Abn logo
Sep 27 2021 @ 01:39AM

మెడికల్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ కోర్సులు

కోర్సులు

బీఎస్సీ ఆప్టోమెట్రిక్‌ టెక్నాలజీ

బీఎస్సీ ఇమేజింగ్‌ టెక్నాలజీ

బీఎస్సీ అనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్‌ ఆపరేషన్‌ టెక్నాలజీ

బీఎస్సీ కార్డియాక్‌ కేర్‌ టెక్నాలజీ అండ్‌ కార్డియోవాస్క్యులర్‌ టెక్నాలజీ

బీఎస్సీ పెర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ 

బీఎస్సీ రెనాల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ

బీఎస్సీ న్యూరో ఫిజియోలజీ టెక్నాలజీ

బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ(ఎంఎల్‌టీ)

బీఎస్సీ నర్సింగ్‌

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ

బీఎస్సీ ఎమర్జన్సీ మెడిసిన్‌ టెక్నాలజీ

బీఎస్సీ రెసిపరేటరీ థెరపీ టెక్నాలజీ


వైద్యం అంటే ఒక్క వైద్యులతోనే అంతా పూర్తి కాదు.నర్సు నుంచి పలువురి సహకారంతో రోగులకు వైద్య సేవలు అందుతుంటాయి. మెడికల్‌ అడ్వాన్స్‌మెంట్‌తో వ్యాధి నిర్ధారణ శాస్త్ర, సాంకేతిక పుంతలు తొక్కింది. సదరు పని చేయాలంటే, తగు సాంకేతిక అర్హతలు ఉండాలి. నిజానికి అర్హతలు ఉన్న సిబ్బందికి ఇప్పటికీ కొరత ఉంది.  సరిగ్గా ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం డిగ్రీ స్థాయిలో కోర్సులను నిర్వహిస్తోంది.

వీటిని పూర్తి చేసిన వెంటనే విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉద్యోగాలు పొంది స్థిరపడవచ్చు. సాధారణంగాఈ కోర్సుల కాలవ్యవధి మూడేళ్ళు. బైపీసీతో ఇంటర్‌ ఉత్తీర్ణులు ఈ కోర్సులు చేయవచ్చు.ఇంటర్‌ బైపీసీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ ప్రాతిపదికన ఈ కోర్సుల్లోకి ఇంతకాలం ప్రవేశాలు కల్పించేవారు. అయితే ఈ ఏడాది నుంచి  వీటిలో ప్రవేశానికి ఎంసెట్‌లో ఉత్తీర్ణతను అర్హతగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 


ప్రస్తుతం ఈ కోర్సులకు ఎంతో డిమాండ్‌ ఉంది. వైద్యులకు సహాయకులుగా పనిచేసే అవకాశం ఉండటంతో వీరికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అదీగాక వీరి తోడ్పాటు లేకుండా సదరు విభాగాల పర్యవేక్షణ అసాధ్యం. ఈ కోర్సులు చేసిన వారు వెంటనే మల్టీ స్పెషాలిటీ, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉద్యోగాల వివరాలు ఒకసారి తెలుసుకుందాం...


బీఎస్సీ ఆప్టోమెట్రిక్‌ టెక్నాలజీ

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. అటువంటి నేత్రాలకు అనుకోనిది ఏమైనా జరిగితే జీవితం అంధకారమవుతుంది. మానవ శరీరంలో అంతటి ప్రాధాన్యం కలిగిన కళ్లకు చికిత్స అందించేందుకు దోహదపడేదే బీఎస్సీ ఆప్టోమెట్రిక్‌ టెక్నాలజీ. దీన్ని పూర్తిచేసిన వారు ఆసుపత్రుల్లో ఆప్టోమెట్రి్‌స్టగా ఉద్యోగావకాశం పొందవచ్చు. అనుభవం సంపాదించుకున్న తరవాత ఆప్టోమెట్రి టెక్నీషియన్స్‌గా స్థిరపడవచ్చు.

