మా సగం మా ఇష్టం!

ABN , First Publish Date - 2020-08-15T09:21:11+05:30 IST

కరోనా రోగులకు సగం పడకల్లో సర్కారు నిర్ణయించిన ధరలకే వైద్యం అందిస్తామని అంగీకరించిన ప్రైవేటు ఆస్పత్రులు మిగిలిన సగంలో గిట్టుబాటు ..

మా సగం మా ఇష్టం!

సగం పడకల్లోనే సర్కారు చెప్పిన చార్జీలు.. నిరుపేదలనే పంపండి.. అలా జీవో ఇవ్వండి

సర్కారుకు ప్రైవేటు ఆస్పత్రుల షరతులు.. డీహెచ్‌తో ముగిసిన యాజమాన్యాల భేటీ

మార్గదర్శకాల ఖరారుపై రాని స్పష్టత.. అసంపూర్తిగా చర్చలు... నేడు మరో దఫా

సర్కారు కోటాలో బిల్లు 4 లక్షలు దాటొద్దు.. ఆస్పత్రులకు నిర్దేశించనున్న ఆరోగ్య శాఖ


హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): కరోనా రోగులకు సగం పడకల్లో సర్కారు నిర్ణయించిన ధరలకే వైద్యం అందిస్తామని అంగీకరించిన ప్రైవేటు ఆస్పత్రులు మిగిలిన సగంలో గిట్టుబాటు అయ్యేలా చార్జీల వసూలుకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ప్యాకేజీల జీవోలో మార్పులు చేయాలని ప్రతిపాదించాయి. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో గురువారం వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. సగం పడకల్లో సర్కారీ ధరల ప్రకారమే వైద్యం అందిస్తామని అంగీకరించిన ప్రైవేటు ఆస్పత్రులు, అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై శుక్రవారం ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌ రెడ్డితో చర్చలు జరిపాయి. రెండుగంటల పాటు జరిగిన ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. విధివిధానాల రూపకల్పనలో ఎటువంటి స్పష్టత రాలేదు. దీంతో  మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. చర్చల సారాంశాన్ని ఉన్నతాధికారులు మంత్రి రాజేందర్‌కు వివరించారు. ఆదివారం ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.  రెండు సమావేశాల్లో తమ ప్రతిపాదనలపై పూర్తి స్పష్టతతో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు వాటిని సర్కారు ముందుంచాయి. సర్కారు చెప్పినట్లే చేస్తామంటూనే షరతులు పెట్టడం గమనార్హం. ప్రభుత్వంతో జరిపిన చర్చల వివరాలు కొలిక్కి వచ్చి, మార్గదర్శకాలు ఖరారైతే స్వయంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తామని ప్రైవేటు ఆస్పత్రులు యాజమాన్యాలు చెబుతున్నాయి.


జీవో నంబరు 248లో ఏముందంటే

ప్రభుత్వ ప్యాకేజ్‌ల ప్రకారం ఐసోలేషన్‌ బెడ్‌కు రోజుకు రూ.4 వేలు, ఐసీయూకు రూ.7,500, వెంటిలేటర్‌కు రూ.9 వేలు వసూలు చేయాలి. వైద్యుల కన్సల్టేషన్స్‌, నర్సింగ్‌ సేవలు, టూడీ ఎకో, ఈసీజీ మరికొన్ని పరీక్షలు చేయాలి. రోగి ఆహారం ఖర్చూ ఇందులోనే ఉంటుంది.


షరతులకు ఒప్పుకుంటేనే 50-50

యాభై శాతం పడకలు ప్రభుత్వానికి ఇస్తున్నపుడు  గరిష్ఠ ప్రయోజనం పొందాలని, తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే 50-50 విధానానికి ఆమోదం తెలపాలని ప్రైవేటు ఆస్పత్రులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఎలా నియంత్రించాలో తెలియక వైద్య ఆరోగ్య శాఖ తలలు పట్టుకుంటోంది వైద్య మంత్రే హెచ్చరించినా, రెండింటిపై చర్యలు తీసుకున్నా చాలా ఆస్పత్రుల వైఖరిలో మార్పు లేదు.  మిగిలిన ఆస్పత్రులపై గట్టి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతోనే సగం బెడ్ల ప్రతిపాదన అనే ఆరోపణలున్నాయి.



