రోడ్లపై మాంసం విక్రయాలు

ABN , First Publish Date - 2022-01-18T04:53:02+05:30 IST

ఆదివారం వచ్చిందంటే చాలు పట్టణంలో పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జనమయమౌతున్నాయి.

రోడ్లపై మాంసం విక్రయాలు
శ్రీరాంనగర్‌లో రోడ్డు పై మాంసం విక్రయాల వద్ద గుంపులు గా వున్న జనం

గుంపులు గుంపులుగా జనం ఫవిస్తరిస్తున్న కొవిడ్‌ మహమ్మారి ఫపట్టించుకోని అధికారులు

ప్రొద్దుటూరు అర్బన్‌ జనవరి 17 : ఆదివారం వచ్చిందంటే చాలు పట్టణంలో పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జనమయమౌతున్నాయి. రెండేళ్ళుగా రెండు వేవ్‌లతో కరోనా విశ్వరూపాన్ని చవి చూసి నా, పిట్టల్లా జనం రాలిపోయినా, వారిలో ఏమాత్రం భయం బెరుకు లేకుండా పోయింది. గుంపులు గుంపులుగా జనం రోడ్లపై మాంసం బండ్ల వద్ద ఎగబడుతున్నారు. బ్రాందీ షాపులు, టీ బంకులు, మాల్స్‌లలో గుంపులుగా జనం పోగవుతున్నారు. ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, మాస్కులు పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆలోచేనే లేకుండా వ్యవహరించటం భయాందోళనలు కలిగిస్తున్నాయి. వ్యాపారులు రోడ్ల మీద జీవాలను వధించి తోపుడు బండ్లమీద విక్రయాలు జరుపుతున్నారు. మేకలు, పొట్టేళ్ళు ఆరోగ్య కరమైనవా లేదా అని పరీక్షలు చేపట్టే దిక్కే లేరు. మున్సిపాలిటీ ఏళ్ళ తరబడి జంతువధశాలను వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్ల ఎక్కడబడితే అక్కడ జీవాలను వధిస్తున్నారు. వాటి వ్యర్థాలన్నీ కాలువలు, రోడ్లు, చెత్త కుప్పల్లో వేస్తున్నారు. రక్తం సైతం రోడ్లపైఉండి ఈగలు, దోమలు ముసురుతుంటాయి. ఇదంతా కళ్ళ ముందే సాగుతున్నా మున్సిపల్‌ అధికారులు చోద్యం చూస్తుంటారు. రోగాలు ప్రబలి ప్రజలు అనారోగ్యం పాలయ్యాక మేల్కొని ప్రచారాలు చేపడతారు.

ప్రజాఆరోగ్యశాఖ నిర్లక్ష్యం: మున్సిపాలిటీలో ప్రజా ఆరోగ్య శాఖకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు రోడ్లపై రోజు మాంసం విక్రయాలు జరుగుతున్ని, పారిశుధ్య సమస్య ఏర్పడుతున్నప్పటికీ వాటి పై దృష్టిపెట్టలేదనే విమర్శలున్నాయి. కొందరు వారం, వారం తోపుడు బండ్లపై మాంసం విక్రయాలు జరిపే వారివద్దనుంచి మాముళ్ళు తీసుకుంటున్నారనే ఆరోపణలు వున్నాయి. వార్డుకు ఒక శానిటరీ సెక్రటరీ వచ్చినప్పటికీ  ఈ సమస్యను పట్టించుకున్నట్లులేదు.

పెరుగుతున్న కొవిడ్‌ కేసులు:  కొద్ది రోజులుగా కొవిడ్‌ కేసులు జిల్లాలో పెరిగిపోతున్నాయి. అధికారులు కొవిడ్‌ కేంద్రాలనూ సిద్ధం చేశారు. కానీ ప్రజలు గుంపులుగా తిరగటం, మాస్కులు ధరించకపోవటం, భౌతిక దూరం పాటించకపోవడంపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల జనంలో నిర్లక్ష్య భావన పెరిగిపోతోంది. 

కొవిడ్‌ ఆంక్షలు ఉన్నాయి :  నజీర్‌ అహ్మద్‌,  తహసీల్దారు

కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ముందస్తుగా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం. కొవిడ్‌ ఆంక్షలు వున్నాయి. ప్రజలు టీ అంగళ్ళు, హోటళ్లు, బ్రాందీ షాపులు, మాంసం దుకాణాల వద్ద గుంపులుగా వుంటున్నారు. కొవిడ్‌ ఆంక్షలుపాటించాలి.లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. కొవిడ్‌ నిబంధననలు మరింత కఠినతరం చేస్తాం.

Updated Date - 2022-01-18T04:53:02+05:30 IST