వైద్యం...భారం!

ABN , First Publish Date - 2022-08-08T06:16:23+05:30 IST

నగర పరిధిలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రామలక్ష్మికి జ్వరం వచ్చింది.

వైద్యం...భారం!

తడిసి మోపెడవుతున్న వైనం 

భారీగా పెరుగుతున్న వైద్యం ఖర్చులు

సీజనల్‌ వ్యాధుల విజృంభణ ప్రభావం 

జ్వరం వస్తే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి  

కన్సల్టేషన్‌ ఫీజులు పెంచేస్తున్న ఆస్పత్రి నిర్వాహకులు

పరీక్షల పేరుతో  భారీగా వసూళ్లు 


(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి) 

నగర పరిధిలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రామలక్ష్మికి జ్వరం వచ్చింది. మూడు రోజులు పారాసెటమాల్‌ టాబ్లెట్లు వేసుకుంది. తగ్గకపోవడంతో దగ్గర్లోని కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ జనరల్‌ ఫిజీషియన్‌ కన్సల్టేషన్‌ ఫీజు రూ.500, టెస్టులకు రూ.3500 ఖర్చు అయింది. తీరా ఫలితాలు వచ్చిన తరువాత సాధారణ జ్వరమేనని తేల్చారు. మందులు కోసం మరో రూ.1200 ఖర్చు చేయాల్సి వచ్చింది’

’అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన లక్ష్మి-రాజేష్‌ ఏడాది వయసున్న కుమారుడికి మూడు రోజులుగా శరీరంపై ఎర్రని దద్దుర్లు రావడంతో దగ్గరలోని క్లినిక్‌ కు తీసుకెళ్లి వైద్యుడికి చూపించారు. నాలుగు రకాల సరిప్‌లు, ఒక సబ్బు రాసి ఫీజుతో కలిపి రూ.3800 వసూలు చేశారు’

ఇదీ ఏ ఒకరిద్దరికో, పట్టణానికో, నగరానికో కాదు వేలాదిమందికి ఎదురవుతున్న సమస్య. సీజనల్‌ వ్యాధులు ప్రారంభమైన తరువాత ఖర్చుల భారం పెరుగుతోంది. ఒకప్పుడు నాడి పట్టుకుని రోగాన్ని చెప్పే వైద్యుల నుంచి.. ప్రస్తుతం ఐదారు రకాల పరీక్షలు చేయిస్తేనే గానీ రోగ నిర్ధారణ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఒక వ్యక్తికి సాధారణ జ్వరం వచ్చినా కనీసంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు  ఖర్చు చేయాల్సి వస్తోంది.  ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే పట్టించుకునే వారు లేక తప్పనిసరి పరిస్థితుల్లో, ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.  


పెరిగిన కన్సల్టేషన్‌ ఫీజు.. 

నగర పరిధిలోని అనేక మంది వైద్యులు తమ కన్సల్టేషన్‌ ఫీజును క్రమంగా పెంచేస్తున్నారు. ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో  ఇటీవలి వరకు కార్డియాలజీ స్పెషలిస్టు వైద్యుడు కన్సల్టేషన్‌ ఫీజు రూ.500 ఉంటే, ప్రస్తుతం దానిని రూ.700కు పెంచారు. అదేవిధంగా మరో ప్రాంతంలోని జనరల్‌ ఫిజీషియన్‌ వైద్యుడి ఫీజు మొన్నటివరకు రూ.350 ఉంటే, దానిని ఇప్పుడు రూ.500కు పెంచారు. అనేక ఆస్పత్రుల్లో కన్సల్టేషన్‌ ఫీజులను పెంచడంతో రోగులపై ఆర్థిక భారం పడుతోంది. ఇవికాకుండా స్పెషలిస్టుల ఫీజులను ఆస్పత్రు లు, ఆయా క్లినిక్‌ల నిర్వాహకులు భారీగా పెంచేస్తు న్నారు.  


నాడి పట్టరు.. స్టెత్‌ పెట్టరు.. 

నగర పరిధిలోని అనేకమంది వైద్యులు రోగి నాడి పట్టకుండా.. స్టెత్‌ పెట్టకుండానే వైద్యం కానిచ్చేస్తున్నా రు. రోగులు చెప్పే లక్షణాలను బట్టి  పరీక్షలు  సూచిస్తున్నారు. ఫలితాలను చూసి మందులు రాస్తున్నారు. సుమారు 90 శాతం మంది వైద్యుల తీరు ఇలానే ఉంటోంది. అతికొద్ది మంది మాత్రమే రోగిని  పరీక్షించి వైద్య సేవలందిస్తున్నారు. పరీక్షలు చేయించుకుంటున్న రోగుల్లో 60-70 శాతం మందికి సాధారణ జ్వరమని తేలుతోంది. మామూలుగా అయితే దీనిని వైద్యులు గుర్తించేందుకు అవకాశముంది. కానీ ఆస్పత్రుల టార్గెట్ల ఫలితంగా టెస్టుల భారం రోగులు మోయాల్సిన పరిస్థితి నెలకొంది. 


ఓపీ పరిమితమే.. 

సాధారణంగా వైద్యులు కన్సల్టేషన్‌ తీసుకుంటే రోగం నయమయ్యేంత వరకు ఉచితంగానే చూడాలి. కానీ, అనేకమంది వైద్యులు ఒకసారి కన్సల్టేషన్‌ తీసుకుంటే ఒకటి, రెండుసార్లుకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. మళ్లీ, వస్తే మరోసారి ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల వల్ల రోగులు కనీసంగా పది నుంచి రెండు వారాలు ఇబ్బంది పడుతున్నారు. ఆయా ఆస్పత్రులు వీటిపై షరతులు విధించడంతో రెండుమూడు సార్లు కన్సల్టేషన్‌ ఫీజు  చెల్లించాల్సి వస్తోందని  వాపోతున్నారు. 


కమిషన్ల కక్కుర్తితో.. 

ప్రైవేట్‌/కార్పొరేట్‌ ఆస్పత్రుల దోపిడీకి గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీ/పీఎంపీ వైద్యులు కొమ్ము కాస్తున్నారు. ఆయా ఆస్పత్రులకు రోగులను పంపిస్తే మెరుగైన ప్యాకేజీలను అందిస్తున్నాయి. రోగులు ఓపీ, ఐపీ, పరీక్షు ఫీజుల్లో కనీసం పది నుంచి 30 శాతం  సదరు ఆర్‌ఎంపీ, పీఎంపీలకు చెల్లిస్తుండడంతో.. అవసరమున్నా, లేకపోయినా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో సంచి వైద్యులదే కీలకపాత్ర కావడంతో వారి మాట కాదనలేక.. చాలా మంది పెద్ద ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుని కుదేలవుతున్నారు. 

Updated Date - 2022-08-08T06:16:23+05:30 IST