రూ.4 లక్షలకు మించొద్దు

ఒప్పందం కుదిరితే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే 50 శాతం పడకల ఫీజులు గతంలో కేటాయించినట్లుగానే ఉంటాయి. పీపీఈ కిట్లు, సాధారణంగా ఇచ్చే మందులు, అత్యవసరమైన అధిక ధర కలిగిన మందులు వాడితే ఎంత తీసుకోవాలన్న దానిపైనే అస్పష్టత నెలకొందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. సీటీ స్కాన్లు ఎన్ని చేస్తున్నారు? కొందరికి డయాలసిస్‌ చేయాల్సి వస్తే ఎంత అవుతుంది? కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సి రావడం వల్ల అయ్యే ఖర్చు ఎంత? టెస్టులకు అవుతున్న ఖర్చు ఎంత? నెలకు పైగా చికిత్సలు చేస్తున్నందున అవుతున్న వాస్తవ ఖర్చు వివరాలతో ప్రతిపాదన తీసుకురావాలని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు కోరాయి. ఎంత సీరియస్‌ కేసు అయినా గరిష్ఠంగా 14 రోజులు ఉంచుతారని, రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు మించి వసూలు చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ప్రకారం సాధారణ కరోనా కేసులకు లక్షన్నర, ఆక్సిజన్‌ పడకలపైకి వెళితే రూ.రెండు లక్షలు, వెంటిలేటర్‌పైకి వెళితే రూ.3 లక్షలే కావొచ్చు. సీరియస్‌ అయి ఒకట్రెండు రోజులు ఉంచాల్సి వేస్త రూ.4 లక్షలు కావొచ్చు. 


అంతకు మించకూడదని సర్కారు కార్పొరేట్లకు తేల్చిచెప్పింది. ఇవి కేవలం కార్పొరేట్లకు మాత్రమే వర్తిస్తాయని, నిర్ణయం తీసుకున్నాక మిగిలిన చిన్న ప్రైవేట్‌ ఆసుపత్రులను రెండు మూడు రోజుల్లో పిలిచి చర్చిస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇతర ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఇంకా తక్కువ ఫీజులనే ఖరారు చేస్తామని అంటున్నారు. ప్రైవేట్‌లు సొంతంగా నింపుకునే సగం పడకల ఫీజులు వాటి ఇష్టానికే వదిలేస్తారని అంటున్నారు. దీనిపై విధివిధానాల్లో స్పష్టత రానుంది.


మరి వీళ్ల సంగతేంటి? 

ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లకు ఇష్టారాజ్యంగా వసూలుకు అనుమతిస్తే మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు అటు నిరుపేదల(బీపీఎల్‌) కోటా కిందకు రారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోని  భారీ చార్జీలను వీరు భరించలేరు. నిజానికి ప్రభుత్వ లెక్కల్లో 85-90 శాతం మంది ప్రజలు పేదలే. తెల్ల రేషన్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న వీరిని నిరుపేదలుగా పరిగణించే అవకాశం ఉంది. ప్రభుత్వం చెప్పే రూ.4 లక్షల వరకు ఖర్చును పెట్టుకోగలిగే వారు నిరుపేదల్లో ఎంతమంది ఉంటారన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉండగా ప్రైవేటులో ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయిస్తారా? అన్నది అనుమానమే. అంటే, పేదల కోసం కేటాయించిన బెడ్లు ఖాళీగా ఉండే పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో ఖర్చులపై నియంత్రణ ఎత్తేస్తే మధ్య తరగతి అసలు ప్రైవేటు ఆస్పత్రి మొహం చూడలేని పరిస్థితి ఉండొచ్చు. కుదిరితే ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలి. లేదా దేవుడిపై భారం వేయాలి. ఆదివారం చర్చల్లో వీటన్నింటిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. 


ప్రతిపాదనలు కేసీఆర్‌కు వివరిస్తాం..మంత్రి ఈటల రాజేందర్‌


ప్రైవేటు ఆస్పత్రులతో ఆదివారం మరోమారు చర్చలు జరుపుతాం. మార్గదర్శకాలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. వారితో చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరిస్తాం. ఒకటి రెండు రోజుల్లో వివరాలను అధికారికంగా వెల్లడిస్తాం. ఇప్పటికే సర్కారు నిర్ణయించిన ధరల ప్రకారం పది రోజులకు ఎంత ప్యాకేజ్‌ ఉండాలన్న దానిపై చర్చిస్తున్నాం.


ప్రైవేటు ఆస్పత్రుల ప్రతిపాదనలు ఇవే

సగం పడకల్లో మాత్రమే సర్కారు ప్రకటించిన ప్యాకేజ్‌లను అమలు చేస్తాం


మిగిలిన సగం పడకల్లో మాకు గిట్టుబాటు అయ్యే విఽధంగా చార్జీలు వేసుకునే వెసులుబాటు కల్పించాలి


అందుకు అనుగుణంగా ప్యాకేజీల జీవోలో మార్పులు చేయాలి


కేవలం నిరుపేద(బీపీఎల్‌) కుటుంబాలకే సర్కారు ప్యాకేజ్‌లు అమలు చేస్తాం


వారినే మా ఆస్పత్రులకు వైద్య ఆరోగ్యశాఖ పంపాలి


ఈ మొత్తం వ్యవహారాలపై పర్యవేక్షణకు నోడల్‌ ఆఫీసర్‌ను ఏర్పాటు చేయాలి. 

Updated Date - 2020-08-15T09:21:11+05:30 IST