పౌరులకే కాదు.. మీడియాకూ భావ ప్రకటన స్వేచ్ఛ!

ABN , First Publish Date - 2021-05-07T07:02:44+05:30 IST

‘‘రాజ్యాంగంలోని 19వ అధికరణం కల్పించిన వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ పౌరులకే కాదు... మీడియాకూ వర్తిస్తుంది’’ అని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది...

పౌరులకే కాదు.. మీడియాకూ భావ ప్రకటన స్వేచ్ఛ!

  • విచారణ ప్రక్రియను ప్రచురించకుండా ఆపలేం
  • ‘ఆంక్షలు’ విధించడం తిరోగమన చర్య : సుప్రీం
  • ఎన్నికల కమిషన్‌ పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, మే 6: ‘‘రాజ్యాంగంలోని 19వ అధికరణం కల్పించిన వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ పౌరులకే కాదు... మీడియాకూ వర్తిస్తుంది’’ అని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియను (జ్యుడీషియల్‌ ప్రొసీడింగ్స్‌) ప్రచురించకుండా మీడియాను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై భారత ఎన్నికల కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడం, మరణాలు సంభవించడంపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ‘‘మీ నిర్లక్ష్యం వల్లే కేసులు పెరిగాయి. మరణాలు చోటు చేసుకున్నాయి. విచ్చలవిడిగా ఎన్నికల ప్రచార సభలకు, ర్యాలీలకు అనుమతించారు. మీది బాధ్యతారహిత సంస్థ. మీపై మర్డర్‌ కేసు పెట్టాలి’’ అంటూ మద్రాసు హైకోర్టు ఈసీపై మండిపడింది. ఈ వ్యాఖ్యలను తొలగించాలని, అలాగే... విచారణ ప్రక్రియ మీడియాలో రాకుండా నియంత్రించాలని ఎన్నికల కమిషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. హైకోర్టు వ్యాఖ్యలు కఠినంగా ఉన్నాయని, ఇలాంటి సమయంలో వాటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశముందని కూడా సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అదే సమయంలో... కరోనా కట్టడిపై హైకో ర్టు సమర్థ పర్యవేక్షణను ప్రశంసించింది. అయితే... విచారణ సమయంలో జడ్జిలు చేసిన వ్యాఖ్యలను తొలగించలేమని పేర్కొంది. ఆ వ్యాఖ్యలు తీర్పులో భాగం కాదని తెలిపింది. ‘‘విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేయకుండా న్యాయస్థానాలను నియంత్రించలేం. ఆ వ్యాఖ్యలను ప్రచురించకుండా మీడియానూ ఆపలేం. ఇలాంటి ఆక్షలు విధించడం తిరోగమన చర్యే అవుతుంది’’ అని ధర్మాసనం వివరించింది. కోర్టులో ఏం జరుగుతోందో తెలుసుకునే హక్కు పౌరులకు ఉందని తెలిపింది. ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ మీడియాకూ వర్తిస్తుందని తెలిపింది. అందులో భాగంగానే.. కోర్టులో జరిగే విచారణ ప్రక్రియను ప్రచురించవచ్చునని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా జడ్జిలు చేసే మౌఖిక వ్యాఖ్యలకు తగిన ఆధారాలు ఉండటం లేదని భారత ఎన్నికల కమిషన్‌ చేసిన వాదనను తోసిపుచ్చింది.


Updated Date - 2021-05-07T07:02:44+05:30 IST