మేనా

ABN , First Publish Date - 2020-06-08T08:19:20+05:30 IST

చిరకాలంగా తెల్లవారుజాము స్వప్నంలో అందమైన మేనా ఒకటి వూరిస్తూ వూరేగుతోంది. దట్టమైన నల్లని కారుమబ్బుల కీకారణ్యంలో...

మేనా

చిరకాలంగా

తెల్లవారుజాము స్వప్నంలో

అందమైన మేనా ఒకటి

వూరిస్తూ వూరేగుతోంది.


దట్టమైన నల్లని

కారుమబ్బుల కీకారణ్యంలో

తెలతెల్లని నెలవంక

దోబూచులాడినట్లు...

ఎత్తైన వొత్తైన

గుబురు రెల్లు గడ్డి పొదలు మూసేసిన

వొంపు సొంపుల పిల్ల కాల్వలో

చిన్ని పడవొకటి

ఇట్టే కనిపించీ కనపడక వెళ్లిపోయినట్లు...

చిక్కని చీకట్ల

కాంతిమంతపు ముదురాకు పచ్చని

చెట్ల గుబుర్ల మధ్యలో 

పగడపు ఎర్రని చిలక ముక్కొకటి

దీపంలా వెలిగి మాయమైపోయినట్టు...

రాత్రి కలలో ధ్యానించానో

లేదా తెల్లవారుజామున

మెలకువలో మననం చేసానో

కళ్లు తెరవగానే కనికట్టులా

కరిగిపోయిన అందమైన కవితా వాక్యంలా...

చిరకాలంగా

తెల్లవారుజాము స్వప్నంలో

అందమైన మేనా ఒకటి

వూరిస్తూ వూరేగుతోంది.


అది ఆకాశంలో విహరిస్తున్నప్పుడు 

చోదకుడెవరో తెలియని

పుష్పక విమానంలా...

సముద్రంలో సంచరిస్తున్నప్పుడు 

సరంగు జాడలేని నౌకలా...

నేలమీద నడయాడుతున్నప్పుడు

నా ఎముకలు చర్మంతో నిర్మించిన పల్లకీలా...

ఒహొం ఒహొం ఒహొంబై

అని దాన్ని మోస్తున్న బోయీలెవ్వరు?

ఆ జిలుగు జలతారు పరదాల వెనక

కూచున్న ఆ అస్పష్టమొహం ఎవరిది?

అంతా దృశ్యాదృశ్యం!


ఒక్కోసారి

ఆ మేనాను నేనే మోస్తూ

అప్పుడప్పుడు భుజం మార్చుకుంటాను.


చిరనిరీక్షణ ఫలించినట్టు

చిరస్వప్నం సాకారమైనట్టు

ఒక భూపాల రాగపు ఉషోదయాన

రెండు పదుల స్వప్నం

కట్టెదుట సాక్షాత్కరించింది.

సంభ్రమమూ సంశయమూ ముప్పిరిగొనగా

ఓరగా తెరను తొలగించి చూసాను.

లోపల మేనాలో

నా కూతురు నవ వధువు!

నన్ను సంజీవిని చేసే

నా కవితా మధువు!! 

శిఖామణి

98482 02526

Updated Date - 2020-06-08T08:19:20+05:30 IST