శెభాష్ Captain Monica Khanna.. స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై ప్రశంసలు

ABN , First Publish Date - 2022-06-20T23:37:42+05:30 IST

ఆదివారం(నిన్న) 185 మంది ప్రయాణికులతో పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన స్పైస్‌జెట్(SpiceJet) విమానం మంటలు అంటుకోవడంతో టేకాఫ్ తీసుకున్న 25 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం

శెభాష్  Captain Monica Khanna.. స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై ప్రశంసలు

న్యూఢిల్లీ : ఆదివారం(నిన్న) 185 మంది ప్రయాణికులతో పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన స్పైస్‌జెట్(SpiceJet) విమానానికి మంటలు అంటుకోవడంతో టేకాఫ్ తీసుకున్న 25 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండవ్వడంతో ప్రాణనష్టం జరగలేదు. దీంతో విమానంలోని ప్రయాణికులతోపాటు అధికార యంత్రాంగం అంతా ఊపిరిపీల్చుకున్నారు. సినిమాను తలపించే రీతిలో జరిగిన స్పైస్‌జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో ‘కెప్టెన్ మోనికా ఖన్నా’ అనే పైలెట్ రియల్ హీరో అనిపించుకున్నారు. ప్రయాణికులను ప్రాణాలతో బయటపడేయడంలో ఆమె నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భారీగా బరువుండే విమానాన్ని చాకచక్యంగా ల్యాండింగ్ చేసిన ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.


స్పైస్‌జెట్ పాట్నా-ఢిల్లీ విమానానికి కెప్టెన్ మోనికా ఖన్నా ‘పైలెట్ ఇన్ కమాండ్’గా వ్యవహరించారు. అంటే స్పైస్‌జెట్ విమానం ఆపరేటింగ్, భద్రత బాధ్యతలను ఆమె నిర్వర్తించారు. విమానానికి మంటలు అంటుకున్నాయని గుర్తించిన వెంటనే.. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ప్రభావిత ఎడమ ఇంజిన్‌ను ఆఫ్ చేశారు. ఆ తర్వాత వీలైనంత వేగంగా, భద్రంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. కెప్టెన్ మోనికా ఖన్నా, ఫస్ట్ ఆఫీసర్ బల్‌ప్రీత్ సింగ్ భాటియా ఈ సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించారని స్పైస్‌జెట్ చీఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ గుర్‌చరణ్ అరోరా కొనియాడారు. అసాంతం ధైర్యంగా వ్యవహరించి విమానాన్ని భద్రంగా ల్యాండింగ్ చేశారని మెచ్చుకున్నారు. విశేషమైన నైపుణ్యం కలిగివున్న ఈ ఇద్దరు ఆఫీసర్ల పట్ల గర్వంగా ఉందని బల్‌ప్రీత్ సింగ్ ప్రశంసించారు.


కాగా రిపోర్టుల ప్రకారం.. ఏటీసీ అధికారులతో మాట్లాడిన అనంతరం స్పైస్‌జెట్ ఎడమ ఇంజిన్‌ను మోనికా ఖన్నా ఆపివేశారు. విమానాన్ని ముందుకు నడపకుండా కొన్ని నిమిషాలపాటు రౌండ్ తిప్పారు. ఆ తర్వాత వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఎమర్జెన్సీ  ల్యాండింగ్ ప్రొటోకాల్ ప్రకారం కేవలం  ఒక్క ఇంజిన్‌పైనే విమానాన్ని నడిపారు. ఈ మేరకు ఇండియన్ క్యాబిన్ క్రూ ఒక ప్రకటన విడుదల చేసింది. స్పైస్‌జెట్ ఎస్‌జీ723 విమానం పైలెట్ ఇన్ కమాండ్ కెప్టెన్ మోనికా ఖన్నాను మెచ్చుకుందామంటూ ప్రశంసించింది.  క్లిష్టంగా ఉండే పాట్నా ఎయిర్‌ఫీల్డ్‌పై భారీ బరువుంటే విమానాన్ని ఎంతో నైపుణ్యంతో ల్యాండింగ్ చేశారని మెచ్చుకుంది. నిపుణుల చెబుతున్నదాని ప్రకారం.. భారత్‌లోని సంక్లిష్టమైన ఎయిర్‌పోర్టుల్లో పాట్నా ఎయిర్‌పోర్ట్ ఒకటి. రన్‌వేకి ఒక పక్కన ఎత్తైన చెట్లు ఉంటాయి. మరోపక్కన రైల్వే లైన్ ఉంటుందని ఇండియన్ క్యాబిన్ క్రూ ప్రకటనలో పేర్కొంది. కాగా పక్షి ఢీకొనడం కారణంగా స్పైస్‌జెట్ విమానంలో మంటలు చెలరేగానికి కారణమని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ తేల్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-06-20T23:37:42+05:30 IST