ప్రమాణాలు లేని వైద్య కాలేజీలపై కేంద్రం కొరడా

ABN , First Publish Date - 2022-04-04T10:07:28+05:30 IST

ప్రమాణాలు లేని వైద్య కాలేజీలపై కేంద్రం కొరడా

ప్రమాణాలు లేని వైద్య కాలేజీలపై కేంద్రం కొరడా

  • హైదరాబాద్‌ సహా ఐదు నగరాల్లో ఆకస్మిక తనిఖీలు
  • ప్రమాణాలు లేని ఓ కాలేజీ మూసివేత
  • మిగిలిన కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): జాతీయ వైద్యమండలి నిర్దేశించిన ప్రమాణాలు పాటించని వైద్యవిద్య కళాశాలలపై  కేంద్రం కొరడా ఝళిపిస్తోంది. కనీస ప్రమాణాలు పాటించని ఓ ప్రైవేటు వైద్యవిద్య కళాశాలలను మూసివేయించింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యలోని వైద్యుల బృందాన్ని ఆకస్మిక తనిఖీలకు పంపింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఓ ఐదు నగరాల్లోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఆ బృందం తనిఖీలు చేసింది. హైదరాబాద్‌, చెన్నై, ఉదయ్‌పూర్‌, జబల్‌పూర్‌, థూళే నగరాల్లో ఈ ఆకస్మిక తనిఖీలు చేసింది. మొత్తం 12 కాలేజీలకు బృందాలు వెళ్లాయి. అవి ఎన్‌ఎమ్‌సీ నిర్దేశించిన కనీసప్రమాణాలు పాటించడం లేదని తేలింది.


 వాటిలో ఒక కాలేజీని మూసివేశారు. మిగిలిన కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆ కాలేజీలపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది జాతీయ వైద్యమండలి నిర్ణయించనుంది. ఈ ఆకస్మిక తనిఖీలను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మనుసుఖ్‌ మాండవీయ స్వయంగా పర్యవేక్షించారు. ఆయనే స్వయంగా ఆ తనిఖీల బృందాలను ఏర్పాటు చేశారు. నిబంధన ప్రకారం లేని వైద్య విద్య కళాశాలలను ఏ మాత్రం ఉపేక్షించవద్దని ఆ బృందాలకు సూచించారు. కాగా కొవిడ్‌ సమయంలో కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతులు, గుర్తింపులను వీడియో కాన్ఫెరెన్స్‌ల ద్వారానే మంజూరు చేశారు. ఇలా అనుమతులు పొందిన కాలేజీలలో నాణ్యత కొరవడిందంటూ ఫిర్యాదులు అందాయి. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు నుంచి ఆరుగురు వైద్యులున్నారు. ఒక మెడికల్‌ కాలేజీ నడవాలంటే అందుకు తగ్గట్లు రోగులుండాలి. కానీ ఆ స్థాయిలో రోగులు లేకుండానే కాలేజీలు నడుస్తున్నట్లు గుర్తించారు. 

Updated Date - 2022-04-04T10:07:28+05:30 IST