ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచి.. మూడో పంటకూ నీరందిస్తాం

ABN , First Publish Date - 2021-02-25T05:44:40+05:30 IST

ఘనపూర్‌ ఆనకట్ట ఎత్తుపెంచి మూడో పంటకూ నీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలియజేశారు. ప్రస్తుతం రెండు పంటలకు నీరందిస్తున్నామని, ఆనకట్ట ఎత్తు పెంచిన తరువాత మూడో పంటకు కూడా నీరందిస్తామన్నారు. కాళేశ్వరం జలాలతో సింగూరు ప్రాజెక్ట్‌ను నింపి మెదక్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. బుధవారం మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట, మెదక్‌, పాపన్నపేట, మనోహరాబాద్‌ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.

ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచి.. మూడో పంటకూ నీరందిస్తాం
చిన్నశంకరంపేటలో ఉప విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మారెడ్డి, కలెక్టర్‌ హరీశ్‌ తదితరులు

మెదక్‌లో విద్యుత్‌ సీజీఎం కార్యాలయం 

ఉగాది తరువాత సొంత స్థలంలో ఇంటి నిర్మాణ పథకం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


ఆంధ్రజ్యోతి మెదక్‌ ప్రతినిధి, ఫిబ్రవరి 24 :  ఘనపూర్‌ ఆనకట్ట ఎత్తుపెంచి మూడో పంటకూ నీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలియజేశారు. ప్రస్తుతం రెండు పంటలకు నీరందిస్తున్నామని, ఆనకట్ట ఎత్తు పెంచిన తరువాత మూడో పంటకు కూడా నీరందిస్తామన్నారు. కాళేశ్వరం జలాలతో సింగూరు ప్రాజెక్ట్‌ను నింపి మెదక్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. బుధవారం మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట, మెదక్‌, పాపన్నపేట, మనోహరాబాద్‌ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మెదక్‌ పట్టణంలో రూ.1.85 కోట్లతో నిర్మించనున్న విద్యుత్‌ ఎస్‌ఈ కార్యాలయానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న మెదక్‌ పట్టణంలో విద్యుత్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. రూ.2 కోట్లతో పట్టణంలో 33/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్‌ఈ కార్యాలయం, సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు అందుబాటులో ఉండేలా విద్యుత్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(సీజీఎం) కార్యాలయాన్ని మెదక్‌ పట్టణంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్‌ హరీశ్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనాథ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బట్టి జగపతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


చైర్మన్‌ సాబ్‌ కోతులను పంపించవా ? 

మెదక్‌ పట్టణంలో విచ్చలవిడివిగా తిరుగుతున్న కోతులను అడవుల్లోకి తరలించాలని మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌కు మంత్రి హరీశ్‌రావు సూచించారు. త్వరలోనే కోతుల బెడదల లేకుండా చూస్తానని చైర్మన్‌ మంత్రికి తెలిపారు. 


త్వరలో రైతులకు రుణమాఫీ

పాపన్నపేట, పిబ్రవరి 24: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీని త్వరలోనే పూర్తిగా చెల్లిస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం పాపన్నపేట మండలంలోని చిత్రియాల్‌, గాజులగూడెం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం గాజులగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ఇక్కడి పథకాలను చూసి గరీబ్‌ యోజన ద్వారా దేశమంతా ఇవ్వాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. చిత్రియాల్‌లో 48 మంది, గాజులగూడెంలో 40 మందికి స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కోరిక మేరకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇచ్చామని తెలియజేశారు. ఉగాది తరువాత సొంత స్థలం ఉంటే ఇళ్ల కట్టిస్తామని హామీ ఇచ్చారు. గత ఎమ్మెల్యేల కాలంలో నీళ్ల విడుదల చేయాలని హైదరాబాద్‌లో మంత్రుల చుట్టూ ప్రదక్షిణ చేశామని గుర్తుచేశారు. పద్మమ్మ ఎమ్మెల్యే అయిన తర్వాత సింగూరు నీటి విడుదలలో జాప్యం జరగడం లేదన్నారు. సింగూరు నీళ్లు మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల ప్రజల హక్కు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హరీశ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ చందనారెడ్డి, వైస్‌ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ కుమ్మరి జగన్‌, గడీల శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచు సులోచన పాల్గొన్నారు.


