కనిపించని అదుపులో మీడియా

ABN , First Publish Date - 2021-10-07T06:30:25+05:30 IST

లఖింపూర్ ఖేరీ ఘటన భారతీయ ప్రధానస్రవంతి మీడియా విశ్వసనీయతకు మరో తీరని విఘాతం. రైతుల ఉద్యమం మీడియా విశ్వసనీయతను బలహీనపరిచిందనడంలో సందేహం లేదు. ఖేరి ఘటనే అందుకొక సహేతుకమైన నిదర్శనం....

కనిపించని అదుపులో మీడియా

లఖింపూర్ ఖేరీ ఘటన భారతీయ ప్రధానస్రవంతి మీడియా విశ్వసనీయతకు మరో తీరని విఘాతం. రైతుల ఉద్యమం మీడియా విశ్వసనీయతను బలహీనపరిచిందనడంలో సందేహం లేదు. ఖేరి ఘటనే అందుకొక సహేతుకమైన నిదర్శనం. ఆ భయంకర ఘటనపై ప్రతిస్పందించడంలో ప్రధాన స్రవంతి మీడియా చాలా సమయాన్ని వృథా చేసింది. ఆ సంఘటన, స్థానిక మీడియా ప్రతినిధుల సాక్షిగా సాయంత్రం మూడు గంటలకు జరిగింది. కొద్ది నిమిషాలలోనే వార్తలు రావడం ప్రారంభమయింది. ఘటన జరిగిన అరగంటకే, అంటే 3.30 గంటలకే సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎమ్) మీడియాను అప్రమత్తం చేసింది. దానికి కారకుడు ఎవరో కూడా గుర్తించింది. అయినప్పటికీ ఎఎన్‌ఐ వార్త సాయంత్రం 5 గంటలకు గానీ రాలేదు! అప్పటికే అధికారపక్షం వారు తమ సొంత కథనాలను ప్రచారంలోకి తెచ్చారు. పైగా ఈ నేర ఘటనపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ముంబైలో ఒక విహారనౌకలో ప్రముఖ నటుడి కుమారుడు మాదకద్రవ్యాలతో పట్టుబడిన ఉదంతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మరుసటి రోజు అన్ని పత్రికలు రైతులనే తప్పుపట్టాయి. టీవీ ఛానెల్స్ కూడా ఇదే పాట పాడాయి. అయితే ఈ కథనాలతో విభేదించిన వారూ ఉన్నారు. ఇంటర్నెట్ పోర్టల్స్, సామాజిక మాధ్యమాలలో ఈ భిన్నాభిప్రాయాలు బాగా వ్యక్తమయ్యాయి. ప్రధానస్రవంతిలోని కొన్ని పత్రికలు, ఛానెల్స్ ఖేరీ ఘటనపై వార్తలను నిష్పాక్షికంగా నివేదించక పోలేదు. అయినప్పటికీ ప్రధానస్రవంతి మీడియా విశ్వసనీయతకు తీవ్ర దెబ్బ తగిలింది. కోల్పోయిన ప్రతిష్ఠను పునరుద్ధరించుకునేందుకు చాలా కాలం పడుతుంది. 


