Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాంత్రీ‘కరుణ’ లేదా..?

వ్యవసాయ పరికరాల రాయితీకి ‘కోత’

వరి కోత యంత్రాలు అందించని ప్రభుత్వం

ఒక యంత్రమూ అందుబాటులోని వైనం

ఆధునిక వ్యవసాయం.. ప్రకటనలకే పరిమితం!

కోత యంత్రాలు లేక రైతుల అగచాట్లు


రోలుగుంట, డిసెంబరు 8: వ్యవసాయ సాగులో ఖర్చు తగ్గించడానికి.. ప్రక్రియ త్వరితగతిన పూర్తికావడానికి ప్రభుత్వాలు యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం రాయితీపై పరికరాలను సైతం అందిస్తున్నాయి. సంబంధిత అధికారులు, ఉద్యోగులతో రైతులకు అవగాహన కల్పించాయి. ఇది మొన్నటి మాట! తాజాగా ప్రభుత్వం వ్యవసాయ పరికరాలపై ‘కోత’ విధించింది. గతంలో వ్యక్తిగతంగా రైతులకు రాయితీపై పరికరాలను అందించగా, ఇప్పుడు గ్రూపునకు ఒకటే ఇస్తుంది. అంతేకాకుండా మండలానికి ఉన్న ఒక్క కోత యంత్రాన్నీ ఎత్తేసింది. ఫలితంగా వరి కోతలకు రైతులు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది.

ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో మండలంలోని 24 పంచాయతీల్లో రైతులు విరివిగా వరి సాగు చేపట్టారు. 70 శాతం వరి చేలు కోత దశకు చేరాయి. యంత్రాలను వినియోగిస్తేనే తప్ప పంటను కోసి పూర్తి స్థాయిలో ఇంటికి చేర్చలేని పరిస్థితి. ప్రస్తుతం రాయితీపై యంత్రాలు అందుబాటు లేవు. సరికదా! గతంలో ప్రతీ మండలానికి ఓ కోత యంత్రం ఉండేది. దాన్ని అద్దె ప్రాతిపదికన రైతులు వినియోగించేవారు. ఇప్పుడు అది కూడా లేకపోవడంతో వరి కోతలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. 


యంత్రాలకు రాయితీ కోత

గతంలో ప్రభుత్వం 50 నుంచి 60 శాతం రాయితీపై యంత్రాలను రైతులకు అందించేవి. యాంత్రీకరణ పథకం కింద రోటోవేటర్లు, తైవాన్‌స్ర్పేలు, సీడ్‌కం ఫర్టిలైజర్‌ డ్రిల్స్‌, టార్ఫాలిన్‌లు, కోత మిషన్లు, పవర్‌ టిల్లర్లను 50 శాతం రాయుయితీపై ఇచ్చేది. దీంతో దాదాపు రూ.30 లక్షల విలువ చేసే వరి కోత యంత్రం రూ.15 లక్షలకే లభించేంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతుభరోసా కేంద్రాల ద్వారా వ్యక్తిగతంగా కాకుండా రైతులు గ్రూపులుగా ఏర్పడితే పరికరాలు అందిస్తామని ప్రకటనలు జారీ చేసినా కార్యరూపం దాల్చలేదు.


కస్టమర్‌ హైరింగ్‌ కేంద్రాల సేవలు నిల్‌

కస్టమర్‌ హైరింగ్‌ కేంద్రాలను నిర్వహించడానికి అన్ని ఆర్‌బీకేల్లో వ్యవసాయ శాఖ 5-10 మంది రైతులను గ్రూపలుగా ఏర్పాటు చేసింది. మండలంలోని 16 గ్రామ సచివాలయాల్లో ఆర్‌బీకేలతో పాటు కస్టమర్‌ హైరింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రూపులను ఏర్పాటు చేశారు. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలు విలువ చేసే యంత్రాలను కోనుగోలు చేయడానికి రైతులు ముందుకు వస్తే రాయితీ కల్పించనున్నాయి. అయితే ప్రభుత్వ నిబంధనలతో రైతులు ముందుకు రాకపోవడంతో యాంత్రీకరణ పథకం అందడం లేదు. మండలంలోని శరభవరం, కె.నాయుడుపాలెం గ్రామాల్లో ఏడాదిన్నర క్రితమే కస్టమర్‌ హైరింగ్‌ కేంద్రం ద్వారా యంత్రాల కోసం సంబంధించి రుసుం ముందుగా చెల్లించినా, నిబంధనల కారణంగా ఇప్పటికీ యంత్రాలు అందలేదు.


గ్రూపులుగా ఏర్పడితే పరికరాలు

-ఎస్‌.విజయలక్ష్మి. ఏఓ, రోలుగుంట

 కస్టమర్‌ హైరింగ్‌ కేంద్రాల ద్వారానే యాంత్రీకరణ పథకం కింద పరికరాలు అందుతాయి. గతంలో వ్యక్తిగతంగా పరికరాలను రాయితీపై అందించేవారు. ప్రస్తుతం ఐదు నుంచి పది మంది రైతులతో గ్రూపుగా ఏర్పడితే రాయితీ పరికరాలను అందిస్తున్నాం. శరభవరం, కె.నాయుడుపాలెం కేంద్రాల రైతులు యంత్రాల కోసం చలానా చెల్లించారు. ఇంకా పరికరాలు రావాల్సి ఉంది.


Advertisement
Advertisement