బీడు భూములు సాగులోకి

చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 24 : గతంలో విద్యుత్‌ కోతలతో గుంట భూమి కూడా తడవని దుస్థితి ఉండేదని, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాతో బీడు భూములు సాగులోకి వచ్చాయన్నారు. చిన్నశంకరంపేటలో రూ.12.35 లక్షల నిధులతో మంజూరైన 132/33 కేవీ ఉప విద్యుత్‌ కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. పీఎం గిరివికాస్‌ పథకం కింద మంజూరైన వ్యవసాయ బోరు మోటార్లను ఖాజాపూర్‌ తండాకు చెందిన 9 మంది గిరిజన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా నాలుగు నెలల్లో గోదావరి జలాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఖాజాపూర్‌ గ్రామంలోని కవేరి పరిశ్రమ కోసం సబ్‌స్టేషన్‌ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ మాధవి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్‌లు రాజిరెడ్డి, యాదగిరియాదవ్‌, ఎంపీటీసీ రాధిక, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 


సెల్‌ఫోన్‌ గేములొచ్చి సోమరులను చేస్తున్నాయి!

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), ఫిబ్రవరి 24 : ‘ఈ మధ్యకాలంలో అందరూ ఫోన్లకు అలవాటు పడిపోయారు.. ఫేస్‌బుక్‌, ట్విటరు, వాట్సా్‌పతో పాటు పబ్జి లాంటి సెల్‌ఫోన్‌ గేమ్‌లు సోమరిపోతులుగా తయారు చేస్తున్నాయి’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కూర్చున్న కుర్చీలోనూ, పడుకున్న మంచం మీదనే సెల్‌ఫోన్లతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. బుధవారం మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లిలో కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఎన్ని ఆస్తులున్న, ఎంత చదివిన ఆరోగ్యంలేని జీవితం ఎందుకు పనికి రాదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్‌ కావాలని, ఇంజనీరు కావాలని, ఐఏఎస్‌ కావాలి అని కోరుకుంటున్నారని, అంతకంటే ముందు ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. పిల్లల్ని స్కూల్‌కు తీసుకెళ్లినట్లుగా ఉదయం 6 గంటలకు ప్లేగ్రౌండ్‌కు తీసుకెళ్లాలని కోరారు. ఇండస్ట్రీయల్‌ పార్కులో భూముల కోల్పోయిన రైతులకు ప్లాట్ల విషయాన్ని టీఎ్‌సఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితో మాట్లాడి ఏర్పాటు చేస్తానంటూ గ్రామస్థులకు మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే క్రీడా మైదానం ఏర్పాటు చేయిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, ఎంపీపీ పురం నవనీతారవి, సర్పంచు నరాల ప్రభావతిపెంటయ్య పాల్గొన్నారు.


మాస్టారుగా మంత్రి హరీశ్‌రావు

పాపాన్నపేట, ఫిబ్రవరి 24 : పాపన్నపేట మండలంలో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు కొత్తపల్లి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎ్‌సను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. కరోనా తరువాత పాఠశాలలు ఎలా నడుస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. భవిష్యత్‌లో ఏమవుతారంటూ విద్యార్థులను ప్రశ్నించారు. డాక్టర్‌ కావాలంటే ఏం చదువాలో తెలుసా ? డాక్టరైతే అమెరికా వెళ్తావా? ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తావా? అంటూ విద్యార్థిని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు గురించి ఎంతమందికి తెలుసని అడిగిన హరీశ్‌రావు... పీవీ జీవిత చరిత్రపై విద్యార్థులతో మాట్లాడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యాబోధన, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై ఆరాతీశారు. విద్యార్థులు బాగా చదివే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు మంత్రి సూచించారు.

Updated Date - 2021-02-25T05:44:40+05:30 IST