బాలకృష్ణ, నాగార్జున కోసం ‘నరనారాయణ’ రాయించారు..

ABN , First Publish Date - 2020-02-07T20:33:40+05:30 IST

‘పంచదారలకన్న పనస తొనలకన్న తీయనైనది మన తెలుగు భాష’ అంటూ విశ్వవేదికలపై తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్నారు మీగడ రామలింగస్వామి.

బాలకృష్ణ, నాగార్జున కోసం ‘నరనారాయణ’ రాయించారు..

కృష్ణుడిగా బాలయ్య, అర్జునుడిగా నాగార్జున అనుకున్నారు

ఇటీవలే బాలకృష్ణ పిలిచి ఆ ప్రాజెక్టు గురించి అడిగారు

ఆదివారం పూటైనా తెలుగు భాషను పట్టించుకోండని

‘పద్యాలు చదివిన వాళ్లు అసలు లేరా..? ఆంధ్రదేశం గొడ్డుబోయిందా..?’

పండిత పుత్ర.. పరమశుంఠ.. అని నన్ను నిందించారు

ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో నవావధాని మీగడ రామలింగస్వామి


‘పంచదారలకన్న పనస తొనలకన్న తీయనైనది మన తెలుగు భాష’ అంటూ విశ్వవేదికలపై తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్నారు మీగడ రామలింగస్వామి. పద్య నాటకానికి జీవం పోస్తూ... రంగస్థలంపై అలరిస్తూ... అవధానంలో సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. సూర్యచంద్రులున్నంత వరకూ తెలుగు పద్యం, భాష బతికే ఉంటాయంటున్న ఈ ‘నవావధాని’... ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ 10-12-2017న నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

 

ఆర్కే: నమస్కారమండి మీగడ రామలింగస్వామి గారు..! ఎలా ఉన్నారు?

రామలింగస్వామి: నమస్తే అండీ... చాలా బావున్నాను

 

ఆర్కే: ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. మీకు తెలుగంటే ప్రాణం. కనుక మంచి తెలుగు పద్యంతో కార్యక్రమం మొదలుపెడదామా!

రామలింగస్వామి: తప్పకుండానండీ... తెలుగు భాష అమృతతుల్యమైనటువంటిది. ఎంత గొప్పదీ అంటే...

పాల మీగడకన్న పాయసాన్నముకన్న

తీయనైనది మన తెలుగు భాష

పంచదారలకన్న పనస తొనలకన్న

తీయనైనది మన తెలుగు భాష

జుంటి తేనెలకన్న జున్ను ముక్కలకన్న

తీయనైనది మన తెలుగు భాష

తియ్య మామిడికన్న తీపులన్నింటికన్న

తీయనైనది మన తెలుగు భాష...


ఆర్కే: మీరేమో తెలుగును ఇంత గొప్పగా వర్ణిస్తున్నారు. ఇప్పుడు తల్లులేమో ఇంగ్లీష్‌నే మాతృభాషగా చెప్పేస్తున్నారు. పిల్లలకు మాటలు రాకముందే వాళ్లతో ఇంగ్లీష్‌లో సంభాషిస్తున్నారు.

రామలింగస్వామి: అందుకనే మాలాంటి వారు అన్ని విధాలా, మీ లాంటి మాధ్యమాల ద్వారా ఎంత కృషి చేస్తున్నా మీరన్నట్టు మమ్మీ.. డాడీ కల్చర్‌ వదలడం లేదు.

అమ్మ అనే పదంలో కమ్మదనం ఉందిలే

మన భాషా పదాలలో మాధుర్యం ఉందిలే

మమ్మీ అనుట ఎందుకు?

డాడీ అనుట ఎందుకు?

పరభాషా పదాలపై వ్యామోహం ఎందుకు?

