Rajya Sabha polls: మీడియా దిగ్గజం సుభాశ్ చంద్ర నామినేషన్... బీజేపీ మద్దతు...

ABN , First Publish Date - 2022-05-31T22:47:57+05:30 IST

మీడియా దిగ్గజం సుభాశ్ చంద్ర రాజ్యసభ సభ్యత్వం కోసం రాజస్థాన్ (Rajastan

Rajya Sabha polls: మీడియా దిగ్గజం సుభాశ్ చంద్ర నామినేషన్... బీజేపీ మద్దతు...

జైపూర్ : మీడియా దిగ్గజం సుభాశ్ చంద్ర రాజ్యసభ సభ్యత్వం కోసం రాజస్థాన్ (Rajastan) నుంచి  స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు బీజేపీ మద్దతిస్తోంది. రాజస్థాన్‌లో నాలుగు స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులను, బీజేపీ ఒక అభ్యర్థిని నిలిపాయి. సుభాశ్ కూడా గెలుస్తారని బీజేపీ చెబుతోంది. 


ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ, రణదీప్ సుర్జీవాలాలను కాంగ్రెస్ (Congress) ఈ ఎన్నికల్లో నిలిపింది. బీజేపీ (BJP) తరపున ఘనశ్యామ్ తివారీ పోటీ చేస్తారు. సుభాశ్ చంద్ర (Subhash Chandra) స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి రామ్‌లాల్ శర్మ రాజస్థాన్ శాసన సభ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ, ఘనశ్యామ్ తివారీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని, సుభాశ్ చంద్ర స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారని చెప్పారు. సుభాశ్ చంద్రకు బీజేపీ మద్దతిస్తోందన్నారు. బీజేపీ గుర్తుపై ఘనశ్యామ్ గెలుస్తారని, స్వతంత్ర అభ్యర్థిగా సుభాశ్ గెలుస్తారని అన్నారు. 


బీజేపీ రాజస్థాన్ శాఖ అధ్యక్షుడు సతీశ్ పూనియా మాట్లాడుతూ, బీజేపీ మద్దతిచ్చిన సుభాశ్ చంద్రకు ఓటు వేయాలని స్వతంత్ర, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కోరినట్లు తెలిపారు. ఈ పోటీ రసవత్తరంగా సాగుతుందని, తివారీ, చంద్ర గెలుస్తారని అన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు సాగుతోందని, దీనివల్ల పరిపాలన ప్రభావితమవుతోందని ఆరోపించారు. రైతులు, యువత, ప్రజల పట్ల శ్రద్ధగలవారికి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడానికి ఇది మంచి అవకాశమన్నారు. 


సుభాశ్ చంద్ర మాట్లాడుతూ, తనకు మద్దతిచ్చినందుకు బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. తాను విజయం సాధించేందుకు అవసరమైనదానికన్నా ఎక్కువ ఓట్లు తనకు లభిస్తాయని చెప్పారు. ఆయన ప్రస్తుతం హర్యానా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ఆగస్టు 1తో ముగుస్తుంది. 


రాజస్థాన్ శాసన సభలో 200 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు 108 మంది, బీజేపీకి 71 మంది, స్వతంత్రులు 13 మంది, ఆర్ఎల్‌పీకి ముగ్గురు, సీపీఎంకు ఇద్దరు, బీటీపీకి ఇద్దరు, ఆర్ఎల్‌డీకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. 


Updated Date - 2022-05-31T22:47:57+05:30 IST