నేటి నుంచే వైద్యసేవలు

ABN , First Publish Date - 2020-03-31T10:20:55+05:30 IST

జిల్లాలో గృహ నిర్బంధంలో ఉన్న వారికి ఇళ్ల వద్ద మంగళవారం నుంచి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని కరోనా ప్రత్యేకాధికారి ఎం.ఎం.నాయక్‌

నేటి నుంచే వైద్యసేవలు

కరోనా ప్రత్యేకాధికారి ఎంఎం నాయక్‌ 


 శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మార్చి 30: జిల్లాలో గృహ నిర్బంధంలో ఉన్న వారికి ఇళ్ల వద్ద మంగళవారం నుంచి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని కరోనా ప్రత్యేకాధికారి ఎం.ఎం.నాయక్‌ వెల్లడించారు. సోమవారం  కలెక్టరేట్‌లో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాలో 31 మండలాల్లో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వారి స్థితిగతులు, క్వారంటైన్‌లో ఉన్న వారి పరిస్థితిని పరిశీలించేందుకు ప్రభుత్వం 20 మంది ప్రత్యేకాధికారులను నియమించింది. గృహ నిర్బంధంలో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు చేపడతారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులో ఇప్పటికే 90 బెడ్లు వేర్వేరుగా సిద్ధం చేశాం.


ఇతర ప్రాంతాల్లోనూ క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. మానసికంగా బాధ పడే వారికి సైకియాట్రిస్ట్‌ సేవలను టెలీమెడిసన్‌ ద్వారా అందించనున్నాం. ప్రజలెవరైనా 8106052157,  8019714709, 7995882172 నెంబర్లకు ఫోన్‌చేసి సేవలు పొందవచ్చు’ అని సూచించారు. రెడ్‌క్రాస్‌ ద్వారా వృద్ధుల వైద్య సదుపాయానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా, నిత్యావసర వస్తువులు, మందులు డోర్‌ డెలివరీ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్‌ నివాస్‌ ఆయనకు వివరించారు.


రైతుబజార్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని, చేపల మార్కెట్‌లను కూడా ఇతర ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో జేసీ శ్రీనివా సులు, ఎస్పీ అమ్మిరెడ్డి, ఐటీడీఏ పీవో సాయికాంత్‌ వర్మ, జేసీ-2 గున్నయ్య, డీఆర్వో బి.దయానిధి, డీఎంహెచ్‌వో చెంచయ్య, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-31T10:20:55+05:30 IST