...ఇక్కడ ‘పరభాషా వ్యామోహం’ అన్నాను. పరభాష వద్దని అనడం లేదు. ‘వృత్తి పట్ల ఆంగ్లాన్ని పాటించండి... ప్రవృత్తిలో ఆంధ్రాన్ని పాలించండి’ అనే నినాదాన్ని చెబుతూ వస్తున్నా. ఇతర దేశం వెళ్లాలంటే వీసా కావాలి. కానీ తెలుగువాడిని అని చెప్పుకోవడానికి కనీసం పది పద్యాలైనా నేర్చుకోండని చెబుతున్నా. మహానుభావులు రాసిన ‘శతకాలు’ ఉన్నాయి మనకి. తెలుగు భాషలో ‘శతకాలు పచ్చల పతకాలు’. కానీ... చెప్పే వాళ్లేరీ? వినే వారేరీ?

నా అదృష్టమేమంటే... వృత్తి ‘ఆంధ్రోపన్యాసం’. దాని వల్ల పద్య నాటకం వైపు ఆకర్షితుడినై 1969లో ముఖానికి రంగు వేసుకున్నా.


ఆర్కే: మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. అష్టావధానమే కాదు... మీకు సంగీతం, నటన, దర్శకత్వం... అన్నీ వచ్చు. ఇంత ప్రజ్ఞ ఎలా సంపాదించారు? మీ కుటుంబంలో ఇలాంటివారు ఎవరైనా ఉన్నారా?

రామలింగస్వామి: ‘తూర్పు భాగవతం’ ఒక ప్రసిద్ధమైన కళారూపం. ఇప్పుడు లేదది. ఇందులో మంద్ర, మధ్య, తార స్థాయిల్లో మా నాన్న గారు పాడతారు. అందులో ఆయన సుప్రసిద్ధులు. నేను కూడా ఆ కళ వైపే ఆకర్షితుడినయ్యా. దాంతో టెన్త్‌ అయిన తరువాత సంగీతం నేర్చుకున్నా. నాలుగు సంవత్సరాలు నాటకాలు వేయడమే వ్యాపకం. మహా పండితుడు ముట్నూరి అనంతశర్మ గారు పిలిచి... ‘సంస్కృతాంధ్రం నేర్చుకోవయ్యా... మాటలు బాగుంటాయి’ అని చెప్పారు. దీంతో ఆయన వద్ద సంస్కృతం నేర్చుకున్నా. తరువాత విజయనగరం కళాశాలలో భాషా ప్రవీణ... అనంతరం ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఇక్కడ చేశాను. ఏది చూస్తే అది నేర్చుకోవాలి అనే పట్టుదల వచ్చేసింది నాలో! కానీ అందరూ తిట్టేవారు... ‘పండిత పుత్రః పరమ శుంఠః’లా తయారయ్యావు. ఎందులోనూ పట్టు లేకుండా అయ్యావేమిటి’ అని! మా నాన్నగారైతే ఎన్నోసార్లు కొట్టారు కూడా! అప్పుడు నాలో పరివర్తన వచ్చింది. హార్మోనియం నేర్చుకుని కొన్ని వందల నాటకాలకు హార్మోనిస్టుగా పనిచేశాను. అలా ఎంఏ వరకూ చేశాను.

 

ఆర్కే: మీరు ప్రయోజకుడిగా మారిన తరువాత మీ నాన్నగారు ఏమన్నారు? ఎప్పుడు గుర్తించారు మిమ్మల్ని?

