పునాదుల్లోనే..!

ABN , First Publish Date - 2021-07-31T05:17:43+05:30 IST

కడప నగరపాలక సంస్థ, రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, రాయచోటి, జమ్మలమడుగు, బద్వేలు, ఎర్రగుంట్ల పురపాలక సంఘాల్లో యూఎల్‌బీ కింద 62,633, అన్నమయ్య అర్బన డెవల్‌పమెంట్‌ అథారిటీ

పునాదుల్లోనే..!
బద్వేలు పట్టణం జగనన్న కాలనీ చెన్నంపల్లి లేఅవుట్‌

ఆర్భాటంగా జగనన్న కాలనీల మెగా గ్రౌండింగ్‌

15,752 మంది మట్టి కూడా తీయలేదు

51,049 ఇళ్లకు పునాదులు తీస్తే.. 

బేస్‌మట్టం లెవల్‌ దాకా వచ్చిన ఇళ్లు కేవలం 1,659 

జిల్లాలో ‘నవరత్నాలు-పేదలకు ఇళు’ పురోగతి తీరు

ఆంధ్రజ్యోతి విజిట్‌లో వెలుగు చూసిన వాస్తవాలు 


ముద్దునూరు ఎంపీడీఓ ఆఫీసు దగ్గర ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లేఅవుట్లో 96 మందికి ఇళ్లు మంజూరు చేశారు. మెగా గ్రౌండింగ్‌ మేళాలో 70 మంది పునాదులు తవ్వారు. వారిలో కేవలం ఇద్దరే ఇళ్ల నిర్మాణాలు చేపట్టి బేస్‌మట్టం పూర్తి చేశారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఆర్భాటంగా గ్రౌండింగ్‌ చేయించినా.. ఆ తరువాత వివిధ కారణాలవల్ల లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఫేజ్‌-1 కింద 66,799 మంది రిజిసే్ట్రషన చేసుకున్నారు. 51,049 ఇళ్లకు పునాదులు తీశారు. ఇందులో బేస్‌మట్టం వేసింది 1,659 ఇళ్లకే. అంటే.. పురోగతి శాతం 3.42 మాత్రమే. ‘నవరత్నాలు-పేదలు అందరికి ఇళ్లు’లో భాగంగా నిర్మించే జగనన్న కాలనీల లేఅవుట్లను ఆంధ్రజ్యోతి బృందం గురువారం పరిశీలిస్తే వెలుగు చూసిన వాస్తవాలపై ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): కడప నగరపాలక సంస్థ, రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, రాయచోటి, జమ్మలమడుగు, బద్వేలు, ఎర్రగుంట్ల పురపాలక సంఘాల్లో యూఎల్‌బీ కింద 62,633, అన్నమయ్య అర్బన డెవల్‌పమెంట్‌ అథారిటీ(అనుడా) పరిధిలోని గ్రామాల్లో 33,016 కలిపి 95,649 ఇళ్లను ‘నవరత్నాలు-పేదలు అందరికి ఇళ్లు’ పథకం కింద మంజూరు చేశారు. అర్బన పరిధిలో 40, గ్రామాల్లో 697 జగనన్న కాలనీలు నిర్మించాలన్నది ప్రణాళిక. తొలి విడతగా 66,799 ఇళ్లకు ఈ నెల 1, 3, 4వ తేదీల్లో మెగా గ్రౌండింగ్‌ మేళా చేట్టారు. నాటి జిల్లా కలెక్టరు, ప్రస్తుత జాయింట్‌ కలెక్టరు (హౌసింగ్‌) ఆధ్వర్యంలో 51,049 ఇళ్లకు పునాది తీయించారు. పునాదులు తీశారు సరే.. ఎంత మంది ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టారని పరిశీలిస్తే గ్రౌండింగ్‌ చేసిన ఇళ్లు 90 శాతానికిపైగా పునాదులతోనే ఆగిపోయాయి. 


ఆసక్తి చూపని లబ్ధిదారులు

జిల్లా అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావడమో.. మండల అధికారులే ఎక్స్‌కవేటర్లను సమకూర్చడం వల్లనో.. పలుచోట్ల ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడం వల్లనో.. గ్రౌండింగ్‌లో పురోగతి సాధించారు. బేస్‌మట్టం నిర్మాణ పనులు చేపట్టాలంటే లబ్ధిదారులు ముందుకు రావాల్సిందే. మెజార్టీ లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో జగనన్న కాలనీలు పునాదులు దాటడం లేదు. దీనికి తోడు రోడ్లు, నీరు, విద్యుత వంటి సమస్యలు సరేసరి. మొదట్లో ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తామంటే పలువురు ముందుకు వచ్చారు. ఇప్పుడు సిమెంట్‌, ఇసుక, ఇనుము.. వంటి మెటీరియల్‌ ఇస్తాం.. లబ్ధిదారులే ఇళ్లు కట్టుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో పలువురు ముందుకు రావడం లేదు. దీంతో నెల రోజులు గడిచినా 15,752 మంది కనీసం పునాదులు కూడా తవ్వుకోలేదు. 51,049 మంది గ్రౌండింగ్‌ చేపట్టినా కేవలం 1,659 మందే బేస్‌మట్టం వరకు నిర్మాణం చేపడితే.. 480 మంది రూఫ్‌ లెవల్‌ వరకు, 389 మంది రూఫ్‌ కాంక్రీట్‌ (ఆర్‌సీ) వరకు కట్టుకున్నారు. ఇప్పటి వరకు 12 ఇళ్లు పూర్తి అయ్యాయని అధికారులు అంటున్నా.. అవి కూడా మోడల్‌ కోసం హౌసింగ్‌ అధికారులు కట్టిన ఇళ్లే. లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.16.62 కోట్లు చెల్లించారు. కాగా పనుల్లో జాప్యంపై హౌసింగ్‌ పీడీని వివరణ కోసం ఫోనలో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు కొన్ని...

