యాంత్రీకరణతో సేద్యం లాభసాటి

ABN , First Publish Date - 2021-04-17T05:28:10+05:30 IST

చిన్న, సన్న కారు రైతులకు అవసరమైన యంత్రాలను, పనిముట్లను కస్టమ్‌ రూలింగ్‌ సెంటర్ల ద్వారా అందుబాటులోకి తెస్తే వ్యవసాయం లాభసాటి అవుతుందని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.త్రిమూర్తులు అన్నారు.

యాంత్రీకరణతో సేద్యం లాభసాటి

  1. దిగుబడి పెరిగే వంగడాలపై పరిశోధనలు 
  2. పరిశోధన ఫలితాలను రైతులు అందుకోవాలి 
  3. ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ త్రిమూర్తులు 
  4. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో జడ్‌ఆర్‌ఈఏసీ సమావేశం ప్రారంభం


నంద్యాల, ఏప్రిల్‌ 16: చిన్న, సన్న కారు రైతులకు అవసరమైన యంత్రాలను, పనిముట్లను కస్టమ్‌ రూలింగ్‌ సెంటర్ల ద్వారా అందుబాటులోకి తెస్తే వ్యవసాయం లాభసాటి అవుతుందని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.త్రిమూర్తులు అన్నారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అత్యల్ప వర్షపాత మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి (జడ్‌ఆర్‌ఈఏసీ) సమావేశం జరిగింది. మొదటి రోజు కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ డైరెక్టర్లు, పాలక మండలి సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలి రోజు సమావేశం ఏడీఆర్‌ డాక్టర్‌ టి.మురళీకృష్ణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పరిశోధనా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ త్రిమూర్తులు మాట్లాడుతూ అత్యల్ప వర్షపాతం నమోదయ్యే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అన్ని రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారని అన్నారు. రైతులకు వ్యవసాయం లాభసాటి కావాలంటే క్షేత్రస్థాయిలో యాంత్రీకరణను పెంచాలని అన్నారు. అలాగే సేంద్రియ పద్ధతులను రైతులందరూ అనుసరించి ముందుకు సాగాలని అన్నారు. సేంద్రియ వ్యవసాయం చేయడానికి స్వర్ణ అనే వరి రకం అనువైనదని, మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ జోన్‌ నుంచి విడుదలైన వేరుశనగ రకం కదిరి లేపాక్షి, శనగ రకాలు ఎన్‌బీఈజీ 452, ఎన్‌బీఈజీ 119 మంచి ఫలితాలు ఇచ్చాయని అన్నారు. అనంతపురంలోని పరిశోధనా స్థానంలో వాతావరణ ఆధారిత పరిశోధనలు జరుగుతున్నాయని, ఈ సమాచారాన్ని బులెటిన్స్‌ రూపంలో రైతులకు అందిస్తామని అన్నారు. 2019-20కి సంబంధించి జడ్‌ఆర్‌ఈఏసీ సమావేశాన్ని కొవిడ్‌ -19 కారణంగా నిర్వహించలేదని, ప్రస్తుతం తగు జాగ్రత్తలతో రెండు రోజుల పాటు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సలహా మండలి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. విస్తరణ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు మాట్లాడుతూ అధిక దిగుబడి ఇచ్చే కొత్తవంగడాల రూపకల్పనకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని అన్నారు. పంటల్లోని యాజమాన్య పద్ధతులను రైతుల పొలాల్లో పరిశోధనలు చేస్తున్నామని, సీఎఫ్‌ఎల్‌డీల ద్వారా మేలైన రకాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తోపాటు రైతుల సమస్యలకు తగినట్లు శాస్త్రవేత్తలు పరిశోధనా అంశాలను రూపొందించుకోవాలని అన్నారు. వ్యవసాయ శాఖ కర్నూలు జిల్లా జేడీ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ ఈ ఏడాదిలో వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల పత్తి, వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని అన్నారు. అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ మాట్లాడుతూ జడ్‌ఆర్‌ఈఏసీ సమావేశంలోని అంశాలను రైతులకు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామని అన్నారు. విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ విజయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ వివిధ పంటల్లో విడుదలైన కొత్త వంగడాలతో రైతులు సాగు చేసే పాత రకాలను రీప్లేస్‌ చేయాలని అన్నారు. ఏపీసీడ్స్‌, ఎన్‌ఎస్‌సీ సహకారంతో నూతన వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకరాగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి, ఏపీడీఎంపీ డైరెక్టర్‌ జయదేవ్‌, మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, కర్నూలు, అనంతపురం జిల్లాల వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏవోలు, రైతులు పాల్గొన్నారు

Updated Date - 2021-04-17T05:28:10+05:30 IST