ఆ అధికారి రూటే సపరేటు!

ABN , First Publish Date - 2021-05-13T06:12:10+05:30 IST

మేడికొండూరు తహసీల్దారు కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఓ రెవెన్యూ అధికారి మండల ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు.

ఆ అధికారి రూటే సపరేటు!
మేడికొండూరు తహసీల్దార్‌ కార్యాలయం

కరోనా కాలంలోనూ కాసుల వేట 

డబ్బులు ముట్టచెప్పందే ఫైలు కదలని వైనం

కింది స్థాయి అధికారులు సంతకాలు చేసినా ససేమిరా

మేడికొండూరు రెవెన్యూ కార్యాలయంలో బ్రోకర్ల దందా 

మేడికొండూరు, మే 12: మేడికొండూరు తహసీల్దారు కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఓ రెవెన్యూ అధికారి మండల ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. కిందిస్థాయి అధికారులు సంతకాలు చేసినా ముడుపులు ఇవ్వలేదన్న సాకుతో ఆ అధికారి ఆన్‌లైన్‌ దరఖాస్తులను రిజక్ట్‌ చేస్తుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో తిష్టవేసిన కొందరు బ్రోకర్లు దరఖాస్తుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఫ్యామిలీ మెంబర్‌, బర్త్‌, డెత్‌ సర్టిపికెట్ల జారీకి రూ.పది వేల వరకు రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం. భూ సమస్యలకు సంబంధించి ఎవరైనా వస్తే  పొలం ధర ఎంత అని తెలుసుకుని దానికి తగ్గట్టుగా వేలాది రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. అడంగల్‌ సవరణకు ఒక రేటు, భూ కొలత మార్చడానికి మరో రేటు, పాసు పుస్తకాల్లో పేర్ల సవరణకు ఇంకో రేటు నిర్ణయించి ఆ అధికారి వసూళ్లకు పాల్పడుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.  వీఆర్వోలు సైతం ఆ అధికారి తీరుకు బెంబేలెత్తిపోతున్నారు. మేడికొండూరులో ఓ రైతు పాసుపుస్తకంలో మార్పులు చేసి కొత్త పాసు పుస్తకం ఇవ్వాలని అడిగితే రూ.50వేలకు వసూలు చేసినట్లు సమాచారం. కానీ నేటి వరకు పాసు పుస్తకం ఇవ్వలేదు. ఆ అధికారి రైతులతో పాటు వీఆర్వోలను సైతం ముప్పుతిప్పలు పెడుతున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎవరైనా అంటే  దిక్కున్న చోటుకి వెళ్లి చెప్పుకో అంటున్నారు. కొద్దినెలల క్రితం వరకు జిల్లా ఉన్నతాధికారి అండతో రెచ్చిపోయిన ఆ అధికారి ప్రస్తుతం నియోజకవర్గంలోని ఒక ప్రజాప్రతి అండదండలు సంపాదించారని, అందు వల్లనే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు బాహాటంగానే చెప్పుకొంటున్నారు. 

సర్వే వ్యవహారాల్లోను ఆయనదే పెత్తనం  

సాధారణంగా భూ సర్వేలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ముందుగా సర్వేయరే పరిశీలించి భూమి కొలతలకు సమయం కేటాయిస్తారు. అందుకు విరుద్ధంగా సర్వే వ్యవహారాల్లోనూ ఆ అధికారిదే పెత్తనం. ఆయన చెప్పందే సర్వేయర్లు కొలతలు వేయలేని పరిస్థితి, ఒక వేళ వేసినా సర్టిఫికెట్‌ ఇవ్వరు. దీంతో సర్వేయర్లు సైతం మాకెందుకు తలనొప్పి అంటూ తప్పుకొంటున్నారు. 

సచివాలయ దరఖాస్తుల బుట్టదాఖలే..

గ్రామ సచివాలయాల ద్వారా వచ్చిన దరఖాస్తులు బుట్టదాఖలే అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. మీ సేవ ద్వారా అందిన దరఖాస్తులు అధికారులు రిజక్ట్‌ చేస్తున్నారని ప్రచారం జరగడంతో అనేకమంది గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ కాసులివ్వందే కుదరదని ఆ అధికారి రిజక్ట్‌ చేస్తున్నట్లు సమాచారం. 

నాకూ ఫిర్యాదులు వస్తున్నాయి: ఆర్డీవో ఎస్‌.భాస్కరరెడ్డి

ఈ విషయమై ఆర్డీవో ఎస్‌.భాస్కరరెడ్డిని వివరణ కోరగా మేడికొండూరు తహసీల్దారు కార్యాలయంలో ముడుపులు కోసం వేధిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు.  తనకు ఎవరూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, బాధితులు ఎవరైనా తనకు ఫిర్యాదు చేస్తే విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-05-13T06:12:10+05:30 IST