సేవలందక అగచాట్లు

ABN , First Publish Date - 2020-08-08T10:00:58+05:30 IST

మీసేవ కేంద్రాల్లో అందే అన్నీ సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందచేస్తామని ..

సేవలందక అగచాట్లు

గ్రామ, వార్డు సచివాలయాల్లో అందని వైనం

మీసేవ కేంద్రాల మూత

ధ్రువీకరణ పత్రాల కోసం జనం ఇక్కట్లు


నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 7 : మీసేవ కేంద్రాల్లో అందే అన్నీ సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందచేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే నేడు అక్కడ ఆ సేవలు అందక ప్రజలు కుల, నివాస తదితర ధ్రువీకరణ పత్రాల కోసం నానా అగచాట్లు పడుతున్నారు. మీసేవలో నేటివిటి సర్టిఫికెట్‌, కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు, విద్యుత్‌, ఇంటిపన్ను, కొళాయి పన్ను చెల్లింపుల వంటి సేవలను పొందే వీలుండేది. జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల ఏర్పాటుతో ప్రజలకు వాటి సేవలు మరింత చేరువయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయాల్లోనే అన్నీ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. అయితే సచివాలయాల్లో సేవలు సరిగా అందటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.


అర్భన్‌ మీసేవ సెంటర్ల మూత

సచివాలయాల ఏర్పాటు తరువాత అర్భన్‌ మీసేవ కేంద్రాలు  మూతపడ్డాయి. అవి ఉన్నప్పుడు విద్యుత్‌ బిల్లులు, రిజిస్ట్రేషన్‌ సంబంధ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతోపాటు, భూసంబంధ సర్టిఫికెట్లు సకాలంలో జారీ అయ్యేవి. నెల్లూరులోని ఆర్టీసీ సెంటర్‌లో, వేదాయపాళెం, స్టోన్‌హౌస్‌పేట, కలెక్టరేట్‌, కావలి, గూడూరు, వెంకటగిరిలలో అర్భన్‌ మీసేవ సెంటర్‌లు ఉండేవి. ఈ సెంటర్‌ల ద్వారా విలువైన సేవలను ప్రజలు పొందేవారు. రైల్వే టిక్కెట్లు కూడా పొందే వీలుండేది. నగరంలోని అన్నీ ప్రాంతాలకు అర్భన్‌ మీసేవలు అందుబాటులో ఉండటంతో ప్రజలు వాటి ద్వారా పలు సేవలు పొందేవారు. ఇవి ఇప్పుడు మూత పడటంతో నగరం, పట్టణాల్లో మీసేవలు అందుబాటు లో లేకుండా పోయాయి. 


97 మీసేవ ఫ్రాంచైజీలు

అర్భన్‌ మీసేవ సెంటర్‌ మూతపడ్డా  97 అర్భన్‌ మీసేవ ప్రాంఛైజీలు పనిచేస్తున్నాయి. ఇవి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్నాయి. ఒకే ఏజెన్సీ కింద ఇవి పనిచేస్తున్నాయి.  అయితే ఈ సెంటర్‌లలో కుల, ఆదాయ సర్టిఫికెట్ల ముద్రణకు అవసరమైన సర్టిఫికెట్ల కొరత ఉన్నట్లు సమాచారం. వీటి సేవలను ఆటంక పరచవద్దని ప్రజలు కోరుతున్నారు. 


అందని కమీషన్‌ :

మీసేవ ఫ్రాంఛైజీలకు  నవంబరు నుంచి ప్రభుత్వం కమీషన్‌ చెల్లించలేదని ఆపరేటర్‌లు ఆరోపిస్తున్నారు. గది అద్డె, కరెంటు ఖర్చులు భరించి ఈ కేంద్రాలను కష్టతరంగా నిర్వహిస్తున్న తరుణంలో కమీషన్‌ చెల్లించక పోవటంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరిగుతున్నా కుల, ఆదాయ, జనన, మరణ సర్టిఫికెట్‌ల వంటివి పొందటం కష్టతరంగా ఉందని, అర్బన్‌ మీసేవ సెంటర్‌లను తెరిచి మీసేవలను విస్తృత పరచాలని ప్రజలు కోరుతున్నారు.


 కమీషన్‌ చెల్లించేలా చూస్తాం ..షేక్‌ సలీం, మీసేవ జిల్లా కో ఆర్డినేటర్‌

మీసేవ ప్రాంచైజీలకు రెండు మూడు రోజుల్లోల కమీషన్‌ చెల్లించే ఏర్పాట్లు చేస్తాం.  కుల, ఆదాయ ఇతర సర్టిఫికెట్ల ముద్రణకు అవసరమైన సర్టిఫికెట్లను కొరత లేకుండా  చూస్తాం.

Updated Date - 2020-08-08T10:00:58+05:30 IST