ఆసిఫాబాద్‌లో అందుబాటులోకి వైద్యసేవలు

ABN , First Publish Date - 2022-07-04T03:51:38+05:30 IST

ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో గిరిజనులకు వైద్యం ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఊరిస్తూ వచ్చింది. దాంతో ఏజెన్సీలో ప్రతిఏటా సకాలంలో వైద్యం అందక వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న పరిస్థితి. జిల్లాలో ప్రాథమిక, మధ్య తరహా వైద్యసేవలను అందుబాటులోకి తేవాలన్న డిమాండు ఇన్నాళ్లు కాగితాలకే పరిమితమైంది.

ఆసిఫాబాద్‌లో అందుబాటులోకి వైద్యసేవలు

-ఐదు ఆరోగ్య కేంద్రాలు సీహెచ్‌సీలుగా అప్‌గ్రేడేషన్‌

-త్వరలోనే భవనాల నిర్మాణం

-ప్రతి సీహెచ్‌సీలో 30 పడకలు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో గిరిజనులకు వైద్యం ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఊరిస్తూ వచ్చింది. దాంతో ఏజెన్సీలో ప్రతిఏటా సకాలంలో వైద్యం అందక వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న పరిస్థితి. జిల్లాలో ప్రాథమిక, మధ్య తరహా వైద్యసేవలను అందుబాటులోకి తేవాలన్న డిమాండు ఇన్నాళ్లు కాగితాలకే పరిమితమైంది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏజేన్సీ వాసుల కష్టాలను తీరేలా ఆస్పత్రిల బలోపేతానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే జిల్లాలోని ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లుగా(సామాజిక ఆస్పత్రిలుగా) అభివృద్ధి చేయాలని నిర్ణయించి ఈ మేరకు అప్‌గ్రేడేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల క్రితమే ఇందుకు సంబంధించిన ఆదేశాలు జిల్లా వైద్యఆరోగ్యశాఖకు అందగా, ఏజెన్సీ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను సీహెచ్‌సీలుగా మార్చి వైద్యవిధాన పరిషత్‌కు అప్పగించారు. ఇందులో సీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్‌ అయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలిస్తే బెజ్జూరు, కాగజ్‌నగర్‌, తిర్యాణి, వాంకిడి, జైనూరును ఆస్పత్రులు ఉన్నాయి. కాగా సిర్పూరు(టి)లో ఇప్పటికే సామాజిక ఆస్పత్రి ఉంది. కాగా జిల్లా కేంద్రంలోని సీహెచ్‌సీని రెండేళ్ల క్రితమే జిల్లా కేంద్ర ఆస్పత్రిగా మార్చారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ఆరు సామాజిక ఆస్పత్రులకు సిబ్బంది, నూతన భవనాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం సీహెచ్‌సీలుగా మార్చినప్పటికీ సిబ్బంది కొరత కారణంగా ఆరోగ్యకేంద్రం కేడర్‌తోనే 24గంటల వైద్యసేవలు అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీహెచ్‌సీలకు సంబంధించి పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని నిర్ణయాన్ని తీసుకున్న దరిమిలా త్వరలోనే సిబ్బంది నియామకానికి ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. 

ప్రతీ సీహెచ్‌సీకి 30 పడకలు..

సామాజిక ఆస్పత్రిలుగా అప్‌గ్రేడ్‌ చేసిన ఐదు పీహెచ్‌సీల్లో రోగులకు పడకల సంఖ్య కూడా పెరుగనుంది. పక్కా భవనాల నిర్మాణం పూర్తి అయితే ఒక్కొక్క సామాజిక ఆస్పత్రిలో 30 పడకలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు ప్రతి ఆస్పత్రిలో 18మంది స్టాఫ్‌ నర్సులు, ముగ్గురు డాక్టర్లు, ఐదుగురు ఏఎన్‌ఎంలు, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇద్దరు ఫార్మాసిస్టులు నియామకం కానున్నారు. ఈ లెక్కన ఐదు సామాజిక ఆస్పత్రిల్లో 15మంది వైద్యులు 90మంది స్టాఫ్‌ నర్సులు, 25మంది ఏఎన్‌ఎంలు, 10మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 10మంది ఫార్మాసిస్టుల పోస్టుల భర్తీ చేయనున్నారు. అలాగే జిల్లా కేంద్ర ఆస్పత్రిలోను 29మంది డాక్టర్లను నియమించనునారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒకటి రెండు నెలల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు ఏజీన్సీ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

రాష్ట్రంలోనే జిల్లా అగ్రగామి

మనోహర్‌, జిల్లా వైద్యాధికారి ఆసిఫాబాద్‌

 అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ వైద్యసేవల పరంగా ఆసిఫాబాద్‌ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆసిఫాబాద్‌ జిల్లా ఏజెన్సీలో మెరుగైన వైద్య సేవలు అందించటం కోసం ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేసింది. అంతేకాదు 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24గంటల వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తాం.

Updated Date - 2022-07-04T03:51:38+05:30 IST