భూగర్భ జలమట్టాల్లో సేఫ్‌ జోన్‌లో మెదక్‌

ABN , First Publish Date - 2022-06-30T05:23:23+05:30 IST

అడవుల పెంపకం, పల్లె, బృహత్‌ పల్లె ప్రకృతి వనాల పెంపకాలతో మెదక్‌ జిల్లా లో భూగర్భ జలమట్టాలు పెరిగి సేఫ్‌ జోన్‌లో ఉన్నదని కేంద్ర ప్రభుత్వ జల వనరుల మంత్రిత్వ శాఖ సెంట్రల్‌ నోడల్‌ అధికారి డైరెక్టర్‌ డోనర్‌ హవోకిప్‌ అన్నారు.

భూగర్భ జలమట్టాల్లో సేఫ్‌ జోన్‌లో మెదక్‌
సమావేశంలో మాట్లాడుతున్నసెంట్రల్‌ నోడల్‌ అధికారి డైరెక్టర్‌ డోనర్‌ హవోకిప్‌, అధికారులు

జలశక్తి అభియాన్‌ కింద జల సంరక్షణ కార్యక్రమాలు 

సమీక్షలో సెంట్రల్‌ నోడల్‌ అధికారి డైరెక్టర్‌ డోనర్‌ హవోకిప్‌

మెదక్‌ అర్బన్‌, జూన్‌ 29: అడవుల పెంపకం, పల్లె, బృహత్‌ పల్లె ప్రకృతి వనాల పెంపకాలతో మెదక్‌ జిల్లా లో భూగర్భ జలమట్టాలు పెరిగి సేఫ్‌ జోన్‌లో ఉన్నదని కేంద్ర ప్రభుత్వ జల వనరుల మంత్రిత్వ శాఖ సెంట్రల్‌ నోడల్‌ అధికారి డైరెక్టర్‌ డోనర్‌ హవోకిప్‌ అన్నారు. జలశక్తి అభియాన్‌ కింద జిల్లాలో జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. టెక్నికల్‌ ఆఫీసర్‌, శాస్త్రవేత్త యు.బి. పాటిల్‌తో ఆయన మూడు రోజుల పర్యటనకు మెదక్‌ జిల్లాకు వచ్చారు. జలశక్తి అభియాన్‌ కింద నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉద్యాన, ఇంజనీరింగ్‌ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లోని వీడియా కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జలశక్తి అభియాన్‌ కింద 2019 నుంచి చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పాటు పర్యావరణ సమతుల్యానికి చేపట్టిన అడవుల పెంపకం, పల్లె, బృహత్‌ పల్లె ప్రకృతి వనాల పెంపకాలు బాగున్నాయన్నారు. మణిపూర్‌ రాష్ట్రంలో అడవులు తగ్గాయని, అలాగే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు ఉన్నాయిని చెప్పారు. రైతులు తక్కువ నీటితో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. 

నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలి

కలెక్టర్‌ హరీష్‌ మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో నీటి వనరులను సంరక్షించుకోవడంతో పాటు పొదుపుగా వాడుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు. జిల్లాలో గత ఆరు, ఏడు సంవత్సరాల నుంచి నీటి వనరులను సంరక్షించుటకు పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. వాన నీటిని, సంప్రదాయ నీటి వనరులను సంరక్షించుటకు గ్రామీణ ఉపాధి హామీ పథకం, సోషల్‌ ఫారెస్ట్రీ, నీటి పారుదల తదితర లైన్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా అనేక చర్యలు చేపట్టామన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ, 539 నివాస ప్రాంతాల్లో చేపట్టిన పల్లె ప్రకృతివనాలు, 21 మండలాలల్లో చేపట్టిన బృహత్‌ పల్లె ప్రకృతివనాలు, హరితహారం కార్యక్రమాల ద్వారా వాతావరణ సమతుల్యతతోపాటు భూగర్భ జలాల నీటి మట్టం 7 మీటర్ల మేర పెరిగిందన్నారు. జిల్లాలోని 2,389 చెరువులు పూర్తి నీటి నిలువ సామర్థ్యంతో ఉన్నాయన్నారు. జిల్లాలో అమలవుతున్న జలశక్తి అభియాన్‌ కార్యక్రమాలను డీఆర్‌డీవో శ్రీనివాస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటెషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో డీపీవో తరుణ్‌కుమార్‌, లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఏంపీడీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.

16వ జాతీయ గణాంక దినోత్సవం

భారత ప్రణాళిక నిర్దేశకుడు, దేశ మొదటి ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడు ప్రశాంత్‌ చంద్ర మహలనోబిస్‌ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో 16వ జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ హరీష్‌ పాల్గొని జిల్లా గణాంక దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. శాస్త్రీయ పద్ధతిలో గణాంకాలు సేకరిస్తే ఖచ్చితత్వం ఉంటుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2022-06-30T05:23:23+05:30 IST