భారత్ ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్నాం. మీడియా చాలావరకు ప్రైవేట్ ‌సంస్థల ఆధ్వర్యంలో స్వతంత్రంగా ఉందని, సెన్సార్‌షిప్ లేదని కూడా చెప్పుకుంటున్నాం. మరి లఖింపూర్ ఖేరీ ఘటన విషయంలో మీడియా అలా ఎందుకు వ్యవహరించింది? నేనేమీ మీడియా సైద్ధాంతికవేత్తను కాను. మీడియా ‘సమ్మతికి రూపకల్పన చేస్తుంది’ అన్న సిద్ధాంతంలో సత్యం ఉందని నేను భావిస్తున్నాను. అయితే అలాంటి సాధారణ సిద్ధాంతాలు వర్తమాన భారతదేశంలో మీడియా వాస్తవంగా ఎలా నియంత్రించబడుతుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేవు అన్నదే నా నిశ్చిత అభిప్రాయం. అధికారిక సెన్సార్‌షిప్ లేకుండానే ప్రభుత్వం, అధికారపక్షం, వాటి మద్దతువర్గాలు నాలుగు విధాలుగా మీడియా కథనాలను నియంత్రిస్తున్నాయి లేదా ప్రభావితం చేస్తున్నాయి. అవి: డీలర్ షిప్, పార్టిసన్‌షిప్, రిలేషన్‌షిప్, ‘Sensor-ship’. ఈ కొత్త సమాచార నియంత్రణ అసాంప్రదాయకమైనది (ఫోన్ ‌కాల్స్, సమావేశాలు, అలిఖిత ఆదేశాలు). కనుక అది అగోచరం. అది అనేక దిశల (ప్రభుత్వం, అధికార పక్షం, వాటి కార్పొరేట్ మిత్రులు) నుంచి వస్తుంది. తత్కారణంగా అది సర్వత్రా వ్యాప్తిలో ఉంటుంది. మీడియాపై వివిధ స్థాయిల (యజమాని, ఎడిటర్, విలేఖరి, స్ట్రింగర్)లో దాడిచేస్తుంది. కనుక ఈ కొత్త నియంత్రణ మరింత ప్రభావశీలమైనది. సెన్సార్‌షిప్ కంటే ఘోరమైనది. 


మీడియా సంస్థల వ్యాపార వ్యవహారాలను కట్టడి చేయడమే డీలర్‌షిప్ నియంత్రణ విధానం. వాణిజ్య ప్రకటనలు, మీడియాయేతర వ్యాపారాల్లో యజమానుల ప్రయోజనాలను కాపాడడం మొదలైన వాటితో మీడియాను నియంత్రించడం జరుగుతోంది. వీటికి లొంగిరాని పక్షంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను దాడులు, ప్రసారాలకు పలువిధాల ఆటంకం కలిగించడం మొదలైనవి జరుగుతాయి. అంతిమంగా నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేయడమూ జరగవచ్చు. దైనిక్ భాస్కర్, ది క్వింట్, న్యూస్ క్లిక్‌కు జరిగినవే ఇందుకు తార్కాణాలు. అనుకూలురకు బహుమానాలు, వ్యతిరేకులను నానావిధాలుగా వేధింపులకు గురిచేసే పద్ధతి నరేంద్ర మోదీ ప్రభుత్వంతోనే ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనూ అనేక ఉదాహరణలు కన్పిస్తాయి. ఇది, కేవలం కాంగ్రెస్, బీజేపీలకు మాత్రమే పరిమితం కాలేదు బిహార్‌లో జనతాదళ్ (యునైటెడ్) ప్రభుత్వం, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా అందుకు భిన్నంగా వ్యవహరించడం లేదని తెలుస్తోంది. 


పార్టిసన్ షిప్ (పక్షపాతం) సైద్ధాంతికమైనది. దీని గురించి కొత్తగా చెప్పవలసిందేమీ లేదు. వామపక్ష-–లౌకిక–-ఉదారవాద విధానాల వైపు మొగ్గే పాత్రికేయులు ఉన్నారు. అలాగే మిత వాద విధానాలను అభిమానించే జర్నలిస్టులూ ఉన్నారు. మీడియా సంస్థల్లో బీజేపీ సానుభూతిపరుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. తమకు అనుకూలంగా ఉన్న పాత్రికేయుల ఉన్నతికి ప్రభుత్వం, అధికారపక్షం వారు ఒక పద్ధతి ప్రపకారం పని చేయడం కద్దు, చేస్తున్నాయి కూడా. ఈ కారణంగా పలువురు పాత్రికేయులు ఊసరవెల్లులు అవుతున్నారు. తమ సైద్ధాంతిక విధేయతలను మార్చుకుంటున్నారు. ఫలితంగా మీడియా కాషాయీకరణ అంతకంతకూ పెరిగిపోతోంది. అంతేకాకుండా పాత్రికేయ విలువలూ పతనమవుతున్నాయి. 