- కడప నగరవాసులకు ఏర్పాటు చేయనున్న 15 జగనన్న కాలనీల్లో సీకేదిన్నె మండలం మామిళ్లపల్లి దగ్గర ఏర్పాటు చేసిన లేఅవుట్‌ ఒకటి. ఇక్కడ 2,900 మందికి పట్టాలు ఇస్తే 2,533 ఇళ్లు మంజూరు చేశారు. మెగా గ్రౌండింగ్‌ మేళాలో కేవలం 650 మంది పునాదులు తవ్వుకుంటే.. 250 మంది లబ్ధిదారులే బేస్‌మట్టం వరకు నిర్మాణాలు చేపట్టారు. మిగిలినవి పునాదుల్లోనే ఉన్నాయి. 

- ప్రొద్దుటూరు మండలం రామేశ్వరం లేఅవుట్లో 6,913 మందికి పట్టాలిస్తే.. అందరూ పునాదులు తీశారు. ఒక్కరు కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదు. ఆసక్తి లేకపోవడం ఓ కారణమైతే.. నీరు, విద్యుత సౌకర్యాలు లేకపోవడం మరో కారణం. 

- బద్వేలు పట్టణంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో చెన్నంపల్లి లేఅవుట్‌ ఒకటి. ఇక్కడ 590 మందికి పట్టాలు ఇస్తే.. మెగా గ్రౌండింగ్‌లో 20 ఇళ్లకే పునాదులు తీశారు. ఆ ఇరవైలో ఒక్క ఇంటికి కూడా బేస్‌మట్టం నిర్మాణం జరగలేదు. పునాదుల్లోనే ఆగిపోయాయి.

- మైదుకూరు పట్టణ పేదలకు ముక్కొండ దగ్గర ఏర్పాటు చేసిన లేఅవుట్లో 2,335 మందికి పట్టాలు ఇచ్చారు. కనీస సౌకర్యాలు లేవని లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో ఒక్క ఇంటికి కూడా పునాది తీయలేదు.

- చెన్నూరు వాసులకు కనుపర్తి దగ్గర జగనన్న కాలనీ లేఅవుట్‌ ఏర్పాటు చేశారు. 917 మందికి పట్టాలు ఇచ్చారు. 812 మంది పునాదులు తవ్వుకున్నారు. వర్షం రావడంతో ఈ లేఅవుట్‌ చెరువుగా మారింది. రోడ్డు కంటే నాలుగైదు అడుగుల లోతులో ఉంది. పునాదులతో సహా రోడ్డు లెవల్‌ వరకు పూడ్చేసి మళ్లీ ప్లాట్లు వేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని బదిలీపై వెళ్లిన కలెక్టరు పది రోజుల క్రితం తహశీల్దారును ఆదేశించారు. పూడ్చాలంటే రూ.లక్షల నిధులు కావాలి.

- పుల్లంపేట మండలం కొత్తపేట పంచాయతీలోని లేఅవుట్లో 47 మందికి ఇళ్లు మంజూరు చేశారు. 40 మంది పునాదులు తీసినా.. ఏడుగురు మాత్రమే బేస్‌మట్టం వరకు కట్టుకున్నారు. మిలిగిన ఇళ్లు పునాదులు దాటలేదు. 


జగనన్న కాలనీల ఇళ్ల పునోగతి

నాన స్టార్టెడ్‌ (ఎనఎస్‌), బిలో బేస్‌ లెవల్‌ (బీబీఎల్‌), బేస్‌ లెవల్‌(బీఎల్‌), లింటెల్‌ లెవల్‌(ఎల్‌ఎల్‌), రూఫ్‌ లెవల్‌(ఆర్‌ఎల్‌), రూఫ్‌ కాంక్రీట్‌ (ఆర్‌సీ)

------------------------------------------------------------------------------------------------

నియోజకవర్గం ఎనఎ్‌స బీబీఎల్‌ బీఎల్‌ ఎల్‌ఎల్‌ ఆర్‌ఎల్‌ ఆర్‌సీ కంప్లీట్‌ మొత్తం

------------------------------------------------------------------------------------------------

కమలాపురం 1,774 1,972 309 -- 58 53 1 4,137

రాయచోటి 1,327 6,697 198 -- 48 12 1 9,113

కడప 2,156 15,538 142 -- 16 22 1 21,500

ప్రొద్దుటూరు 2,771 8,341 157 -- 47 38 -- 11,354

మైదుకూరు 1,246 3,351 256 -- 123 159 9 5,144

పులివెందుల 315 249 32 -- 8 9 -- 613

జమ్మలమడుగు 2,227 3,570 175 -- 60 34 -- 6,066

రాజంపేట 1,769 3,446 184 -- 31 9 -- 5,439

రైల్వే కోడూరు 1,748 2,246 163 -- 24 78 -- 4,319

బద్వేలు 419 3,277 43 -- 5 5 -- 3,749

--------------------------------------------------------------------------------------------------

మొత్తం 15,752 48,507 1,659 -- 480 389 12 66,799

--------------------------------------------------------------------------------------------------

Updated Date - 2021-07-31T05:17:43+05:30 IST