మారని తీరు...

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

మారని తీరు...

మారని తీరు...
అసంపూర్తిగా ఉన్న పస్రా-నార్లాపూర్‌ రోడ్డు, మేడారంలో బెస్‌మెంట్‌ లెవల్లోనే ఉన్న మరుగుదొడ్లు, ఇంకా నిర్మాణం కొనసాగుతున్న వాటర్‌ ట్యాంకు

మహాజాతరకు ఇంకా మిగిలింది 17 రోజులే..

కాంట్రాక్టర్లు, అధికారుల్లో నిర్లక్ష్యం

పునాదుల దశలోనే మరుగుదొడ్లు

అసంపూర్తిగా బీవోటీల ఏర్పాటు, వాటర్‌ ట్యాంకుల నిర్మాణం

పూర్తికాని రోడ్డు విస్తరణ పనులు

నేడు సమీక్షించనున్న ముగ్గురు మంత్రులు


మేడారం మహాజాతరకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే రోజుకు 50 వేలనుంచి 4లక్షలకు పైగా భక్తులు జాతరకు వస్తున్నారు. ప్రభుత్వం రూ.75కోట్ల నిధులను జాతర అభివృద్ధి పనులకు కేటాయించింది. అయితే ప్రతీ జాతర తరహాలోనే ఈసారి కూడా పనులను సాగదీస్తున్నారు. డిసెంబరు 31కే పూర్తి చేస్తామని మంత్రి సత్యవతిరాథోడ్‌ గతంలో చెప్పారు. ఆ తర్వాత జనవరి 10వ వరకు పూర్తి చేస్తామని కలెక్టర్‌ కృష్ణఆదిత్య పేర్కొన్నారు. అనంతరం ఈనెల 20నాటికి చివరి గడువుగా పేర్కొన్నారు. ఆ గడువు కూడా ముగిసిపోయింది. పనులు మాత్రం అసంపూర్తిగానే ఉన్నాయి. శనివారం మేడారానికి వచ్చే మంత్రుల బృందం పనులపై సమీక్షించే పూర్తయ్యేలా వేగం పెంచాలని భక్తులు కోరుతున్నారు. 


భూపాలపల్లి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): మేడారం మహా జాతరకు మరో 17 రోజుల సమయమే మిగిలి ఉంది. ఇంకా అభివృద్ధి పనులు పూర్తికాకుండా నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరుగుదొడ్ల పనులు బెస్‌మెంట్‌ లెవల్‌ల్లోనే ఉంది. బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌ పైప్‌లైన్లకు ఇంకా కనెక్షన్లు ఇవ్వనేలేదు. జాతర రోజు వరకు పనులను సాగదీసి, హడావుడిగా ప్రజలకు అంకితం చేయడం కాంట్రాక్టర్లు, కొందరు అధికారులకు పరిపాటిగా మారింది. శనివారం మంత్రుల బృందం మేడారంలో పర్యటించనుంది. అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. ఇప్పటికైనా పనులను వేగంగా పూర్తిచేయిస్తారని భక్తులు ఎదురుచూస్తున్నారు.


పునాదుల్లోనే మరుగుదొడ్లు

మేడారం జాతరలో అత్యంత కీ లకమైనవి మరుగుదొడ్లు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు రూ.13.50కోట్లు కేటాయించారు. ఏ క్లస్లర్‌ పరిధిలో కూడా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో బెస్‌మెంట్‌ లెవల్‌లోనే ఉన్నాయి. నిర్మాణంలో కూడా నాణ్యతను పాటించడం లేదు. ఇసుకతోనే నింపి పైన సిమెంట్‌ పూత పెడుతున్నారు. వీటిపై జీఏ షీట్స్‌ను ఐఎ్‌సఐ బ్రాండ్‌ ఉన్నవి వినియోగించాలి. తక్కువ నాణ్యతగల జీఏ షీట్స్‌తో నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 


అసంపూర్తిగా బీవోటీలు

భక్తులకు తాగునీటి కోసం సుమారు రూ.4 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. గతంలో బీవోటీలకు ఇచ్చిన పైపులైన్‌ ఉన్నప్పటికీ కొత్తగా పైపులైన్ల నిర్మాణం కోసం టెండర్లు చేపట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏటా పైపులైన్ల పేరుతో లక్షలాది రూపాయలను స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకు ఏ ప్రాంతంలో కూడా బీవోటీల పనులు పూర్తి కాలేదు. అలాగే హరిత హోటల్‌, ఆర్టీసీ బస్టాండ్‌, ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల వద్ద మిషన్‌ భగీరథ నిధులతో మూడు వాటర్‌ ట్యాంకులు నిర్మిస్తున్నారు. 


రోడ్డు పనులెప్పుడు చేస్తారో..?

