ఆర్‌యూలో ఎంఈడీ కోర్సు రాదా!

ABN , First Publish Date - 2021-01-24T05:58:24+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీలో 2015 నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎంఈడీ) కోర్సు నిలిచి పోయింది.

ఆర్‌యూలో ఎంఈడీ కోర్సు రాదా!

  1. ఆరేళ్ల నుంచి ఆగిన ఎంఈడీ
  2. పట్టించుకోని వర్సిటీ అధికారులు
  3. గత వీసీ ఆదేశాలు బుట్టదాఖలు
  4. వర్సిటీ అధికారుల తీరుపై విమర్శలు


కర్నూలు(అర్బన్‌), జనవరి 23:  రాయలసీమ యూనివర్సిటీలో 2015 నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఎంఈడీ) కోర్సు నిలిచి పోయింది. వర్సిటీకి అనుబంధంగా 10 ఎంఈడీ కళాశాలలు ఉన్నాయి. ఏవీ ప్రసాదరావు వీసీగా ఉన్న సమయంలో ఆ కోర్సుకు ప్రాధాన్యం లేదని, రద్దు చేయాలని ప్రయత్నించారు. ఎంఈడీ కోర్సుకు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులను మరో కోర్సుకు బదీలీ చేయాలని చూశారు. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఆప్పట్లో అందోళన చేశాయి. అ తర్వాత వచ్చిన ఇన్‌చార్జి వీసీ ఎంఎం నాయక్‌ దృష్టికి సమస్యను ఎంఈడీ విభాగాధిపతి తీసుకెళ్లారు. ప్రభుత్వం మంజూరు చేసిన కోర్సును ఎలా రద్దు చేస్తారని ఇన్‌చార్జి వీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కమిటీని ఏర్పాటు చేసి, కోర్సును కొనసాగించాలని గత ఏడాది సెప్టెంబరు 29న ఆదేశాలు ఇచ్చారు. కానీ వర్సిటీ అధికారులు పట్టించు కోలేదు. ఈ విషయమై ఎంఈడీ విభాగం ఉద్యోగులు రెక్టార్‌ వద్దకు వెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తు న్నాయి. ఎన్‌సీటీ అనుమతి ఉండి ప్రభుత్వం మంజూరు చేసిన కోర్సును రద్దు చేయడం ఏమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీ అనుబంఽ దంగా 10 ఎంఈడీ కాలేజీల్లో ఏటా 400 నుంచి 550 మంది విద్యార్థులు పీజీ పరీక్షలు రాస్తున్నారని, ప్రాధాన్యం లేకుంటే ఇంతమంది ఎలా రాస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.


కోర్సు ఇలా..

ఆర్‌యూ క్యాంపస్‌లో 50 సీట్లతో 2005లో ఎంఈడీ కోర్సును ప్రవేశ పెట్టారు. 2015 నుంచి ఆరుగురు అధ్యాపకులు కాంట్రాక్టు పద్ధతిన బోధిస్తున్నారు. వీరికి ఇంతవరకు జీతాలు కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో కోర్సును ఎత్తివేస్తున్నామని ప్రకటించి గత ఏడాది పీజీ సెట్‌కు వర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. 


వారు ఎక్కడికి వెళతారు..?

ఎంఈడీ విభాగానికి 2017లో ఒక ఫ్రొఫెసర్‌ను నియమించారు. ఆయన రాజీనామా చేసి వెళ్లారు. ఈ కోర్సుకు 2 అసోసియేట్‌, 4 అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ పోస్టులు మంజూరు అయ్యాయి. వీటి భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు విడుదల అయ్యే సమయంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో నియమకంలో జాప్యం జరుగుతోంది. ఆ పోస్టుల భర్తీకి కోర్టు అనుమతి ఇస్తే, వారు ఎక్కడికి వెళతారన్న ప్రశ్న తలెత్తుతోంది. 


కమిటీ నివేదిక

పీజీ సెట్‌ నిర్వహణపై ఏర్పాటైన కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఎన్‌సీటీ అప్రూవల్‌ ఉంటే ఎంఈడీ కోర్సును కొనసాగించు కోవాలని కమిటీ సూచించింది. ఎంఈడీ విభాగం వారు కూడా ఎన్‌సీటీ సైట్‌లో ఆర్‌యూకు అనుమతి ఉందని చెబుతున్నారు. కానీ యూనివర్సిటీలో ఓ అధికారి అడ్డుపడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నాయి.


ఎత్తివేతకు కుట్ర.. 

ఎంఈడీ కోర్సు ఎత్తివేయడం దుర్మార్గం. ప్రైవేట్‌ కళాశాలలకు లబ్ధి చేకూర్చేందుకు ఓ అధికారి ఇలా కుట్ర చేస్తున్నారు. మంజూరైన కోర్సును మరో శాఖకు మళ్లించడం దారుణం. వర్సిటీ అధికారుల నిర్ణయంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. - శ్రీరాములు, విద్యార్థి జేఏసీ కన్వీనర్‌


కమిటీ వేశాము..

ఎంఈడీ కోర్సుపై పాలక మండలి ఆధ్వర్యంలో కమిటీ వేశాం. నివేదిక వచ్చాక కోర్సు కొనసాగించాలా వద్దా.. అనే అంశంపై నిర్ణయం తీసుకుంటాం. ఎంఈడీకి అప్రూవల్‌ లేదు. అందుకేఎన్‌సీటీకి లేఖ రాశాం. అక్కడి నుంచి వచ్చే స్పందనపై కోర్సు కొనసాగింపు ఆధారపడి ఉంటుంది. కొనసాగింపునకు పాలక మండలి అనుమతి తీసుకోవాలి. - ప్రొఫెసర్‌ ఆనందరావు, ఉపకులపతి

Updated Date - 2021-01-24T05:58:24+05:30 IST