ఎవరు.. ఏ‘మందు’రని!

ABN , First Publish Date - 2020-08-10T10:36:09+05:30 IST

కరోనా కష్టకాలంలో మందుల దుకాణదారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఎవరు.. ఏ‘మందు’రని!

మందుల దుకాణాల్లో కానరాని కొవిడ్‌ నిబంధనలు

కరోనా లక్షణాలతో వచ్చేవారి వివరాలను నమోదు చేయని వైనం


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలో మందుల దుకాణదారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఔషధ ధరలు తగ్గించడం మాటెలా ఉన్నా, కనీస కొవిడ్‌-19 నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. జిల్లాలో కరోనా సామాజిక విస్తరణ దశకు చేరుకున్న నేపథ్యంలో ‘వైరస్‌’ అనుమానితులను గుర్తించేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఔషధ నియంత్రణ శాఖ గుర్తింపు పొందిన మందుల దుకాణాల్లో మందులు కొనేవారి ఆధార్‌, ఫోన్‌ నంబర్లను ప్రత్యేక కొవిడ్‌-19 యాప్‌లో నమోదు చేయాలని సూచించింది. కానీ, అవేమీ దుకాణాల నిర్వాహకులకు పట్టడం లేదు. పాత పద్ధతిలోనే అడ్డగోలు ధరలకు మందులను విక్రయిస్తూ అందినంత జేబుల్లో వేసుకొంటున్నారు. వాస్తవానికి కరోనా లక్షణాలైన దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటివి ఉన్నవారు మందుల దుకాణాలకు వస్తే వెంటనే వారి సమాచారాన్ని సేకరించి సంబంధిత యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అవసరం మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం కూడా అందజేయాల్సిన బాధ్యత కూడా వారిదే.


కానీ జిల్లాలో ఈ నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు  వినిపిస్తున్నాయి. చిన్న జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో బాధపడేవారు మందులను కొనుగోలు చేసుకొని కొద్ది రోజులు వినియోగిస్తున్నారు. లక్షణాలు తగ్గిపోయాయని అనుకుంటున్న సమయంలో ఆ లక్షణాలు కుటుంబంలో మరికొందరిలో కనిపిస్తున్నాయి. అప్పుడు భయంతో కొవిడ్‌ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. అదే ముందుగానే ఇలాంటి వారి వివరాలను మందుల దుకాణదారులు  కొవిడ్‌ యాప్‌లో నమోదు చేస్తే చాలావరకు కరోనాను ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకొనే వీలుంటుంది. ఇదిలాఉండగా చాలా మందుల దుకాణాల్లో ప్రిస్కిప్షన్‌(మందుల చీటి) లేకుండానే ఔషధాలను విక్రయిస్తున్నారు. ఆర్‌ఎంపీ (సంచి వైద్యులు) రాసే స్లిప్పులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి మెడికల్‌ షాపులపై  దాడులు చేయాల్సిన ఔషధ నియంత్రణ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 


బోర్డులతో సరి

మెడికల్‌ షాపుల ముందు నో మాస్క్‌.. నో ఎంట్రీ బోర్డు ఒకటి వేలాడదీసి నిర్వాహకులు తమ పని తాము చేసుకుపోతున్నారు. మందుల దుకాణాల వద్ద విధిగా హ్యాండ్‌ శానిటైజేషన్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులు మార్గదర్శకాలు జారీచేసినా ఎక్కడా అమలు కావడం లేదు. పైగా రకరకాల బ్రాండ్‌ల శానిటైజర్లను అధిక ధరలకు విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. 


విటమిన్‌ మాత్రల కృత్రిమ కొరత 

కరోనా వేళ విటమిన్‌ మాత్రలకు గిరాకీ పెరిగింది. దీన్ని కొందరు మందుల దుకాణాల యజమానులు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సి-విటమిన్‌, బీకాంప్లెక్స్‌, జింకోవిట్‌, మల్టీ విటమిన్‌ మాత్రలు ప్రముఖ దుకాణాల్లో కూడా దొరకడం లేదు. ముందుగా అడ్వాన్స్‌ చెల్లిస్తే, స్టాకు రాగానే ఇచ్చేస్తామంటూ విటమిన్‌ బిళ్లలకు బాగా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఎంత ధర ఉంటే అంత, లేదంటే కాస్త అదనంగా ధర వసూలు చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో చాలా దుకాణాల్లో విటమిన్‌ మాత్రల కొరత ఉంది. 


నిబంధనలు పాటించకపోతే చర్యలు.... కిరణ్‌కుమార్‌, ఏడీ, ఔషధ నియంత్రణ శాఖ, శ్రీకాకుళం

కొవిడ్‌-19 నిబంధనలను మెడికల్‌ షాపు నిర్వాహకులు విధిగా పాటించాల్సిందే. లేదంటే చర్యలు తప్పవు. మందుల కొనుగోలుదారుల వివరాలను యాప్‌లో నమోదు చేయని దుకా ణాలపై చర్యలు తీసుకుంటాం. బిల్లు ఖచ్చితంగా ఇవ్వాలి. శానిటైజర్లు, మాస్క్‌లు ఎమ్మార్పీ ధరలకంటే ఎక్కువకు విక్రయిస్తే ఫిర్యాదు చేయవచ్చు. విటమిన్‌ మందు బిళ్లల కొరత గతంలో ఉండేది. ప్రస్తుతం జిల్లాలో అన్ని దుకాణాల్లో దొరుకుతున్నాయి.  డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు తరచూ తనిఖీలు జరుపుతున్నారు. ఇకముందు మరిన్ని తనిఖీలు చేపడతాం.

Updated Date - 2020-08-10T10:36:09+05:30 IST