కరోనా కుటుంబంపై కదనానికి ‘మెగా వ్యాక్సిన్‌’!!

ABN , First Publish Date - 2020-08-27T16:02:04+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19తో పాటు కరోనా కుటుంబానికి చెందిన అన్ని రకాల వైర్‌సల పీచమణచగల

కరోనా కుటుంబంపై కదనానికి ‘మెగా వ్యాక్సిన్‌’!!

పరిశోధనలకు కేంబ్రిడ్జి వర్సిటీ ప్రణాళికలు

ఏడాది చివరికల్లా మనుషులపై ప్రయోగాలు

పొడి రూపంలో నిల్వ చేసేలా తయారీ

సూది లేకుండా వ్యాక్సినేషన్‌కు వెసులుబాటు


లండన్‌, ఆగస్టు 26 :  ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19తో పాటు కరోనా కుటుంబానికి చెందిన అన్ని రకాల వైర్‌సల పీచమణచగల మెగా వ్యాక్సిన్‌ను అభివృద్ధిచేయాలని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీ యోచిస్తోంది. అది ఆవిష్కృతమైతే కరోనా జాతి వైర్‌సలతో సతమతమవుతున్న మనుషుల నుంచి జంతువుల దాకా అన్నింటికి దివ్య ఔషధం లభించినట్లు అవుతుంది. ఇందుకోసం ‘డీఐఓఎస్‌- సీఓవీఏఎక్స్‌2’ అనే వ్యాక్సిన్‌ కేండిడేట్‌తో ప్రయోగ పరీక్షలకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బిలాలతో పాటు పశువులు, జంతువులు, మనుషుల జన్యుక్రమాలన్నింటిని ప్రాతిపదికగా తీసుకొని పరిశోధనలను ముందుకు తీసుకెళ్లనున్నారు.


కొవిడ్‌-19 తోబుట్టువులైన ఇతర వైరస్‌ల వల్ల గతంలో వ్యాపించిన సార్స్‌, మెర్స్‌ వ్యాధుల సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కరోనా కుటుంబంలోని అన్ని వైర్‌సలకు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని సృష్టించగల వ్యాక్సిన్‌ను అభివృద్ధిచేయడమే తమ లక్ష్యమని కేంబ్రిడ్జి వర్సిటీ వైరల్‌ జూనోటిక్స్‌ లేబొరేటరీ అధిపతి జొనాథన్‌ హీనే వెల్లడించారు. ప్రస్తుతం 3డీ కంప్యూటర్‌ సిమ్యులేషన్ల ద్వారా కరోనా జాతి వైర్‌సల తీరుతెన్నులను అధ్యయనం చేస్తున్నామన్నారు. రోగ నిరోధక వ్యవస్థను చైతన్యపరిచేందుకు వ్యాక్సిన్‌ ద్వారా శరీరంలోకి యాంటీజెన్‌ అణువులను ప్రవేశపెట్టేందుకు సింథటిక్‌ డీఎన్‌ఏను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రయోగాలు విజయవంతమైతే అతి తక్కువ ధరకే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ఏడాది చివరికల్లా మనుషులపై ప్రయోగ పరీక్షలు ప్రారంభిస్తామని చెప్పారు. ఇతర వ్యాక్సిన్లలా కాకుండా.. ‘డీఐఓఎస్‌- సీఓవీఏఎక్స్‌2’ను పొడిరూపంలో నిల్వ చేయవచ్చని, దాని నిల్వకు శీతల యంత్రాల అవసరం లేదన్నారు. దీని వ్యాక్సినేషన్‌ కోసం సూదిని వాడాల్సిన పనిలేని ఫార్మా జెట్‌  ట్రోపిస్‌ ఇంట్రాడెర్మల్‌ ఇంజెక్షనింగ్‌ పద్ధతిని వాడుతామని తెలిపారు. కాగా, డీఐఓఎ్‌సవ్యాక్స్‌ పరిశోధనా సంస్థ, కేంబ్రిడ్జ్‌ వర్సిటీ, ఎన్‌హెచ్‌ఎస్‌ ట్రస్టుల సంయుక్త భాగస్వామ్యంలో జరుగుతున్న ఈ పరిశోధనలకు బ్రిటన్‌ రూ.18 కోట్ల ఆర్థికసాయం అందించింది. 



Updated Date - 2020-08-27T16:02:04+05:30 IST