మహాజాతరకు కీలకమైన పస్రా-నార్లాపూర్‌ రోడ్డు విస్తరణకు ఆర్‌అండ్‌బీ నుంచి రూ.10.30కోట్లు కేటాయించారు. మొత్తం 16కిలో మీటర్ల రోడ్డు విస్తరణ పనులకు ఈ నిధుల సరిపోవని కాంట్రాక్టర్లు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో రూ.13కోట్లు కేటాయించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే వెంగళపూర్‌-టప్పామంచా మధ్య ఇంకా రెండు కిలో మీటర్ల వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు గాలికి వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ రోడ్డు పనులు పూర్తి కాకపోవటంతో వరంగల్‌ నుంచి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేడారం నుంచి తిరుగు ప్రయాణం నార్లాపూర్‌ నుంచి భూపాలపల్లి మీదుగా పరకాల, గూడెప్పాడ్‌కు చేరుకుంటారు. అయితే నార్లాపూర్‌ నుంచి భూపాలపల్లికి వచ్చే ప్రధాన రహదారిపై అనేక చోట్ల గుంతలు పడ్డాయి. వీటికి అతుకులతోనే సరిపెడుతున్నారు. నూతనంగా తారురోడ్డు వేయాలనే ప్రతిపాదనను అధికారులు పట్టించుకోకపోవడం లేదు. అలాగే కన్నెపల్లి నుంచి మహాముత్తారం మీదుగా కాటారం వరకు అక్కడక్కడ రోడ్డు ధ్వంసమైంది. నాలుగేళ్ల కిందట వేసిన రోడ్డుకు మళ్లీ మోక్షం లేదు. 


తగ్గుదలలో మర్మమేమిటీ?

గత జాతరలతో పోలిస్తే ఈ జాతరకు అన్ని పనుల అంచనాను తగ్గించారు. వీటికి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. 2020 మహాజాతరలో 8,150 మరుగుదొడ్లు నిర్మిస్తే, ఈసారి మాత్రం కేవలం 6,145 మరుగుదొడ్లే నిర్మిస్తున్నారు. అంటే రెండువేల మరుగుదొడ్లను తగ్గించారు. వీటికి కేటాయించిన నిధులను ఎటువైపు మళ్లించారనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ప్రతీ జాతరకు మరుగుదొడ్ల నిర్మాణాలు ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ చేపట్టేది. కానీ, ఈసారి జిల్లా పంచాయతీ అధికారికి అప్పగించటంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే గత జాతరలో 530 బీవోటీలు ఏర్పాటు చేస్తే ఈసారి కేవలం 490 బీవోటీలు మాత్రమే ఏర్పాటు చేశారు. మరో 40 బీవోటీలను తగ్గించారు. దీంతో భక్తులు ఈసారి కూడా తాగునీటికి తిప్పలు తప్పేలా లేదు. మరుగుదొడ్లు, బీవోటీల సంఖ్య తగ్గటంతో వీటికోసం చాలామంది ఒకేచోట గూమిగూడే అవకాశం ఉంది.  కరోనా నేపథఽ్యంలో వీటి సంఖ్య పెంచాల్సింది పోయి.. తగ్గించటం వల్ల కరోనాను అఽధికారులు తేలికగా తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 



నేడు మంత్రుల బృందం పర్యటన

పాల్గొననున్న సీఎస్‌, డీజీపీ 

భూపాలపల్లి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహాజాతరకు కేటాయించిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, నూతన జాతర పునరుద్ధరణ కమిటీ ప్రమాణస్వీకారత్సోవంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహిళ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్‌కు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు మేడారంలో గద్దెల వద్ద తల్లులను దర్శనం చేసుకుని, అనంతరం ఉదయం 11గంటలకు కొత్తగా ప్రభుత్వం 14 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన మహాజాతర పునరుద్ధరణ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొననున్నారు. తర్వాత హరిత హోటల్‌ వద్ద జరిగే జాతర అభివృద్ధి పనుల సమీక్షలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.




నేడు పునరుద్ధరణ కమిటీ ప్రమాణ స్వీకారం 

ములుగు, జనవరి 28 : ఫిబ్రవరి 16వ తేదీ నుంచి జరిగే మేడారం మహాజాతరకు రాష్ట్ర దేవాదాయశాఖ నియమించిన పునరుద్ధరణ కమిటీ శనివారం ప్రమాణ స్వీకారం చేయనుంది. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి మేడారం పరిశీలనకు వస్తున్నక్రమంలో వారి సమక్షంలో సభ్యుల ప్రమా ణ స్వీకారం జరగనుంది. చైర్మన్‌గా కొర్నిబెల్లి శివయ్య నియామకంకాగా, డైరెక్టర్లుగా సప్పిడి వెంకట్‌రామ్‌నర్సయ్య, చిలుకమర్రి రాజేందర్‌, లకావత్‌ చందూలాల్‌, వట్టం నాగరాజు, బండి వీరస్వామి, సానికొమ్ము ఆదిరెడ్డి, నక్క సాంబయ్య, జేటీవీ.సత్యనారాయణ, తండ రమేష్‌, పొదెం శోభన్‌, వద్దిరాజు రవిచంద్ర, అంకం కృష్ణస్వామి, సిద్దబోయిన జగ్గారావులు బాధ్యతలు స్వీకరిస్తారు. ఇందుకోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మేడారంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST