జోరుగా సాగుతున్న మేడారం మినీజాతర

ABN , First Publish Date - 2021-02-27T05:33:02+05:30 IST

జోరుగా సాగుతున్న మేడారం మినీజాతర

జోరుగా సాగుతున్న మేడారం మినీజాతర
జంప‌న్న‌వాగు వ‌ద్ద భ‌క్తుల స్నానాలు

మేడారం, ఫిబ్రవరి 26: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మినీజాతర సందర్భంగా శుక్రవారం సందడిగా మారింది. అధిక సంఖ్యలో భక్తులు  దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ ఆచారాలు, సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం వనదేవతల గద్దెలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఒడ్డున ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు.  అక్కడి నుంచి క్యూలైన్ల ద్వారా వనదేవతల గద్దెలకు చేరుకుని పసుపు, కుంకుమ, నిలువెత్తు బెల్లం(బంగారం), చీర, సారె, పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించుకున్నారు. తమను చల్లంగా చూడాలని, కోరిన కోర్కెలు తీర్చాలని వనదేవతలను వేడుకున్నారు. 

ఈసందర్భంగా బలి మొక్కులు సమర్పించుకుని మేడారం పరిసరాల్లోని వసతిషెడ్లలో, అటవీ ప్రాంతంలో వంటావార్పులు చేసుకుని కుటుంబసమేతంగా విందుభోజనాలు ఆరగించారు. అనంతరం మేడారం పరిసరాల్లోని చిన్నచిన్న దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేస్తూ సందడి చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తంచేశారు. సరిపడా సౌకర్యాలు ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వనదేవతలను మొక్కుకున్నారు. వనదేవతలను సుమారు 90మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవాదాయ శాఖ ఈవో రాజేంద్ర తెలిపారు. 

గద్దెల వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండగా గద్దెల పరిసరాల్లోని మంచెపై నుంచి మైకు ద్వారా భక్తులకు సూచనలు చేస్తూ కరోనా నిబంధనలు పాటించాలని, తప్పిపోయిన భక్తుల సమాచారం, దొంగతనాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరించడం, మంచినీటి వసతులు ఉన్న ప్రదేశాలు తెలుపడం వంటి సౌకర్యాలను దేవాదాయశాఖ అధికారులు కల్పించారు. 

అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబ సభ్యులు వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి దేవాదాయ శాఖ అధికారులు ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట ఈవో రాజేంద్ర, సిబ్బంది క్రాంతికుమార్‌, మధు, రఘుపతిరావు, రాజేశ్వర్‌రావు, తదితరులు ఉన్నారు. కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో వైద్య ఆరోగ్య  శాఖ ఆధ్వర్యంలో భక్తులకు పరీక్షలు చేశారు.  సుమారు 10 వేలమందికి వైద్య సేవలందించినట్లు సిబ్బంది తెలిపారు.


Updated Date - 2021-02-27T05:33:02+05:30 IST