ట్రంప్ భారత్ టూర్‌పై పాక్ మీడియా షాకింగ్ హెడ్డింగ్..!

ABN , First Publish Date - 2020-02-25T21:06:40+05:30 IST

పాక్ మీడియా మరోసారి తన వైఖరిని బయటపెట్టుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటనపై...

ట్రంప్ భారత్ టూర్‌పై పాక్ మీడియా షాకింగ్ హెడ్డింగ్..!

పాక్ మీడియా మరోసారి తన వైఖరిని బయటపెట్టుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటనపై సరికొత్తగా వార్తలను వండివార్చింది. ట్రంప్ భారత పర్యటనను అంతర్జాతీయ మీడియా మొత్తం ప్రముఖంగా ప్రస్తావిస్తే పాకిస్తాన్‌లోని మెజార్టీ మీడియా మాత్రం భారత పర్యటనలో పాకిస్తాన్‌ను పొగుడుతూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ‘‘పాక్‌ సరిహద్దుల్లో తిష్టవేసిన ఉగ్రవాద తండాలపై చర్యలు తీసుకునే విషయమై మేం పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తున్నాం’’ అని చెప్పి ట్రంప్ ఊరుకున్నారు. అయితే.. పాక్ మీడియా మాత్రం ట్రంప్ తమ దేశాన్ని భారత్‌లో పొగిడారంటూ పొంతన లేని వార్తలను ప్రచురించాయి.


పాకిస్తాన్‌తో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని ట్రంప్ భారత్‌కు వెల్లడించారంటూ ‘ది న్యూస్ ఇంటర్నేషనల్’ హెడ్డింగ్ పెట్టడం కొసమెరుపు. అయితే.. పాక్‌ను ఎక్కడా ట్రంప్ నేరుగా పల్లెత్తు మాట అనలేదనేది వాస్తవం. మోదీ ప్రభుత్వ విజయాలను ప్రస్తావించడం ద్వారా ట్రంప్‌ కొంతవరకూ భారత అధినేతను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక మోదీ కూడా... అమెరికన్ల ఆరోగ్యానికి, సంతోషానికి ట్రంప్‌ సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పొగిడారు. తద్వారా.. ఈ ఏడాది నవంబరులో జరిగే అమెరికా  అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని మోదీ పాజిటివ్‌గా ఆవిష్కరించారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-02-25T21:06:40+05:30 IST