మీడియా మద్దతును గెలుచుకునేందుకు అనుసరించే పద్ధతులే రిలేషన్‌షిప్ నియంత్రణకు వస్తాయి. ఇవి మీడియా చరిత్రలో మొదటి నుంచీ ఉన్నాయి. ఈ విధానంలో ప్రతి మీడియా సంస్థ ఎడిటర్, రిపోర్టర్లు, కాలమిస్ట్స్ , చివరకు స్ట్రింగర్లు కూడా ప్రభుత్వ నిశిత పరిశీలనలో ఉంటారు. ఈ అనధికారిక పరిశీలనకు అనుగుణంగానే ప్రైవేట్ మీడియా సంస్థల్లో నియామకాలు, పదోన్నతులు లేదా తొలగించడం మొదలైనవి జరుగుతుంటాయి. ఎవరైనా ధైర్యంగా నిజాలను వెల్లడిస్తే వారిపై సామాజిక మాధ్యమాలలో పోకిరీ దాడులు జరుగుతాయి. ఈ ధోరణులు మీడియా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 


అన్నిటికంటే ప్రచ్ఛన్నమైనది Sensor-ship (సంవేదకం) ఇది సెన్సార్ షిప్ (పూర్వ పరిశీలనతో ప్రచురణకు అనుమతించడం)కు వ్యతిరిక్తమైనది. మీడియా పరిశ్రమలో సంచితమైన భయ విహ్వల వాతావరణం పాత్రికేయులలో ఒక అంతర్గత సంవేదకాన్ని నెలకొల్పుతోంది. ఆ సంవేదకం ఆలోచనలను నియంత్రించే చిప్. పాత్రికేయులు తమ విధి నిర్వహణలో అగోచర హద్దును దాటినప్పుడల్లా అది వారిని అప్రమత్తం చేస్తుంది. ఇలా రాస్తే నేను చిక్కుల్లో పడతానా? అనవసర తలనొప్పిని ఎదుర్కోవలసి వస్తుందా? రాసిన విధంగా కాకుండా మరో విధంగా రాయడం శ్రేయస్కరమా? పక్షపాత వైఖరితో రాస్తూనే పక్షపాతరహితంగా ఉన్నట్టు కన్పించడం ఎలా? ఇటువంటి ఆత్మసంశయాలు మన అత్యుత్తమ పాత్రికేయులు, రచయితలను కూడా పాలకులకు లొంగిపోయేలా చేస్తున్నాయి.


సాధారణ రైతులకు గానీ, రైతు ఉద్యమ క్రియాశీలురకు గానీ ఈ వాస్తవాలేవీ తెలియవు. మీడియా అంతిమంగా ఏం చెబుతుందన్నదే వారికి ముఖ్యం. మరి తమ ఉద్యమానికి సంబంధించి గానీ, ఇంకా ఇతర వ్యవహారాలకు సంబంధించి గానీ మీడియా వ్యవహరిస్తున్న తీరును వారు మెచ్చలేకున్నారు. చాలా పత్రికలు, ఛానెల్స్ ప్రభుత్వ వైఖరినే సమర్థిస్తున్నాయన్నదే గ్రామీణ భారతంలోని రైతుల, ఇతర సామాజికవర్గాల అభిప్రాయంగా ఉంది. రైతుల ఉద్యమం విషయంలో పట్టణ మధ్యతరగతి ప్రజలు ఇటువంటి అభిప్రాయానికి వచ్చి ఉంటారని చెప్పలేము. అయితే కొవిడ్ రెండో దఫా విజృంభణ సందర్భంలో వారు అటువంటి అభిప్రాయానికే వచ్చారు. ప్రతి రంగానికీ ఇటువంటి అభిప్రాయం పరివ్యాప్తమవుతోంది. మొత్తం మీడియాలో త్వరలోనే ఇది ఒక సంక్షోభంగా పరిణమించవచ్చు. జనమాధ్యమాలు, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదు. అవి రెండూ వేరవడం, రెండిటి మధ్య పొంతన లేకపోవడం ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదు.


యోగేంద్ర యాదవ్జై

కిసాన్ ఆందోళన్ సహ సంస్థాపకుడు

Updated Date - 2021-10-07T06:30:25+05:30 IST