రామలింగస్వామి: చదువుకోనటువంటి వాడిని చదువుకోవడం మొదలుపెట్టే సరికి నాన్న గారు చాలా సంతోషించారు. 1984లో నేను నాటకం రాస్తానని చెప్పాను ఆయనతో. ‘నువ్వు నాటకం రాయడమేంటి! పద్య నాటకమంటే సామాన్యమైన విషయమా’ అన్నారు. సరేనని ముహూర్తం చూసి చెప్పారు. జీఎంఆర్‌ తమ్ముడు ఈశ్వర్‌రావు, నేను క్లాస్‌మేట్స్‌. వాళ్ల నాన్నగారు నేను చిన్నప్పుడు వేషం వేసినప్పుడు... ‘నువ్వు ఎన్ని పద్యాలు చెబితే అన్ని రూపాయలు ఇస్తానోయ్‌’ అన్నారు. అప్పుడు నాకు ఏడు పద్యాలే వచ్చు. అవన్నీ చెప్పేసి ఏడు రూపాయలు తీసుకున్నా. చినబాబు గారి సతీమణి మొట్ట మొదట నా ‘కాళహస్తీశ్వర’ నాటకానికి రూ.116 చందా వేశారు. ఆమె చెయ్యి మంచిదని మాకో ప్రతీతి. మా మల్లికార్జున స్వామి ఆలయం వద్ద ఈ నాటకం ప్రదర్శించారు. దీనికి పేర్లు వేయించాను. తరువాత శివుడి త్రిశూలం- రాక్షసుడి ఖడ్గం దెబ్బలాడుకుంటున్నట్టు వైర్‌ వర్క్‌ చేశాం. ఇప్పుడు సురభి వారు చేస్తున్నట్టు! అది నా నాటక రంగ జీవితానికి పెద్ద మలుపు. దానికి రచన, దర్శకత్వం, సంగీత దర్శకత్వం, నాయక పాత్రధారిని నేనే. అదే నన్ను అమెరికాకు తీసుకెళ్లింది. అదే నాకు నంది అవార్డులు తెచ్చి పెట్టింది. అలా 15 వందలకు పైగా నాటకాలు వేశా. 26 నంది పురస్కారాలు తీసుకున్నా. చదువులో కూడా యూనివర్సిటీ ఫస్ట్‌ వచ్చాను. తరువాత ‘తిరుపతి వేంకట కవులు’పై పీహెచ్‌డీ చేశాను. దాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అచ్చు వేయించారు. 1987లో ఏపీపీఎస్సీలో సెలెక్ట్‌ అయ్యి లెక్చరర్‌గా చేరాను. అనంతరం రీడరుగా... ప్రిన్సిపాలుగా పనిచేసి 2013లో రిటైరయ్యాను. వృత్తి.. ప్రవృత్తి... రెండింటికీ సమ ప్రాధాన్యం ఇచ్చాను. ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలన్నదే నా తపన.

 

ఆర్కే: మీరు అవధానంలో ‘సంగీత నవావధానం’ అనే ప్రత్యేక ప్రక్రియను కనుగొన్నారు. ఈ ప్రక్రియ పరంపరలో భాగమా? లేక మీ సృష్టేనా?

రామలింగస్వామి: ఇది రూపకల్పన. ఒక్కొక్క ప్రక్రియకూ ఒక్కొక్కరు ఆద్యులవుతుంటారు. దీనికి నేనే ఆద్యుడినయ్యాను. పద్యనాటకం, సంగీతం, సాహిత్యంలో నాకున్న పరిజ్ఞానం వల్ల ఇది చేయగలిగాను. పద్యనాటకం అద్భుతంగా పండాలంటే మూడు ప్రధానం... సాహిత్యం, సంగీతం, నటన. వీటి సమ్మేళనమే పద్యనాటకం. మూడూ సమాంతరంగా సాగాలి. సాహిత్యం అర్థమవ్వాలి. భావానికి అనుగుణంగా చేయాలి. ఇవాళ విద్యార్థుల్లో నోరు తిరగని వాళ్లు చాలా మంది ఉన్నారు. పోతన గారి ‘అడిగెదనని కడువడిజను...’ వంటి పద్యాలు సాధన చేస్తే నోరెందుకు తిరగదండీ! ఇలాంటివి పిల్లలకు నేర్పించండి. భాష వస్తుంది. ‘తెలుగు భాషా బాగా మాట్లాడగలిగిన వాడిని ఏ భాషా అడ్డదు’. ఇక నవావధానానికి వస్తే... నాకంటూ ఓ ప్రత్యేకత చూపించాలని 2006లో నాకున్న సంగీత, భాషా జ్ఞానంతో దీనికి రూపకల్పన చేశాను. ఇందులో తెలుగు భాషని పురాణం, శతకం, ప్రబంధం, నాటకం, ఆధునికం, అవధానం, సంస్కృతం... ఏడు విభాగాలు చేశాను. ఈ ఏడింటిలో 20 చొప్పున మహాకవుల ప్రసిద్ధ పద్యాలు పెట్టాను. ఆ పక్కనే 20 రాగాలు పెట్టాను. అంటే మొత్తం 2800 కాంబినేషన్స్‌లో ప్రశ్నలడుగుతారు. ఏడుగురు ప్రాశ్నికులు, సంధాత, నవావధాని (నేను)... మొత్తం 9 మందితో చేసే అవధానం కనుక ‘నవావధానం’ అని పెట్టాను.

