రైతుల్లో మీ‘డర్‌’

ABN , First Publish Date - 2021-09-29T06:36:12+05:30 IST

రైతులందరికీ వ్యవసాయ కరెంటు ఉచితం ఇది గతం మాట. అసైన్డ్‌ భూముల రైతులకు ఉచితం కట్‌ ఇది నేటి మాట. మిగతా రైతుల పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.

రైతుల్లో మీ‘డర్‌’

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లపై ఆందోళన 

నగదు బదిలీ అని చెబుతున్నా నమ్మలేని పరిస్థితి

రాయితీలు ఎత్తివేస్తారని  ఆందోళన

డిక్లరేషన్‌కు వెనకడుగు వేస్తున్న అన్నదాతలు

అంగీకారపత్రాలు ఇవ్వకపోతే కనెక్ష న్‌ కట్‌

బెదిరిస్తున్న విద్యుత్‌ శాఖ సిబ్బంది

బేస్తవారపేట మండలంలో 4,148 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా  లైన్‌మెన్లు ఇప్పటివరకు 3,840 మంది రైతుల నుంచి ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, 1బీతోపాటు డైరెక్టు బెనిఫిషర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫారం మీద రైతు సంతకంతో వివరాలు సేకరించారు. అసైన్డ్‌ భూముల్లోని కనెక్షన్ల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు.

యర్రగొండపాలెం మండలంలో 6,435 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా  ఇప్పటివరకు 4,878 మంది రైతుల నుంచి లైన్‌మన్లు డిక్లరేషన్‌ తీసుకున్నారు. ఇంకా 1,537మంది అంగీకారం తెలపలేదు. తమ ఉచిత కనెక్షన్లు పోతాయన్న భయంతో వారంతా సంతకాలు, వివరాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని విద్యుత్‌ సిబ్బంది చెబుతున్నారు.

ఇదీ జిల్లాలో ఉచిత విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించే వ్యవహారానికి సంబంధించిన పురోగతి. చాలా గ్రామాల్లో రైతులు డిక్లరేషన్‌ ఇచ్చేందుకు జంకుతున్నారు. విద్యుత్‌ అధికారులు మాత్రం బలవంతంగా వారి వద్ద నుంచి సంతకాలు సేకరిస్తున్నారు. అసైన్డ్‌ భూముల్లో వేసిన బోర్లకు మాత్రం గతంలో ఒకరి పేరుతో కనెక్షన్‌ ఉండగా, ప్రస్తుతం సాగు చేస్తున్న రైతుల పేర్లు వేరు ఉన్నాయి. దీంతో అటువంటి కనెక్షన్ల రైతుల వివరాలు తీసుకోవడం లేదు. విద్యుత్‌ కనెక్షన్‌, పట్టాదారు పుస్తకం, 1బీ అన్నీ ఒకరి పేరుతో ఉన్న వాటి వివరాలను మాత్రమే సేకరిస్తున్నారు. 

ఒంగోలు (క్రైం)/బేస్తవారపేట/ఎర్రగొండపాలెం, సెప్టెంబరు 28 : రైతులందరికీ వ్యవసాయ కరెంటు ఉచితం ఇది గతం మాట. అసైన్డ్‌ భూముల రైతులకు ఉచితం కట్‌ ఇది నేటి మాట. మిగతా రైతుల పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మీటర్లు బిగించిన తర్వాత కరెంట్‌ బిల్లు ఎక్కువ వస్తే పరిస్థితి ఏమిటన్నదానిపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో మీటర్ల ఏర్పాటుకు సంబంధించి డిక్లరేషన్‌ ఇవ్వడానికి వారు జంకుతున్నారు. ఏదిఏమైనా రైతుల గుండెల్లో విద్యుత్‌ మీటర్లు పరిగెడుతున్నాయి. గతంలో రైతులు వ్యవసాయం చేసుకునేందుకు వినియోగించే విద్యుత్‌ ఉచితంగా ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఆ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించిన అంగీకారపత్రాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ మేరకు ఇప్పటికే గ్రామాల్లో విద్యుత్‌ సిబ్బంది తిరుగుతున్నారు. డిక్లరేషన్‌ ఇవ్వకుంటే  విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామంటూ వారు బెదిరిస్తున్నారు.


డిక్లరేషన్‌ ఇస్తేనే మరమ్మతులు

 ఎక్కడైనా సమస్య వచ్చి మరమ్మతులు చేయాలన్నా రైతులు మీటర్‌ ఏర్పాటుకు అంగీకారపత్రం ఇస్తేనే సిబ్బంది వస్తారని అధికారులు సమాధానం ఇస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు అంగీకారపత్రాల మీద సంతకాలు చేయకపోతే మీ బిల్లులు మీరే చెల్లించాలని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉండగా అసైన్డ్‌ రైతులది మరో సమస్య. ప్రభుత్వ, అసైన్డ్‌, పోరంబోకు భూముల్లోని ఉచిత విద్యుత్‌ కనెక్షన్లకు మంగళం పాడబోతున్నారన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. వారి వద్ద నుంచి ఎలాంటి అంగీకారపత్రాలు తీసుకోకపోవడమే అందుకు కారణమని పలువురు అంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు నగదు బదిలీ పఽథకం అమలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ మేరకే ప్రస్తుతం రైతుల నుంచి అంగీకారపత్రాలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. 


జిల్లావ్యాప్తంగా 1.80లక్షల కనెక్షన్లు

జిల్లాలో 1.80లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వాటికి మీటర్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికి సుమారు 70శాతం రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారు. అయితే మిగిలిన వారిలో పదిశాతం  ప్రభుత్వ భూములు సాగు చేసుకునే వారు కాగా మిగిలిన వారు వివిధ కారణాలతో మీటర్ల ఏర్పాటుకు అంగీకరించడం లేదు. అయితే సుమారు పది నుంచి పన్నెండు వేలమంది వరకు ప్రభుత్వ భూములు సాగు చేసేవారు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలు. వారంతా తమ పరిస్థితేమిటోనని ఆందోళనలో ఉన్నారు. డిక్లరేషన్‌ అడగలేదంటే పూర్తిగా కనెక్షన్‌ తీసేస్తారేమోనని భయపడుతున్నారు. దీనిపై స్పష్టత లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయి తే అధికారులు మాత్రం అసైన్డ్‌ భూములకు సంబంధించి అన్నీ పక్కాగా ఉంటేనే కనెక్షన్లకు డిక్లరేషన్‌ తీసుకుంటామని చెబుతున్నారు. చాలావరకు భూమి ఒకరిదైతే కనెక్షన్‌ మరొకరి పేరుపై ఉందని అందువల్ల వారి వద్ద నుంచి తీసుకోవడం లేదని చెబుతున్నారు.


Updated Date - 2021-09-29T06:36:12+05:30 IST