సుదీర్ఘ పోరు.. మెద్వెదెవ్‌ జోరు

ABN , First Publish Date - 2022-01-27T06:51:25+05:30 IST

రెండోసీడ్‌ రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ అద్భుతంగా పోరాడాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో తొలిరెండు

సుదీర్ఘ పోరు.. మెద్వెదెవ్‌ జోరు

ఐదుసెట్ల క్వార్టర్స్‌లో రష్యా స్టార్‌ అద్భుత విజయం 

సెమీస్‌లో సిట్సిపాస్, కొలిన్స్‌ 


మెల్‌బోర్న్‌: రెండోసీడ్‌ రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ అద్భుతంగా పోరాడాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో తొలిరెండు సెట్లు చేజారినా వెనుకంజ వేయలేదు. అంతేకాదు..నాలుగో సెట్‌లో కెనడా ప్రత్యర్థి ఫెలిక్స్‌ అగర్‌ అలియాసిమ్‌ సెట్‌ పాయింట్‌ను కాచుకోవడంతో పెరిగిపోయిన ఉత్కంఠనూ యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ మెద్వెదెవ్‌ అదిమిపట్టాడు. బుధవారం రాడ్‌ లేవర్‌ ఎరీనాలో నాలుగున్నర గంటలపాటు జరిగిన సుదీర్ఘ పోరులో మెద్వెదెవ్‌ 6-7 (4), 3-6, 7-6 (2), 7-5, 6-4తో కెనడా టీనేజర్‌ అగర్‌ను మట్టికరిపించాడు. రెండుసెట్లు కోల్పోయినా మెద్వెదెవ్‌ పుంజుకొని మ్యాచ్‌లో విజయం సాధించడం అతడి కెరీర్‌లో ఇది రెండోసారి. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌తో మెద్వెదెవ్‌ అమీతుమీ తేల్చుకుంటాడు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్స్‌లో గ్రీకు వీరుడు సిట్సిపాస్‌ 6-3, 6-4, 6-2 స్కోరుతో 11వ సీడ్‌ జానిక్‌ సిన్నర్‌ (ఇటలీ)ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. 23 ఏళ్ల స్టెఫనోస్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఐదోసారి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. ఇక.. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో పోలెండ్‌కు చెందిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ స్వియటెక్‌ 4-6, 7-6 (2), 6-3 స్కోరుతో 36 ఏళ్ల కియా కనేపి (ఎస్టోనియా)పై నెగ్గింది. గురువారం జరిగే సెమీస్‌లో అమెరికాకు చెందిన డానిల్‌ కొలిన్స్‌ను స్వియటెక్‌ ఢీకొననుంది. మరో క్వార్టర్‌ఫైనల్లో 27వ సీడ్‌ కొలిన్స్‌ (అమెరికా) 7-5, 6-1 స్కోరుతో అలైజ్‌ కార్నెట్‌ (ఫ్రాన్స్‌)పై సునాయాసంగా నెగ్గింది. 


సెమీస్‌లో ఎవరితో ఎవరు?

మహిళల సింగిల్స్‌

ఆష్లే బార్టీ గీ కీస్‌

స్వియటెక్‌ గీ కొలిన్స్‌


పురుషుల సింగిల్స్‌

నడాల్‌ గీ బెరెట్టిని

మెద్వెదెవ్‌ గీ సిట్సిపాస్‌


Updated Date - 2022-01-27T06:51:25+05:30 IST