ఛందస్సు శాస్త్ర ప్రకారం 13,42,26,296 వృత్తాలున్నాయి. వీటన్నింటిలో పద్యాలు రాశారా అన్నది కాదు ముఖ్యం... ‘ఇంతటి శాస్త్రం మనకున్నది’ అని పిల్లలకు చెబితే... వాళ్లకి ‘ఓహో... తెలుగు భాష ఇంత గొప్పదా’ అనిపిస్తుంది. ఇలాంటివన్నీ నవావధానంలో పెట్టి దేశ విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.


ఆర్కే: నాదో సలహా... మీరు విద్యార్థులకు చెప్పే కన్నా... ముందు వారికి బోధిస్తున్న తెలుగు అధ్యాపకులకు చెప్పడం మంచిది!

రామలింగస్వామి: నిజమే! టీచర్లకు పునశ్ఛరణ తరగతుల్లో ఉచ్చారణ చెప్పించాలండీ.

ఆర్కే: ‘రామ రావణ యుద్ధం’ గురించి కూడా ఒక పద్యం పాడండి!

రామలింగస్వామి: ఇది వాల్మీకి రాశాడు. ఒక్కసారి వింటే వచ్చేంత సులభతరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచీ అగ్గిపెట్టెను చూస్తున్నాం. మనం కవులం కాదు కాబట్టి మనకేం అనిపించదు. కానీ...

అగ్గిపెట్టె పైకప్పు భర్త లోకప్పు భార్య

లోన పుల్లలు వారి పిల్లలు

రగిలే మంటలు ఆకలి మంటలు

...చిన్న కవితిది. ఎక్కువ మంది పిల్లలుంటే వాడికి ఇబ్బందులని! ఇది మనకు ఎలా స్పష్టంగా అర్థమైందో...

గగనం గగనాకారం / సాగరం సాగరోపమం

రామరావణయోర్యుద్ధం / రామరావణయోరివ

... ‘ఆకాశం ఆకాశంలానే ఉంది. సముద్రం సముద్రంలానే ఉంది. మరి రాముడు- రావణుడి యుద్ధం ఎలా ఉందంటే..! రాముడు-రావణుడు యుద్ధం చేస్తున్నట్టుగానే ఉంది’ అన్నారు 32 అక్షరాల్లో మహాకవి వాల్మీకి. నా ఉద్దేశం ఏమిటంటే... ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఇలాంటివి చెప్పాలని. భాషా సంస్కృతి గురించి శనివారం రెండు మూడు తరగతులు పెట్టండని వైస్‌చాన్స్‌లర్‌లకు విన్నవించాను. 34 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పిల్లలు పద్యం పట్ల ఎంతో ఆకర్షితులయ్యారు. పద్యాన్ని ఎలా పలుకుతున్నామన్నది ప్రధానం. ఇవాళ పద్యాన్ని, పద్య నాటకాన్ని బతికిస్తున్న వాళ్లు గ్రామ సీమల్లో అభిమానం చూపేవాళ్లే తప్ప మనలాంటి వారెవరూ కాదు. అమెరికా అంతా తిరిగాను నేను. అక్కడ కూడా ‘జెండాపై కపిరాజు’ పాట పాడితే ‘వన్స్‌ మోర్‌’ అన్నారు. నేను చెప్పేదేమంటే... కనీసం ఆదివారం పూటైనా తెలుగు భాషను పట్టించుకోండని. చిన్నమ్మ, పిన్నమ్మ వరుసలు ఇప్పుడు లేవండీ! అన్నీ ‘ఆంటీలు... అంకుళ్లే’. ‘రిక్షా అంకులొచ్చాడు... చివరకు ‘ముష్టి అంకుల్‌ వచ్చాడు మమ్మీ’ అంటుంటే ఇంకేం చేస్తామండీ!