బీఎస్సీ ఇమేజింగ్‌ టెక్నాలజీ

మానవ శరీరంలో రోగ నిర్థారణలో ఈ కోర్సు పూర్తి చేసిన వారు ప్రముఖపాత్ర వహిస్తారు. ఈ కోర్సు చదివినవారు ఎక్స్‌రే టెక్నీషియన్స్‌గా, ఎంఆర్‌ఐ, సిటీ స్కానర్స్‌గా ఆసుపత్రుల్లో ఉద్యోగాలు సంపాదించవచ్చు. సొంతగా ల్యాబ్‌ నడుపుకోవచ్చు. డయాగ్నస్టిక్‌ సెంటర్లలో స్థిరపడవచ్చు. ఈ కోర్సును ఏపీలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. 


బీఎస్సీ అనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్‌ ఆపరేషన్‌ టెక్నాలజీ

రోగికి శస్త్రచికిత్స సమయంలో మత్తుమందు ఎంతో అవసరం. ఇందుకు ప్రత్యేకమైన నిపుణులు కావాలి. రోగికి ఎంత మోతాదులో మత్తుమందు ఇవ్వాలనేది వీరు నిర్ణయిస్తారు. ఓ సర్వే ప్రకారం మన దేశంలో లక్షమందికి ఒక  మత్తుమందు వైద్యుడు ఉన్నారు. ఈ  నేపథ్యంలో ఈ నిపుణులకు అద్భుత అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. 


ఆపరేషన్‌ టెక్నాలజీ శస్త్రచికిత్స సమయంలో ఎంతో ప్రాధాన్యం కలిగింది. శస్త్ర చికిత్సకు అవసరమయ్యే సరంజామాను వీరే నిర్ణయించాల్సి ఉంటుంది. రోగిని ఆపరేషన్‌ థియేటర్లోకి తీసుకురావడం నుంచి తిరిగి తీసుకెళ్లేవరకు వీరి పాత్ర కీలకం. ఈ కోర్సు చేసిన వారు ఆసుపత్రుల్లో ఓటీ టెక్నీషియన్స్‌గా, వైద్యులకు సహాయకులుగా ఉద్యోగావకాశాలు పొందవచ్చు. అనుభవం సంపాదించుకున్న తరవాత అనస్థీషియా టెక్నీషియన్‌గా సొంతంగా స్థిరపడవచ్చు. 


బీఎస్సీ కార్డియాక్‌ కేర్‌ టెక్నాలజీ అండ్‌ కార్డియో వాస్క్యులర్‌ టెక్నాలజీ

మానవ శరీరంలో గుండె ప్రధానమైనది. గుండె సంబంధిత, రక్తనాళాల పనితీరు వాటిపై ఈ కోర్సులో బోధిస్తారు. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, పేస్‌ మేకర్‌, స్టంట్స్‌ అమరిక వంటి వాటిల్లో ఈ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఆసుపత్రుల్లో ఓటీ అసిస్టెంట్స్‌గా ఉద్యోగం సంపాదించవచ్చు. తగిన అనుభవంతో కార్డియాలజీ టెక్నీషియన్స్‌గా, క్యాత్‌లాబ్‌ విభాగంలో ఉద్యోగులుగా స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 


బీఎస్సీ పెర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ

గుండెకు సంబంధించిన వ్యాధులు అరికట్టడం, చికిత్స విధానం వంటివి ఈ కోర్సులో భాగం. గుండె, ఊపిరితిత్తుల పనితీరు పర్యవేక్షణ, చికిత్సలో ఈ నిపుణుల పాత్ర ముఖ్యం. ఈ కోర్సు చదివిన వారు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్స్‌లో సర్జన్స్‌ అసిస్టెంట్స్‌, ఓటీ టెక్నీషియన్స్‌గా స్థిరపడవచ్చు. 


బీఎస్సీ రెనాల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ

రక్తాన్ని శుద్ధిచేయడం కిడ్నీల విధి. వీటి పనితీరులో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ వ్యక్తికి డయాలసిస్‌ చేయాల్సి ఉంటుంది. మన దేశంలో చాలామంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. వీరందరికీ డయాలసిస్‌ అవసరం పడుతోంది. ఈ చికిత్సను నిపుణులైన వారి పర్యవేక్షణలోనే చేయాలి. దీంతో ఈ నిపుణులకు ఎంతో డిమాండ్‌ ఉంది. ఈ కోర్సు చేసిన వారు డయాలసిస్‌ సెంటర్లు, ఆసుపత్రుల్లో డయాగ్నసిస్టులుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. సొంతంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. 

