Abn logo
Aug 6 2021 @ 02:20AM

రసాభాసగా సభాపర్వం!

న్యూఢిల్లీ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి) : పెగసస్‌ నిఘా, ఇతర అంశాలపై గురువారం కూడా పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. సభాకార్యక్రమాలు స్తంభించిపోవడంతో పలుమార్లు వాయిదాపడ్డాయి. రాజ్యసభలో మాత్రం విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే అత్యవసర రక్షణ సర్వీసుల్లో సమ్మెలు, లాకౌట్లు, లేఆ్‌ఫలను నిషేధిస్తూ ప్రతిపాదించిన బిల్లు(ఎసెన్షియల్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ బిల్‌-2021) సహా మూడు బిల్లులను ఆమోదించారు. లోక్‌సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. రాజ్యసభ నుంచి సస్పెండ్‌ అయిన ఓ ఎంపీ అక్కడి చాంబర్‌ తలుపు అద్దాలను బద్దలుకొట్టారన్న అంశంపై ఆందోళన జరగడంతో ఎగువసభ ఉదయం రెండుసార్లు వాయిదాపడింది. చాంబర్‌ అద్దాలను బద్దలు కొట్టిన ఘటన తీవ్రంగా ఖండించాల్సిన విషయమని చైర్మన్‌ వెంకయ్య నాయుడు అన్నారు. తొలుత శూన్య గంటలో 15 నిమిషాల పాటు రాజ్యసభ వాయిదా పడింది. తర్వాత విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య మూడు సార్లు వాయిదా పడింది. గందరగోళం మధ్యే రాజ్యసభలో రాజ్యాంగ(షెడ్యూల్డు జాతి) సవరణ బిల్లు, ఢిల్లీలో వాయు నాణ్యతకు సంబంధించిన బిల్లు, రక్షణ సర్వీసుల బిల్లును ఆమోదించారు. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఎసెన్షియల్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ బిల్‌-2021ను పరిశీలన కోసం స్టాండింగ్‌ కమిటీకి పంపాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే డిమాండ్‌ చేశారు. 


లోక్‌సభ కూడా ఉదయం నుంచి వాయిదా పడుతూనే వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. ఢిల్లీలో బాలికపై హత్యాచారం ఘటనపై సభ తీర్మానం చేయాలని కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి కోరారు. పన్ను విధింపు చట్టాల సవరణ బిల్లును ఆర్థికమంత్రి మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. సభలో చర్చ పెట్టకుండానే బిల్లులను 7 నిమిషాలకొకటి చొప్పున ఆమోదిస్తున్నారని కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరీ విమర్శించారు. చోరీకి గురై విదేశాలకు చేరిన దేశ వారసత్వ సంపద తాలూకు వస్తువుల్లో 75ు వస్తువులను గత ఏడేళ్లలో దేశానికి తెచ్చామని పార్లమెంట్‌కు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గత ఏడాదిలో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 1,31,714 మంది మృతిచెందారని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. దేశంలో ఏ సామాజిక మాధ్యమా న్ని నిషేధించే ఆలోచన లేదని కేంద్రం తెలిపింది. ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ మండి పడింది. పెగాసస్‌పై చర్చించే అవకాశం ఉన్నా విపక్షాలు సంబంధిత పత్రాలను చించివేశాయని బీజేపీ విమర్శించింది.

ఆలిండియా జ్యుడీషియల్‌ సర్వీసుపై సంప్రదింపులు: రిజుజు

న్యాయసేవల వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఆలిండి యా జ్యుడీషియల్‌ సర్వీసు ముఖ్యమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు తెలిపారు. ఈ విషయంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంస్థలు, వ్యక్తులలో భిన్నాభి ప్రాయాలు ఉన్నందున ఏకాభిప్రాయ సాధన కోసం సంప్ర దింపులు జరుపుతున్నట్లు ఆయన రాజ్యసభకు చెప్పారు. ఈ జ్యుడీషియల్‌ సర్వీసు ద్వారా అఖిలభారత స్థాయిలో మెరిట్‌ ద్వారా ఎంపికయ్యేందుకు అర్హులైన ప్రతిభావంతు లకు అవకాశం లభిస్తుందని మంత్రి చెప్పారు.