 

ఆర్కే: ఈ అవధాన ప్రక్రియలో ఉద్దండులు కూడా చాలా సందర్భాల్లో ఎక్కడో అక్కడ ఓ ప్రాశ్నికుడి నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. మీకూ అలాంటి పరిస్థితి ఎదురైందా?

రామలింగస్వామి: అవధానమంటే సర్వ శాస్త్రాలతో ప్రమేయం ఉంటుంది. చాలా కష్టమైంది. తెలుగు వాళ్లకు గొప్ప శిఖరాయమానమైన విద్య ఏదైనా ఉందంటే అది అవధానం ఒక్కటే. ఆ అవధానాన్ని అనేక రకాలుగా అల్లరి పెడుతుంటారు. ఇక నా ప్రకియకు వస్తే... ఇరవై రాగాల మీద వాళ్లని సంతృప్తి పరిచే విధంగా అధికారం సంపాదించుకోవాలి. ‘అవధానం’ అంటే ‘ఏకాగ్రత’. అంటే ఒక రాగం నుంచి మరో రాగంలోకి వెంటనే వెళ్లాలి. అది అంత సులువైన విషయం కాదు. కొన్ని కొన్ని రాగాలు చాలా కష్టంగా ఉంటాయి. అక్కడ పప్పులో కాలేస్తుంటాం. అలా వేయకుండా నిగ్రహం ఉండాలి. అక్కడ ఏదో తమాషా చేసి ఆ సినిమా పాటను ఆవాహనం చేసుకుంటే ఆ రాగం నాకొచ్చేస్తుంది. ఒకసారి ఒకామె దీర్ఘ సమాసం ఇచ్చి శివరంజనిలో పాడమన్నారు. ఎక్కడ అందుకోవాలి.. ఎక్కడ విరవాలి? మధ్యలో తమాషాగా ఏదో మాట్లాడుతూ, సాహిత్య విషయం చెబుతూ... లోపల లోపల ఆలోచించుకుని పాడాను.

 

ఆర్కే: మీకు కృష్ణదేవరాయల సాహిత్యం అంటే ఇష్టమనుకుంటా..!

రామలింగస్వామి: అని కాదు! నాకు ప్రాచీన సాహిత్యంపై అవగాహన ఉంది. సంస్కృత శ్లోకాలపై కూడా కొంత పట్టుంది. ఎంఏ తెలుగు చదవడం వల్ల ఆధునిక సాహిత్యంపై అవగాహన ఏర్పడింది. పిల్లల్లో మన భావాల్ని రుద్దకూడదు. ‘ప్రపంచమొక పద్మవ్యూహం... కవిత్వమొక తీరని దాహం’ అన్నారు శ్రీశ్రీ. ఈ రెండు లైన్లలో పద్యముందా? ఛందస్సు ఉందా? ఏమీ లేదు. కానీ దీనికి వ్యాఖ్యానం ఎంతైనా చెప్పచ్చు. అందుకే శ్రీశ్రీని మహాకవి అంటారు.

 

ఆర్కే: తెలుగు భాష భవిష్యత్తుపై మీకెలాంటి సందేహాలూ లేవుగా..!

