13 నుంచి మెడ్‌ప్లస్‌ ఐపీఓ

ABN , First Publish Date - 2021-12-08T08:00:20+05:30 IST

రిటైల్‌ ఫార్మసీ స్టోర్ల నిర్వహణ సంస్థ మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) వచ్చే వారం మార్కెట్లోకి అడుగుపెట్టనుంది....

13 నుంచి మెడ్‌ప్లస్‌ ఐపీఓ

  ఇష్యూ ధర శ్రేణి రూ.780-796

  రూ.1,398 కోట్ల సమీకరణ లక్ష్యం 


హైదరాబాద్‌: రిటైల్‌ ఫార్మసీ స్టోర్ల నిర్వహణ సంస్థ మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) వచ్చే వారం మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న కంపెనీ ఇష్యూ ఈ నెల 13న ప్రారంభమై 15న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్‌ ఈ నెల 10న ప్రారంభం కానుంది. ఐపీఓలో విక్రయించనున్న ఒక్కో షేరు ధర శ్రేణిని కంపె నీ రూ.780-796గా నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా రూ.600 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీ చేయడంతో పాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులకు చెందిన రూ.798.30 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో విక్రయించనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.1,398.30 కోట్లు సేకరించనుంది. తొలుత ప్రకటించిన దానితో పోలిస్తే, ఇష్యూ సైజు తగ్గింది. ఎందుకంటే, ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.1,038.71 కోట్లు సేకరించనున్నట్లు గతంలో ప్రకటిం చిన కంపెనీ.. తాజాగా ఈ మొత్తాన్ని రూ.798.30 కోట్లకు తగ్గించుకుంది. 


ఉద్యోగుల కోసం రూ.5 కోట్ల షేర్లు రిజర్వ్‌ 

ఐపీఓలో రూ.5 కోట్ల విలువైన షేర్లను తమ ఉద్యో గుల కోసం రిజర్వ్‌ చేసినట్లు మెడ్‌ప్లస్‌ తెలిపింది. అంతేకాదు, ఇష్యూ తుది ధర కంటే రూ.78 తక్కువకే వారికి షేర్లు కేటాయించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసిం ది. ఇష్యూలో సగం షేర్లను కంపెనీ క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌ (క్యూఐబీ)కు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 


కనీసం 18 షేర్లకు బిడ్‌

ఇన్వెస్టర్లు కనీసం 18 షేర్ల కొనుగోలుకు బిడ్‌ సమర్పిం చాల్సి ఉంటుంది. బిడ్‌ సైజును 18 షేర్ల చొప్పున పెంచు కుంటూ పోవచ్చు. తాజా ఈక్విటీ జారీ ద్వారా లభించే నిధులను కంపెనీ అనుబంధ విభాగమైన ఆప్టివల్‌ నిర్వహణ మూలధన అవసరాల కోసం ఉపయోగిం చుకోనున్నట్లు మెడ్‌ప్లస్‌ వెల్లడించింది. 


2006లో ప్రారంభం 

హైదరాబాద్‌కు చెందిన మెడ్‌ప్ల్‌సను గంగాడి మధుకర్‌ రెడ్డి 2006లో ప్రారంభించారు. ప్రస్తుతం ఆయనే కంపెనీ ఎండీ, సీఈఓ. విక్రయాలు, ప్రతి యేటా కొత్తగా ప్రారంభించే స్టోర్లపైనే కంపెనీ వృద్ధి ఆధారపడి ఉందని మధుకర్‌ రెడ్డి అన్నారు. కరోనా సంక్షోభ కాలమైనప్పటికీ, గత ఏడాదిలో 350 కొత్త స్టోర్లను ఏర్పాటు చేశామని, ఈ ఏడాది ప్రథమార్ధంలో మరో 350 ఫార్మసీ కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ఏడాది మొత్తానికి కొత్త స్టోర్ల సంఖ్య 700కు పెరగవచ్చన్నారు. ప్రస్తుతం మెడ్‌ప్లస్‌ దేశం లో రెండో అతిపెద్ద రిటైల్‌ ఫార్మసీ స్టోర్ల నిర్వహణదారు. ఈ ఏడాది మార్చి చివరినాటికి 2,000కు పైగా స్టోర్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. 

Updated Date - 2021-12-08T08:00:20+05:30 IST