కీళ్ల సమస్యలకు మందు ముళ్ళ గోరింటాకుల కూర

ABN , First Publish Date - 2022-06-25T09:44:49+05:30 IST

ముళ్ళగోరింట చాలామందికి పూలమొక్కగానే తెలుసు. కానీ ఆయుర్వేద శాస్త్రవేత్తలు దీనితో లైంగికశక్తిని పెంచే ఔషధం తయారుచేస్తారు.

కీళ్ల సమస్యలకు మందు ముళ్ళ గోరింటాకుల కూర

ముళ్ళగోరింట చాలామందికి పూలమొక్కగానే తెలుసు. కానీ ఆయుర్వేద శాస్త్రవేత్తలు దీనితో లైంగికశక్తిని పెంచే ఔషధం తయారుచేస్తారు. పాకశాస్త్ర నిపుణులు దీనితో కూర, పప్పు, పచ్చడి తయారు చేసి, ఇమ్యూనిటీ బూస్టర్‌‘గా, శక్తినిచ్చే ఆహార పదార్థాన్ని తయారు చేస్తారు.

ముళ్ళ గోరింటమొక్కలు పూలకుండీల్లో పెరిగేవే! సైరేయక, కురంటక అని దీన్ని పిలుస్తారు. పూల రంగుల్ని బట్టి వీటిలో చాలా జాతులున్నాయి. చర్మవ్యాధులు, మూత్రంలో మంట, జ్వరం, వాపులు, మెడదగ్గర వాపు వచ్చే గాయిటర్‌ వ్యాధి, పిప్పిపళ్లు వీటిమీద పనిచేసే ఔషధంగా దీన్ని ఆయుర్వేద శాస్త్రాలు పేర్కొన్నాయి. వైద్యపరంగా దీని పూలు, ఆకులు, కొమ్మలు, వేళ్లు అన్నింటికీ సమాన గుణాలే ఉన్నాయి. కాని, ఆకుల వాడకమే ఎక్కువ. ఆకుల్లో పొటాషియం బాగా ఉంటుందని శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. బర్లేరిన్‌ అనేరసాయనం కూడా ఉండటంతో ఇది అనేక వ్యాధుల్లో పనిచేసే ఔషధం అయ్యింది.


ప్రయోజనాలివి...

ఆకుల గుజ్జు తలకు పెట్టుకుంటే జుత్తు నల్లగా పెరుగుతుంది. వాపు వచ్చిన చోట ఆకుల గుజ్జుని కడితే వాపు నెమ్మదిస్తుంది. ఆకుల జ్యూస్‌ తీసి తాగితే మూత్రంలో మంట తగ్గుతుంది. గౌట్‌, కీళ్ల వాతవ్యాధుల్లో కూడా ఇది పనిచేస్తుంది. ఈ జ్యూసుని బాగా పుక్కిలిస్తూ ఉంటే పళ్లు పుచ్చిపోవటం వలనకలిగే ఇబ్బందులు తగ్గుతాయి. ఈ ఆకుల గుజ్జులో ఆవనూనె కలిపి పేనుకొరుకుడు వచ్చిన చోట పట్టిస్తే వెంట్రుకలు పెరుగుతాయి. గజ్జి, తామర లాంటి అంటు చర్మవ్యాధుల్లోకూడా దీన్ని రాస్తే బాగా పని చేస్తుంది. దీని కషాయంతో పుండ్లను కడిగితే పుండు త్వరగా మాడుతుంది. కోరింత దగ్గుని తగ్గించే శక్తి కూడా ఈ ఆకులకుంది. ఇటీవలి కాలంలో జరిగిన పరిశోధనల్లో ఈ ఆకులకు షుగరు వ్యాధిని తగ్గించే గుణం కూడా ఉందని కనుగొన్నారు. విష దోషాలను పోగొట్టే యాంటీ ఆక్సిడెంట్‌ యాక్టివిటీ కూడా దీనికుందని తేలింది. ఈ ఆకుల్ని కడుపులోకి స్వరసం(జ్యూస్‌) రూపంలో లేదా కషాయం రూపంలో తీసుకున్నదానికన్నా ఆహార పదార్థంగా తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఔషధం అంటే  వ్యాధి వచ్చిన వారికి మాత్రమే ఇస్తాం. ఆహార పదార్థం అయితే ఇంటిల్లిపాదీ తింటాం. జబ్బులు ఉన్నాయని కాదు, రాకుండా శరీరాన్ని శక్తిమంతం చేస్తుంది కాబట్టి. ఆయుర్వేద పద్ధతిలో ఇమ్యూనిటీ బూస్టర్‌ అంటే ఏ రోగాన్నీ రానీయని ఒక కాపలాదారు అని! 


తయారీఇలా...

నలమహారాజు ఈ ఆకులకూరని వండుకునే విధానాన్ని ఇలా వివరించాడు. ముళ్ళగోరింట ఆకులు కొద్దిగా చేదుగా, పుల్లపుల్లగా ఉంటాయి. నేరుగా తోటకూర, పాలకూరలా తినటానికి వీలుగా ఉండవు. చేదు, పులుపు పోయేలా ప్రత్యేక పద్ధతిలో వండవలసి ఉంటుంది. నలుడు ముళ్ళగోరింట ఆకుల్ని ములక్కాడల వేరుతో గానీ ఆకుల్తోగానీ కలిపి వండితే దీనిలోని పులుపు, చేదు తగ్గుతాయన్నాడు. లేత ఆకుల్ని తీసుకుని శుభ్రంగా కడిగి, ములక్కాడల చెట్టు వేరు లేదా, లేత ములగాకుల్ని తీసుకుని సన్నగా తరిగి మెత్తగా గుజ్జు అయ్యేలా ఉడికించమన్నాడు. ఉడికిన తరువాత మీకు కావలసిన సుగంథ ద్రవ్యాలను చేర్చి కమ్మగా వండుకోవచ్చు. రుచికి తగ్గ రీతిలో యుక్తిననుసరించి కావలసిన ద్రవ్యాలను కలుపుకునే విషయాన్ని మనకే వదిలేశాడు. ములగాకులు వాత వ్యాధుల్ని శక్తిమంతంగా ఎదుర్కొంటాయి. ముల్లగోరింటాకులకు చెప్పిన చాలాగుణాలు ములగాకులకూ ఉంటాయి. అందుకనే ముఖ్యంగా కీళ్లవాతం, షుగరు వ్యాధి త్వరగా తగ్గేందుకు ములగతో వండాలన్నాడు. షుగరు, కీళ్లవాతంమీద ఈ ఆకులకు ప్రయోగం ఉందని నలుడుకి తెలుసు. కాబట్టే ములగాకులతో కలిపి వండితే మరింత శక్తిమంతంగా పనిచేస్తుందని రాశాడు. మామూలు ఆకుకూరల కన్నా అనేక రెట్లు శక్తివంతమైనవి కాబట్టి తక్కువ మోతాదులో తినటం మంచిది.                    

గంగరాజు అరుణాదేవి


Updated Date - 2022-06-25T09:44:49+05:30 IST