వనదేవతల గద్దెల పరిసరాల్లో కిక్కిరిసిన భక్తజనం
మేడారానికి పోటెత్తిన భక్తులు
ఆదివారం అధికంగా తరలివచ్చిన జనం
రద్దీగా మారిన గద్దెలు, రహదారులు
జంపన్నవాగులో జన హోరు
వాహనాల రాకతో ట్రాఫిక్ జామ్
మేడారం, జనవరి 23 : అదే భక్తి భావం.. అదే ఆధ్యాత్మికత.. అమ్మలపై అదే నమ్మకంతో వన దేవతల సన్నిధికి జనం పోటెత్తారు. మేడారం కల్పవల్లులను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి ఆదివారం భక్తజనం తండోపతండాలుగా తరలిచ్చారు. ప్రకృతిదేవతలను మనసారా దర్శించి మొక్కులు సమర్పించుకున్నారు. నిలువెత్తు బంగారం.. కోళ్లు.. మేకలను బలిచ్చి పరవశించిపోయారు. సల్లంగజూడు తల్లులూ.. అంటూ తనివితీరా మొక్కుకున్నారు.
జంపన్నవాగులో పుణ్యస్నానం
అడవిబిడ్డలను దర్శించుకునే ముందు జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానమాచరించారు. ఒడిబియ్యం కట్టుకుని నిలువెల్లా నీల్లారబోశారు. చీడపీడలు ఉంటే తొలగించు జంపన్నా.. పాపాలు పోగొట్టు జంపన్నా.. అంటూ పూనకాలు ఊగారు. చిన్నా పెద్దా తేడా లేకుండా వాగు జలధారల్లో ఆనందంగా స్నానమాచరించారు.. అనంతరం గద్దెల వైపు సాగారు.
తలనీలాల సమర్పణ
తమ కోరికలు తీరాలని భక్తుల మొక్కుల సమర్పణలో భాగంగా జంపన్నవాగు ఒడ్డున ఉన్న కల్యాణకట్టల వద్ద తలనీలాలు సమర్పించారు. తెల్లవారుజామున 5గంటల నుంచే కల్యాణకట్టల వద్ద భక్తులు బారులుతీరారు. నాయీబ్రాహ్మణుల చేత తలనీలాలను తీయించుకుని తల్లులకు సమర్పించుకున్నారు. తండోపతండాలు తరలివచ్చిన జనాన్ని చూసి వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు చేస్తున్నారు.
ప్రముఖుల దర్శనాలు
మేడారం వనదేవతలను దర్శించుకొవడానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ కమిషనర్ బాలకృష్ణ, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, తీన్మార్ మల్లన్నలు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పూజారులు, అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహంచి మొక్కులు చెల్లించుకున్నారు.