డాక్టర్లకు మెడిసిన్‌ బుక్‌లెట్లు

ABN , First Publish Date - 2022-07-07T09:22:42+05:30 IST

రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులందరికీ మెడిసిన్‌ బుక్‌లెట్లు ఇవ్వాలని వైద్యశాఖ నిర్ణయించింది.

డాక్టర్లకు మెడిసిన్‌ బుక్‌లెట్లు

  • అందులో ఉన్న మందులే రాయాలి.. 
  • లేనివి రాస్తే చర్యలు తప్పవు
  • బ్రాండ్‌, కాంబినేషన్‌ మందులు రాయొద్దు
  • ‘ఫార్మసీ’ వద్ద మందుల లభ్యత వివరాలు
  • ఈ విధానం అమలుకు వైద్య శాఖ కసరత్తు

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులందరికీ మెడిసిన్‌ బుక్‌లెట్లు ఇవ్వాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇకనుంచి ఆ బుక్‌లెట్‌లో ఉన్న ఔషధాలనే వైద్యులు రాయాల్సివుంటుంది. త్వరలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు వైద్యశాఖ కసరత్తు చేస్తోంది. సర్కారీ దవాఖానాల్లో నిత్యం మందులు కొరత ఉంటోంది. దానికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి ప్రొక్యూర్‌మెంట్‌ చేయకపోవడం. రెండోది ఆ మెడిసిన్‌ ఉన్నప్పటికీ బ్రాండ్‌ పేరుతో రాసి బయటకు పంపడం. చాలాచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్రాండ్ల పేరుతోనే మందులను రాస్తున్నారు. ఇలా బ్రాండ్ల పేరుతో మందులు రాయవద్దని జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ఇప్పటికే సూచించింది. రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులకు ఒక సర్క్యులర్‌ కూడా జారీ చేసింది. అయినప్పటికీ ఎప్పటి నుంచో ఉండే అలవాటును వైద్యులు మానుకోలేకపోతున్నారు. యథావిధిగా బ్రాండ్ల పేరుతోనే మందులు రాస్తున్నారు. దీంతో వైద్యులు రాసిన బ్రాండ్‌ మెడిసిన్‌, సర్కారీ ఆస్పత్రులోని ఫార్మసీల్లో ఉండటం లేదు. వాస్తవానికి ఆ ఔషధ ఫార్ములా ఫార్మసీ కౌంటర్లలో ఉంటాయి. ఆస్పత్రి ప్రాంగణంలో ఉండే ప్రైవేటు మెడికల్‌ షాపుల వాళ్లతో ఫార్మసిస్టులు లాలూచి పడుతున్నారు. దాంతో డాక్టర్‌ రాసిన బ్రాండ్‌ లేదని ప్రైవేటు మెడికల్‌ షాపు వద్దకు రోగులకు పంపుతున్నారు. దీంతో రోగుల జేబు లు గుల్ల అవుతున్నాయి. నిత్యం ఇదే తంతు జరుగుతోంది. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ఔషధాలున్నప్పటికీ బ్రాండ్ల పేరుతో బయటకు మందులు రాయవద్దని హెచ్చరించారు. ఇక నుంచి ఔషధ ఫార్ములానే రాయాలని సూచించారు. అయినప్పటికీ కొన్నిచోట్ల కాంబినేషన్‌ డ్రగ్స్‌ రాస్తున్నారు. ఆ కాంబినేషన్‌ డ్రగ్స్‌ గవర్నమెంట్‌ ఆస్పత్రిలోని ఫార్మసీల్లో ఉండకపోవడంతో ఎప్పటిలానే బయట కొనాల్సివస్తోంది.


అందుబాటులో ఉండే మందులే రాయాలి

తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎంఎస్‌ఐడీసీ) ఔషధాలను ప్రొక్యూర్‌ చేస్తుంది. కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన మందుల వివరాలను బుక్‌లెట్‌లో ఉంచుతారు. ఇక నుంచి ఆస్పత్రుల్లో వైద్యులు ఆ మందులనుమాత్రమే రోగులకు రాయాల్సి వుంటుంది. బ్రాండ్‌ పేరుతో రాయకూడదు. ఊదాహరణకు ఇప్పటిదాకా జ్వరం వచ్చిన వారికి మెజార్టీ వైద్యులు డోలో పేరుతో ఉన్న గోళీలను రాస్తున్నారు. ఇక నుంచి కేవలం పారాసిటమాల్‌ పేరుతోనే ఔషధాలను రాయల్సివుంటుంది. అలాగే బ్రాండ్‌, కాంబినేషన్‌ పేరుతో కూడా డాక్టర్లు మందులను రాస్తుంటారు. అలా రాస్తే దాన్నే కొనుగోలు చేయాల్సివుంటుంది. వేరే కంపెనీల్లో కూడా అటువంటి కాంబినేషన్‌ ఫార్ములా మందులు దొరకవు. ఇటువంటివి కూడా రాయకూడదని వైద్యులకు సూచించనున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కాంబినేషన్‌ డ్రగ్‌ను రాయాల్సివస్తే.. సర్కారీలో అందుబాటులో ఉండే వాటినే ప్రిఫర్‌ చేయా లి. ఇక బ్రాండ్‌ పేర్లతో, కాంబినేషన్‌ పేర్లతో మందులు రాస్తే ఉపేక్షించకూడదన్న భావనలో వైద్యశాఖ ఉంది. ఈ మేరకు ఈ నిర్ణయాన్ని పక్కాగా అమలు చేయాలని యోచిస్తోంది. ’


మందుల వివరాలు రోగులకూ తెలియాలి

ఇక సర్కారీ ఆస్పత్రుల్లో ఏయే ఔషధాలున్నాయో  వైద్యులే కాకుండా రోగులకూ తెలిసే విధంగా వైద్యశాఖ చర్యలు తీసుకోనుంది. అందుకోసం ఆస్పత్రిలోని ఫార్మసీ కౌంటర్ల వద్ద మందుల వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయనుంది. దీంతో వైద్యులు రాసిన మందులు ఫార్మసీలో లేవు అని చెప్పడం కుదరదు. ఈ చర్యల వల్ల పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

Updated Date - 2022-07-07T09:22:42+05:30 IST