మెగా రైల్వే లైన్‌ రెడీ!

ABN , First Publish Date - 2020-10-23T09:59:33+05:30 IST

దసరా సీజన్‌లో రైల్వే శుభవార్త. ఉప్పులూరు - గుడివాడ - మోటూరు - మచిలీపట్నం మధ్య 69 కిలోమీటర్ల డబ్లింగ్‌..

మెగా రైల్వే లైన్‌ రెడీ!

ఉప్పులూరు - గుడివాడ - మోటూరు - మచిలీపట్నం రైల్వే లైన్‌ ప్రారంభం 


విజయవాడ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : దసరా సీజన్‌లో రైల్వే శుభవార్త. ఉప్పులూరు - గుడివాడ - మోటూరు - మచిలీపట్నం మధ్య 69 కిలోమీటర్ల డబ్లింగ్‌ రైల్వే లైన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ రైల్వేలైన్‌ను గురువారం విజయవాడ రైల్వే డివిజన్‌ ప్రారంభించింది. దీని ద్వారా మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ ఏర్పడుతోంది. పోర్టు కార్యరూపం దాల్చితే, దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ప్రధానంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని ఆక్వా, వ్యవసాయోత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతాలకైనా ప్రయాసలు లేకుండా రవాణా చేసుకునే సదుపాయం సమకూరుతుంది. 


 రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) నేతృత్వంలో విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ - గుడివాడ - భీమవరం - నర్సాపూర్‌, గుడివాడ - మచిలీపట్నం, నర్సాపూర్‌ - నిడదవోలుల మధ్య రూ.3 వేల కోట్ల వ్యయంతో డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ  ప్రాజెక్టు నిడివి 221 కిలోమీటర్లు కాగా, గురువారం నాటికి మొత్తం 124 కిలోమీటర్ల రైల్వేలైన్‌ పూర్తయింది. ఇంకా 97 కిలోమీటర్ల నిర్మాణం వచ్చే ఏడాదికి పూర్తవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న ఉప్పులూరు - గుడివాడ - మోటూరు, గుడివాడ - మచిలీపట్నం డబుల్‌ లైన్‌ పనులను గురువారం ఆర్‌వీఎన్‌ఎల్‌ పూర్తి చేసింది.. బందరు పోర్టు సాకారమైతే.. సరుకు రవాణాకు ఈ లైన్‌ ఎంతగానో దోహదపడుతుంది. ఈ లైన్‌ ద్వారా రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలకు మరింత సులభంగా ప్రయాణాలు సాగించవచ్చు. 


నూతన డబుల్‌ లైన్‌ సాంకేతికాంశాలు ఇవే.. 

గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రైళ్లు రాకపోకలు సాగించేలా ఆర్‌వీఎన్‌ఎల్‌ ఈ మార్గాన్ని నిర్మించింది. ఈ మార్గంలో 11 ప్రధానమైన వంతెనలు, 222 చిన్న వంతెనలను నిర్మించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సిగ్నలింగ్‌ - టెలికమ్యూనికేషన్స్‌ను ఏర్పాటు చేసింది. రైళ్ల రాకపోకలకు మరింత ఊతం ఇచ్చేలా ఉప్పులూరు, ఇందుపల్లి, గుడివాడ, మోటూరు, పెడన, కవుతరం స్టేషన్లను కొత్తగా నిర్మించి, మచిలీపట్నం స్టేషన్‌ను రీమోడల్‌ చేసింది.

Updated Date - 2020-10-23T09:59:33+05:30 IST