కరోనా సోకిన గర్భిణులకూ వైద్య సేవలందించాల్సిందే

ABN , First Publish Date - 2022-01-27T08:48:00+05:30 IST

గర్భిణులకు కరోనా సోకినప్పటికీ వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించాల్సిందేనని వైద్యశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా సోకిన గర్భిణులకూ వైద్య సేవలందించాల్సిందే

  • ఆస్పత్రులు తిరస్కరిస్తే చర్యలు తప్పవు 
  • జిల్లాల అధికారులకు సర్కారు ఆదేశాలు


హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): గర్భిణులకు కరోనా సోకినప్పటికీ వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించాల్సిందేనని వైద్యశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా పాజిటివ్‌ ఉన్న గర్భిణులను చేర్చుకోకుండా తిరస్కరించేవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పింది. అలాగే, ఆస్పత్రుల్లో గర్భిణులను చేర్చుకుని, మళ్లీ ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేసిన సందర్భాల్లో ఇరు ఆస్పత్రుల వైద్యులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించింది. కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్న గర్భిణులను ఆస్పత్రుల్లో చేర్చుకోవడం, వారికి వైద్యం అందించే విషయాల్లో ఆలస్యం జరిగితే సదరు ఆస్పత్రుల వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇటీవల కొవిడ్‌ పాజిటివ్‌తో అచ్చం పేట కమ్యూనిటీ హెల్త్‌ కేర్‌ సెంటర్‌కు వచ్చిన మహిళకు ప్రసవం చేయడానికి నిరాకరించిన డ్యూటీ డాక్టర్‌ తో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. డాక్టర్‌ కృష్ణ, డాక్టర్‌ హరిబాబును సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కి ఆయన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి హరీశ్‌ రావు ఆదేశాల మేరకు హుటాహుటిన ఈ చర్యలు తీసుకున్నారు.


రాష్ట్రంలో కొత్తగా 3,801 కేసులు

రాష్ట్రంలో కొవిడ్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 88,867 మందికి టెస్టులు చేశారు. అందులో 3,801 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 7.47 లక్షలకు చేరింది. వైర్‌సతో మరొకరు చనిపోయారు. మరో 2,046 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 38,023 యాక్టివ్‌ కొవిడ్‌ కేసులున్నాయి. హైదరాబాద్‌లో కొత్తగా 1,570, ఖమ్మంలో 139 మేడ్చల్‌లో 254, రంగారెడ్డిలో 284, హన్మకొండలో 147 పాజిటివ్‌లు వచ్చాయి. బుధవారం 1.89 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. 31 వేల మందికి తొలి, 1.53 లక్షల మందికి రెండో డోసు, 4,432 మందికి ప్రికాషనరీ డోసు ఇచ్చారు. ఇక 15-17 ఏళ్ల వయసువారిలో ఇప్పటివరకు 11.44 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

Updated Date - 2022-01-27T08:48:00+05:30 IST