రామలింగస్వామి: అనుమానమే లేదు. సూర్య చంద్రులున్నంత వరకూ పద్యం బతుకుతుంది. అంతవరకూ తెలుగు భాష ఉంటుంది. ప్రభుత్వాల అండదండలు కూడా కళలకు కావాలి. ప్రపంచంలో ఎక్కడా లేని కళా ప్రక్రియ పద్య నాటకం. ఇవాళ చాలామంది పద్య నాటక కళాకారులు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వారికి అండ కావాలి.

 

ఆర్కే: సాహితీ రంగంలో మీ స్థానం ఎక్కడ?

రామలింగస్వామి: నా స్థానం ఇంకా కిందనే ఉంది. నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. కళారంగంలో నా స్థానం ఇది అని చెప్పుకొంటే వాడికి వాడే ఫుల్‌స్టాప్‌ పెట్టుకున్నట్టే. మహానుభావులు ఒకళ్లను మించి ఒకళ్లున్నారు.

 

ఆర్కే: మీ పిల్లలెవరన్నా ఇలా కళల్లో ఉన్నారా?

రామలింగస్వామి: ఎవరూ లేరండి! వాళ్లంతా ఇంజనీరింగ్‌ చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

 

ఆర్కే: వాళ్లకు కనీసం భాష మీద పట్టుందా?

రామలింగస్వామి: పర్లేదండి. ఇరవై ముప్ఫై పద్యాలు, హార్మోనియం నేర్పాను.


ఆర్కే: మీకు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా ఎందుకు అటువైపు వెళ్లలేదు?

రామలింగస్వామి: ఎందుకో నాకది కుదరలేదండీ! నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారు నా చేత ‘నర నారాయణ’ రాయించారు. నాగార్జున, బాలకృష్ణ కోసం! సమాసాలు ఎవరికి ఎక్కువ కాకూడదు... తక్కువ కాకూడదు అని చెప్పారు. మీరు ఓ నెల రోజులు సెలవు పెట్టుకుని రండని పిలిచారు. సినిమా కోసం నేను సెలవు పెట్టనని చెప్పాను. ‘నేను చెయ్యలేను అన్నయ్య గారు’ అన్నాను. దసరా సెలవులకు శ్రీకాకుళంలో వారికున్న కచేరీలో కూర్చోబెట్టి, అది రాయించారు. అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. బాలకృష్ణతో కృష్ణుడు, నాగార్జునతో అర్జునుడు వేయించాలన్నది వారి ఆలోచన. మొన్నీమధ్యనే బాలకృష్ణ గారు కూడా అదేంటో చెప్పండని దాని గురించి పిలిపించి అడిగారు. చెప్పాను.

 

ఆర్కే: మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదనే అసంతృప్తి ఉందా?

రామలింగస్వామి: అలాంటిదేమీ లేదండి. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారి దాకా, పెద్దల చేతుల మీదుగా 14 సార్లు సన్మానాలయ్యాయి. 26 నంది పురస్కారాలు వచ్చాయి. నా వర్క్స్‌పై ముగ్గురు డాక్టరేట్‌ చేశారు.


ఆర్కే: ఎప్పుడన్నా విప్లవ గీతాలు పాడారా?

రామలింగస్వామి: సాహితీ విద్యార్థిగా శ్రీశ్రీని గౌరవిస్తాను. వాళ్ల ఉపన్యాసాలకు కూడా వెళ్లాను. వాళ్లను చూడటమనేదే ఓ గొప్ప భావన. వాళ్లు ఎంతో సింపుల్‌గా ఉండేవారు. ఇప్పుడు ఆడంబరాలు ఎక్కువయ్యాయి.

 

ఆర్కే: మీరిలాగే మీ గాత్రం, సంగీతంతో తెలుగు ప్రజలను అలరించాలని, తెలుగు భాష అభివృద్ధికి మీ శేష జీవితాన్ని అంకితం చేయాలని కోరుకుంటూ థ్యాంక్యూ వెరీమచ్‌!

 

రామలింగస్వామి: ధన్యవాదాలండి!

Updated Date - 2020-02-07T20:33:40+05:30 IST