ఆగస్టు నాటికి మెడికల్‌ కళాశాల టెండర్లు

ABN , First Publish Date - 2020-05-22T11:23:00+05:30 IST

పులివెందుల వద్ద నిర్మించనున్న మెడికల్‌ కళాశాలకు సంబంధించి ఆగస్టు నాటికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌

ఆగస్టు నాటికి మెడికల్‌ కళాశాల టెండర్లు

పాడా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించండి

రివ్యూ సమావేశంలో సీఎం జగన్‌ 

హాజరైన ఎంపీ, కలెక్టర్‌, ఓఎస్డీ


పులివెందుల, మే 21: పులివెందుల వద్ద నిర్మించనున్న మెడికల్‌ కళాశాలకు సంబంధించి ఆగస్టు నాటికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం పాడా అభివృద్ధిపై గుంటూరు జిల్లాలోని తాడేపల్లి కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులతో సీఎం జగన్‌ రివ్యూ సమావేశం నిర్వహించారు. పాడా అభివృద్ధితో పాటు జిల్లాలో పలు కార్యక్రమాలపై జగన్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


ఆగస్టుకల్లా టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి ఈ యేడాదిలోగా మెడికల్‌ కళాశాల పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పులివెందులలో అరటి స్టోరేజ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అనంతపురం, కడప వంటి అరటి సాగు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు సిద్ధం చేయాలన్నారు. ఏపీకార్ల్‌కు అనుబంధంగా అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ కళాశాలలతో పాటు వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, అరటి రీసెర్చ్‌ సెంటర్‌లో ట్రైనింగ్‌ వెంటనే ప్రారంభించాలని సూచించారు.


వీటితో పాటు పలు నీటి పథకాలకు సంబంధించిన పరిపాలనపరమైన అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని ఆర్థికశాఖ అదికారులను ఆదేశించారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోని పెండింగ్‌ పనులు, ఏరియా ఆసుపత్రి నిర్మాణం, వేంపల్లె సీహెచ్‌సీ నిర్మాణంపై అధికారులతో చర్చించారు. కడప నగరంలో దేవుని కడప చెరువు సుందరీకరణ, మరియు రాజీవ్‌మార్గ్‌ అభివృద్ధి పనులకు రాష్ట్ర బడ్జెట్‌ కింద నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.

Updated Date - 2020-05-22T11:23:00+05:30 IST