బీఎస్సీ న్యూరో ఫిజియోలాజీటెక్నాలజీ

నరాలకు సంబంధించిన వ్యాధుల చికిత్స, రోగి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విజ్ఞానంతోపాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ కూడా ఈ కోర్సులో భాగం. నరాలు, కండరాల పనితీరును కూడా బోధిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఆసుపత్రుల్లో న్యూరో సర్జన్స్‌, న్యూరో ఫిజీషియన్స్‌, న్యూరాలజిస్టులకు అసిస్టెంట్స్‌గా సేవలు అందించవచ్చు. సొంతగా క్లినిక్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. 


బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ (ఎంఎల్‌టీ)

ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే అందుకు గల కారణాలను తెలిపేవారే మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో వీరు కీలకపాత్ర వహిస్తారు. ఈ కోర్సులో వ్యాధుల నిర్థారణ, సమాచార సేకరణ, శాంపిల్స్‌ సేకరణ తదితర అంశాలు నేర్చుకుంటారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారు మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌గా స్థిరపడవచ్చు. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు అపారం. 

బీఎస్సీ నర్సింగ్‌

రోగికి సేవ విషయంలో నర్సింగ్‌ ప్రధానమైనది. అందుకే వైద్యరంగంలో ఈ వృత్తిని అత్యుత్తమమైనదిగా పేర్కొంటారు. రోగికి వైద్య చికిత్సతో పాటు మానసిక చికిత్స అవసరమే. దీనిని అందించేవారే నర్సులు. నర్సింగ్‌ నైపుణ్యాలను ఈ కోర్సులో భాగంగా నేర్పిస్తారు. థియరీతోపాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ కూడా నేర్పుతారు. రోగికి చేయాల్సిన ప్రథమచికిత్స నుంచి వైద్యానికి సంబంధించిన అన్ని విషయాలను నేర్పుతారు. ఈ కోర్సును ఏపీలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. 

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపి

ఏదైనా ప్రమాదాలు లేదా వృద్థాప్యంతో శరీర భాగాల్లో ఏవైనా కదలికలు ఏర్పడితే వాటిని ఫిజియోథెరపి ద్వారా వారికి చికిత్స అందించవచ్చు. ఎముకలు విరిగినా, పక్కకు జరిగినా, దెబ్బలు తగిలినా ఈ చికిత్స ద్వారా సరిచేయవచ్చు. మానవ శరీరంలో వివిధ భాగాలు, వాటి అమరిక తదితర విషయాల గూర్చి ఈ కోర్సులో బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన ఫిజియోథెరపిస్టులకు ఎంతో డిమాండ్‌ ఉంది. మంచి జీతభత్యాలు అందుతాయి. సొంతగా ఆసుపత్రిని నిర్వహించుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి మాత్రం నాలుగున్నరేళ్లు


బీఎస్సీ రెసిపరేటరీ థెరపీ టెక్నాలజీ

ఊపిరితిత్తులు, ఛాతి భాగంలో ఏర్పడే ఆస్తమా, న్యూమోనియా, సీఓపీడీ, ఎంఫసిమా, ఎంఫిమా, న్యూమోథెరాక్స్‌, పల్మనరీ ఎంబోలజం, కేన్సర్‌ వంటి రోగాల పాలైన వారికి చికిత్స చేస్తారు. వైద్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రోగికి సూచిస్తారు. ఈ రోగులను వీరే పర్యవేక్షిస్తారు. 


పై కోర్సులతోపాటు ఇంటర్‌ ఏ గ్రూపు పాసైన వారికైనా మూడేళ్ల వ్యవధి గల జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం) కోర్సును పారా మెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలో వివిధ విద్యాసంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సులు చదివిన వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా అన్నాయి.


బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్‌ టెక్నాలజీ

ఏదైనా ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ చికిత్స అందిస్తారు. మందులు తదితరాలు, వైద్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రోగికి సూచిస్తారు. ప్రస్తుతం వీరికి ఎంతో డిమాండ్‌ ఉంది. మంచి జీతభత్యాలు లభిస్తాయి.