భూముల కబ్జా... బొమ్మరాస్‌పేట రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2022-06-27T17:01:48+05:30 IST

జిల్లాలోని శామీర్‌పేట్ బొమ్మరాస్‌పేట రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు.

భూముల కబ్జా... బొమ్మరాస్‌పేట రైతుల ఆందోళన

మేడ్చల్: జిల్లాలోని శామీర్‌పేట్ బొమ్మరాస్‌పేట రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. తమ భూములను రాజకీయ నేతలు, కబ్జాదారులు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. కబ్జాదారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేస్తున్నారు. మేడ్చల్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. సర్వే నెంబర్ 52లో 1050 ఎకరాలు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, ఫేక్ డాక్యుమెంట్లతో భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే...

బొమ్మరాస్‌పేటల్‌లో గత నలబై ఏళ్లుగా రైతులు భూములు సాగు చేస్తున్నారు. పట్టా పాస్ బుక్కులు కలిగి ఉండటంతో పాటు రైతుబంధు కూడా పొందుతున్నారు. మా భూముల్లోకి కబ్జా దారులు చొర బడ్డారని, ధరణి  తమకు శాపంగా మారిందని రైతులు అంటున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో కోర్టుల్లో కేసులు వేసి రైతులను కబ్జా దారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు నకిలీ డాక్యుమెంట్లతో రైతుల భూములను కబ్జా దారులకు కట్టబెట్టారు. భూములపై కోర్టులో కేసులు ఉండటంతో సర్వే నెంబర్లను అధికారులు బ్లాక్ చేస్తున్నారు.  దీంతో రైతున్నలు భూములు అమ్ముకునే వెసులుబాటును కోల్పోతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం దక్కకపోవడంతో కలెక్టరేట్ ముందు రైతులు ధర్నాకు దిగారు. ధరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ భూ కబ్జా 1500 కోట్ల కుంభకోణంగా  చెబుతున్నారు. కబ్జా దారుల వెనక ఓ మంత్రి హస్తం ఉందని బొమ్మరాస్ పేట్ రైతులు ఆరోపించారు. 

Updated Date - 2022-06-27T17:01:48+05:30 IST