మీరు చూపించిన‌ట్లు వాళ్లేమీ శాంతియుతంగా లేరు: ట్రంప్‌

ABN , First Publish Date - 2020-06-03T16:15:12+05:30 IST

జార్జి ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయుడి మ‌ర‌ణంతో అగ్ర‌రాజ్యం అమెరికా న‌ల్ల‌జాతి ఆందోళ‌న‌ల‌తో అత‌లాకుత‌లమ‌వుతోంది.

మీరు చూపించిన‌ట్లు వాళ్లేమీ శాంతియుతంగా లేరు: ట్రంప్‌

వాషింగ్ట‌న్ డీసీ: జార్జి ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయుడి మ‌ర‌ణంతో అగ్ర‌రాజ్యం అమెరికా న‌ల్ల‌జాతి ఆందోళ‌న‌ల‌తో అత‌లాకుత‌లమ‌వుతోంది. నల్లజాతీయుడైన ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీసు హత్య చేయడంతో వారం రోజులుగా అమెరికాలో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. 'ఐ కాంట్ బ్రీత్' పేరిట న‌ల్ల‌జాతీయులు యూఎస్‌లో తీవ్ర స్థాయిలో నిర‌స‌నలు చేస్తున్నారు. అల్లర్లు, లూటీలు, విధ్వంసాలు, దాడులతో సుమారు 20 రాష్ట్రాల్లో న‌ల్ల‌జాతీయులు క‌ల్లోలం సృష్టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర‌స‌న‌కారుల‌పై టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించ‌డాన్ని త‌ప్పు బ‌డుతూ మీడియా క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డంపై ట్రంప్ మండిప‌డ్డారు. 





శాంతియుతంగా నిర‌స‌న‌లు తెలుపుతున్న ఆందోళ‌న‌కారుల‌పై టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారని మీడియా చూపించ‌డంపై ట్రంప్‌.. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఆందోళ‌నకారులు శాంతియుతంగా లేర‌ని చెప్పిన ట్రంప్‌... అలా ఉంటే చ‌ర్చిని ఎందుకు త‌గుల‌బెట్టే వాళ్ల‌ని ప్ర‌శ్నించారు. మీడియా వాళ్లు చూపిస్తున్న‌ట్లు తాము శాంతియుతంగా నిర‌స‌న ‌తెలుపుతున్న వారిపై బాష్ప‌వాయువును ప్ర‌యోగించ‌లేద‌ని... మీరు త‌ప్పుగా చూపించారంటూ మండిప‌డ్డారు. ఇక ఈ అల్లర్లపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అస‌హ‌నం వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. హింసాత్మక నిరసనలను ఆందోళ‌న‌కారులు ఆప‌క‌పోతే సైన్యాన్ని దింపాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు కూడా.          

Updated Date - 2020-06-03T16:15:12+05:30 IST