేన్‌ సినిమా’ అని నా అభిప్రాయం. ఆయనకున్న ఇమేజ్‌ అలాంటిది. సినిమాలో చిరంజీవిగారిని చూడాలనుకొంటారు తప్ప మిగిలిన విషయాలు ప్రేక్షకులు ఆలోచించరు. చిరంజీవిగారితో సినిమా చేస్తున్నప్పడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకొంటున్నాను. కొన్ని వందల కోట్ల మందికి ఆయన ఆరాధ్య దైవం. అందుకే ఆయనతో సినిమా చేస్తున్నందుకు చిన్న భయం, ఆనందమే కాదు... బాధ్యతా ఉంది. అభిమానులు ఆశించే అంశాలు ఏవీ మిస్‌ కాకుండా నా కథను, ఆయన ఇమేజ్‌నూ బ్యాలెన్స్‌ చేస్తూ ఒళ్లు దగ్గర పెట్టుకొని ఈ సినిమా చేస్తున్నాను. చిరంజీవిగారిని చూస్తూ పెరిగాను. ఆయనతో వర్క్‌ చేయడం ఓ అందమైన కల. అది నిజమైనందుకు ఆనందంగా ఉంది. 


ఇందులో నటించే మరో హీరో  మహేశా, రామ్‌చరణా? 

నా సినిమా కథ ఇదని నేను ఇంతవరకూ ఎక్కడా చెప్పలేదు. ఇంకో పాత్ర ఉందనీ అనలేదు. బయట ఎవరో అనుకున్న వాటికి నేను సమాధానం చెప్పలేదు. చిరంజీవిగారి పాత్ర ఏమిటన్నదే నేను రివీల్‌ చెయ్యలేదు. ఈ సినిమాలోని కొన్ని అంశాలు వెల్లడి చేయడానికి నాకు కొంత సమయం ఉంది. ఓ వేదిక కూడా ఉంది. వాటిని ఎలా రివీల్‌ చేయాలో నేను అందంగా ఫ్రేమ్‌ చేసుకొంటున్నా. ఆ వివరాలన్నీ ఇప్పుడే చెప్పేస్తే నేను ప్రిపేర్‌ అవుతున్నదంతా వృధా అవుతుంది. 


మీ సినిమా నుండి  త్రిష తప్పుకోవడానికి కారణం? 

ఒక సినిమాలో ఓ మంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఉంటే బాగుంటుందని అనుకొన్నాను. అయితే షూటింగ్‌ సమయానికి ఆయనకు గుండెపోటు రావడంతో మరో ఆర్టిస్ట్‌ను తీసుకోవాల్సి వచ్చింది. అలాగే డేట్స్‌ సమస్య వల్ల అనుకొన్న హీరోయిన్లు మారిపోవచ్చు. ఇవన్నీ అంతర్గత విషయాలు. వీటిపైనే ప్రతి ఒక్కరూ ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో నాకు అర్థం కాదు. ఒక్కోసారి పాత్రలు, ఆర్టిస్టులు మారుతుంటారు. కథలో సన్నివేశాలూ మారిపోతుంటాయి. ఇవన్నీ సర్వసాధారణం. దీని మీద రాద్ధాంతం చేయకూడదు.

 

కానీ త్రిష ట్వీట్‌ చేయడం వల్లే ఈ  విషయం బయటకు వచ్చింది.

ఇందులో ఆవిడ తప్పు ఏదీ లేదండీ. ముందు ఒకటి అనుకొన్నాం. తర్వాత అలా అవ్వలేదు. మరో పాత్ర ఉంటే... తన ప్రయారిటీస్‌ వేరే అని త్రిష చెప్పారు. ఆమె నిర్ణయాన్ని గౌరవించాలి కదా! నాకు నచ్చని పని నేను చేయను. అలాగే ఆవిడకు నచ్చని ఆవిడ చేయరు. 


ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యం ఉందా? 

నా సినిమాల్లో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. విలన్‌ అయినా, హీరోయిన్‌ ఫాదర్‌ అయినా .. ప్రాధాన్యం ఎలా ఉన్నా గుర్తుండిపోయేలా ఉండాలని అనుకొంటాను. ఈయన రికమండ్‌ చేశారు కదా.. ఆ నటుడికి ఎక్కువ సీన్లు రాద్దాం అనుకోను. కథ ఎంతవరకూ డిమాండ్‌ చేస్తే ఆ పాత్ర అంత వరకూ ఉంటుంది. ఏ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఆర్టిస్టులకు ముందే చెప్పి, వారి అంగీకారంతో ఎంపిక చేస్తాను.


వినాయకరావు

Updated Date - 2020-03-22T05:38:30+05:30 IST