యార్డుల్లో యాతన!

ABN , First Publish Date - 2020-02-21T08:21:18+05:30 IST

రైతులు మార్కెట్‌ యార్డుల్లోపంటను పెట్టుకుని నానా యాతన పడుతున్నారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మెదక్‌, నర్సాపూర్‌లలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటాల్‌ కందులకు రూ.5,800 మద్దతు ధర

యార్డుల్లో యాతన!

వారం రోజులుగా నిలిచిన కంది కొనుగోళ్లు.. 

పడిగాపులు కాస్తున్న రైతులు


‘కేంద్రం అనుమతించిన మేర 47 వేల టన్నుల కందులను ఇప్పటికే కొనుగోలు చేసినం. అదనంగా వచ్చిన కందులను కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నం.’  - ఇది బుధవారం మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి చేసిన ప్రకటన ఇది. 

మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం ధన్నారం గ్రామానికి  చెందిన రైతు మొగులయ్య 8 బస్తాల కందులను వారం క్రితం మెదక్‌లోని కొనుగోలు కేంద్రానికి తెచ్చాడు. నేటికి ఎదురుచూపులు తప్పడం లేదు. 

- ఇది కంది రైతువాస్తవ గాథ

(మెదక్‌, ఆంధ్రజ్యోతి): రైతులు మార్కెట్‌ యార్డుల్లోపంటను పెట్టుకుని నానా యాతన పడుతున్నారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మెదక్‌, నర్సాపూర్‌లలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటాల్‌ కందులకు రూ.5,800 మద్దతు ధర చెల్లిస్తున్నారు. అయితే, 2,860 క్వింటాళ్ల మేర రైతుల నుంచి కందులు కొని జిల్లాకు కేటాయించిన కోటా ముగిసిందంటూ అధికారులు వారం రోజుల క్రితమే కొనుగోళ్లు నిలిపివేశారు. దాంతో చేసేదేమీలేక కొంత మంది రైతులు తెచ్చిన పంటను వెనక్కి తీసుకెళ్లి తక్కువ ధరకే దళారులకు అమ్ముకున్నారు. 50 మందికి పైగా రైతులు వారం రోజులుగా మెదక్‌ కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నారు. చివరికి కొంటారన్న నమ్మకం లేక గురువారం కొందరు  రైతులు కందుల బస్తాలను ట్రాక్టర్‌లో వేసుకుని కలెక్టరేట్‌కు వెళ్లారు.  కలెక్టర్‌ ధర్మారెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వెళ్లగా.. సార్‌ మీటింగ్‌లో ఉన్నారు..అదనపు కలెక్టర్‌ను కలవాలంటూ వెనక్కి పంపించారు. పక్కనే ఉన్న అదనపు కలెక్టర్‌ నగే్‌షను కలిసేందుకు వెళ్లగా  లోపలికి అనుమతించలేదు. అరగంట సేపు వేచి ఉండగా... మార్క్‌ఫెడ్‌ సిబ్బందితో అదనపు కలెక్టర్‌ సీసీ మాట్లాడారు. అనంతరం గంటలో కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు మళ్లీ మార్కెట్‌ యార్డులోని కేంద్రానికి వచ్చారు. సాయంత్రం వరకు వేచి చూసినా అధికారులు వచ్చి చూడటమే తప్ప.. కొనుగోలు చేసింది లేదు. అంతేగాక రైతులు ఇంకా పంటను కేంద్రానికి తీసుకురాకుండా సెక్యూరిటీ సిబ్బంది గే ట్‌ వద్దే అడ్డుకుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పంటను కొనుగోలు చేయాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు. 

Updated Date - 2020-02-21T08:21:18+05:30 IST